ఫిబ్రవరి 8న పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. విపరీతమైన ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ.. దేశంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అనేక ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నడుమ పాక్ ప్రజలు జీవనం సాగిస్తున్నారు.
పాకిస్తాన్ ద్విసభ పార్లమెంటరీ వ్యవస్థను కలిగి ఉంది. దీనిలో జాతీయ అసెంబ్లీలోని పలువురు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉన్నాయి. వాటిలో 266 స్థానాలకు ప్రజలు ఓటు వేస్తారు. 60 సీట్లు మహిళలకు, 10 సీట్లు ముస్లిమేతరులకు రిజర్వ్ చేశారు.
పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 141 సీట్లు, సింధ్‌లో 75, ఖైబర్ పఖ్తుంక్వాలో 55, బలూచిస్థాన్‌లో 20, ఇస్లామాబాద్‌లో మూడు సీట్లు ఉన్నాయి. పాకిస్తాన్‌లో ప్రస్తుతం 12.85 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో సగానికి పైగా ఉంది. 6.9 కోట్ల మంది పురుష ఓటర్లు ఉండగా, 5.9 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నమోదైన ఓటర్లలో కూడా 44 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. 2018 నుండి, దేశంలో ఓటర్ల సంఖ్య 2.25 కోట్లు పెరిగింది. అందులో 1.25 కోట్ల మంది మహిళలు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 52 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పాకిస్తాన్ ఎన్నికల్లో 5,121 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 4,806 మంది పురుషులు, 312 మంది మహిళలు, ఇద్దరు లింగమార్పిడి అభ్యర్థులు ఉన్నారు. 167 నమోదిత రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా మొత్తం 5,121 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల విషయానికొస్తే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టో, ఆసిఫ్ అలీ జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ). ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. ఫలితంగా పీటీఐ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీకి దిగారు. ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం మొత్తం 90,582 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలో దాదాపు 17,500 ‘అత్యంత సున్నితమైన’ పోలింగ్ స్టేషన్లు. పాక్ ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment