వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీకి దిగడంతో అతని ప్రత్యర్థులెవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అఖిల భారత హిందూ మహాసభ టిక్కెట్‌పై మహామండలేశ్వర్ హేమాంగీ సఖి ప్రధాని మోదీకి ప్రత్యర్థిగా నిలిచారు. అఖిల భారత హిందూ మహాసభ ఉత్తరప్రదేశ్ యూనిట్ రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాల నుంచి తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. దీనిలో భాగంగా వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్ మహామండలేశ్వర్ హేమాంగీ సఖి ఎన్నికల బరిలోకి దిగారు.
హేమాంగీ సఖి తాను ట్రాన్స్‌జెండర్ల హక్కుల సాధన కోసం ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలలో ట్రాన్స్‌జెండర్లకు సీట్లు కేటాయించాలని హేమాంగీ సఖి డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన హేమాంగీ సఖి.. నేటికీ ట్రాన్‌జెండర్లు భిక్షాటన చేయడం ద్వారా పొట్టపోసుకుంటున్నారని, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదని వాపోయారు. తాను కాశీలోని విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నాక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని తెలిపారు.
హేమాంగీ సఖి భాగవత కథను పంజాబీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ మొదలైన భాషలలో వివరిస్తారు. భారతదేశంతో పాటు బ్యాంకాక్, సింగపూర్, మారిషస్ మొదలైన దేశాలలో హేమాంగీ సఖి భాగవత కథను వినిపించారు. ట్రాన్స్‌జెండర్ మహామండలేశ్వర్ హేమాంగీ సఖి తల్లి పంజాబీ. తండ్రి గుజరాతీ. హేమాంగీ సఖి తన బాల్యాన్ని మహారాష్ట్రలో గడిపారు.
తల్లిదండ్రులు మరణించాక హేమాంగీ సఖి బృందావనం చేరుకుని, అక్కడ పలు గ్రంథాలను అధ్యయనం చేశారు. కాగా వారణాసి లోక్‌సభ స్థానానికి ఏడో దశలో అంటే చివరి దశలో ఓటింగ్ జరగనుంది. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment