శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల తొలిదశ ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో పటిష్ఠమైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాయి. అనుమానాస్పద ప్రాంతాలలో బలగాలు గస్తీ నిర్వహించాయి. సురక్షితమైన ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను ఉంచామని, మొత్తం 51.76% పోలింగ్ నమోదైనట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కెకె శర్మ తెలిపారు.
ఈరోజు 43 డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్(డీడీసీ) స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో 25 కశ్మీర్లో ఉండగా జమ్మూ ప్రాంతంలో 18 స్థానాలు ఉన్నాయి. మొదటి దశ ఎన్నికల కోసం 7,03,620 మంది ఓటర్లకుగానూ మొత్తం 2,644 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొదటి దశ డీడీసీ, సర్పంచ్, ఉప ఎన్నికల్లో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 280 డీడీసీ, 12,153 పంచాయతీలకు 8 దశల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు.
పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పిఎజిడి), బీజేపీ, మాజీ మంత్రి బుఖారీ స్థాపించిన అప్ని పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీల సమ్మేళనం అయిన పీఎజీడీ, జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment