
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘నేను గెలుస్తాననే నమ్మకం నాకు లేదు. కానీ, పోరాటం మాత్రం ఆపేది లేదు’.. అని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. ‘కీడెంచి మేలెంచాలనే ఈ విషయం మీకు చెబుతున్నాను. నన్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. అయినా భయపడేదిలేదు. కులాన్ని చూడకండి. తెలంగాణ ప్రజల మాదిరిగా కులం కంటే నా ఆంధ్రా అనే భావన అందరిలోనూ రావాలి’.. అని ఆయన అన్నారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి జిల్లా కేంద్రమైన కాకినాడలోని సర్పవరం జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ‘మీరు అండగా నిలబడితే నేను, జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తాం.
నాకు ఫలానా కులం ఎక్కువ, మరో కులం తక్కువ అనేది లేదు. అధికారం లేకున్నా 2008 నుంచి మీకోసం పోరాడుతూనే ఉన్నాను’.. అని చెప్పారు. రాజకీయం వేరు, సినిమాలు వేరని అన్నారు. సభలకు రావడం కాదు.. ఎన్నికల్లో ఓటేసి సత్తా చాటాలని, గత ఎన్నికల్లో పార్టీలపై కోపంతో నోటాకు వేసిన 3–4 శాతం ఓట్లను ఈసారి జనసేనకు వేయాలని పవన్ వేడుకున్నారు. మధ్యతరగతి మేధావులు మౌనంగా ఉండటమే ప్రశాంత ఆంధ్రప్రదేశ్ క్రిమినల్స్‌కు అడ్డాగా మారడానికి కారణమని ఆయన ఆరోపించారు. అన్యాయం జరుగుతున్నప్పుడు యువత మేలుకోకపోతే అరాచకాలు పెరిగిపోతాయన్నారు.
దళితులకు సీఎం అన్యాయం చేశారు
దళిత యువతకు సంబంధించిన 18 పథకాలు రద్దుచేసిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలని పవన్ ప్రశ్నించారు. అంబేడ్కర్ విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్యగా మార్చుకుని దళితులకు అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని డీజీపీ చెబుతున్న దానికి, వాస్తవ పరిస్థితికి అసలు పోలికేలేదన్నారు. నిన్నగాక మొన్న బాపట్ల జిల్లాలో సోదరిని వేధిస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు ఒక గౌడ యువకుడిని దహనం చేయడం.. ప్రొద్దుటూరులో ఒక యువతిపై సామూహిక అత్యాచారం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా... రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ చెబుతున్న తీరు సరికాదన్నారు. రాష్ట్రంలో క్రిమినల్ ఎంపైర్‌ను నేలమట్టం చేసి, సీఎంను రోడ్డు మీదకు తీసుకువస్తానన్నారు.
నన్ను ఓడించడానికి రూ.200 కోట్లు ఖర్చు..
ఇక భీమవరంలో ఉన్న ఓటింగ్ కంటే అధికంగా ఓటింగ్ జరిగిందని.. తనను ఓడించేందుకు రూ.200 కోట్లు ఖర్చుచేయాలనుకుంటున్నారని పవన్‌కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై గతంలో జనసైనికులు ఫొటోలు తీసి దేశం దృష్టికి తీసుకువెళ్లినట్లుగానే హ్యాష్‌ట్యాగ్ ద్వారా ఇక్కడ జరుగుతున్న అవినీతి, దోపిడీపై ఫొటోలు తీసి కేంద్ర హోంశాఖ, రాష్ట్ర డీజీపీ, జనసేన కార్యాలయాలకు ట్యాగ్ చేయాలని పవన్ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే ద్వారంపూడి లక్ష్యంగా..
ఇక గంటంపావు సేపు సాగిన పవన్ ప్రసంగంలో మూడొంతుల సమయం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై విమర్శలే లక్ష్యంగా సాగింది. కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యం ఎగుమతుల ద్వారా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. నాడు వీర మహిళలను దుర్భాషలాడి కొట్టించావని.. అందుకు మూల్యం చెల్లించుకుంటావని.. చంద్రశేఖర్ పతనం ఈరోజే మొదలైందని ఆయన అన్నారు. అంతేకాక.. ‘నువ్వు చేసే భూకబ్జాలు, అక్రమాల చిట్టా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఉంది. నిన్నూ, నీ ముఖ్యమంత్రిని ఓడించకపోతే నేను పవన్‌కళ్యాణ్‌నే కాదు.. మా పార్టీ జనసేనే కాదు.. మీ డి–గ్యాంగ్‌ను సాగనంపే సమయం ఆసన్నమైంది’ అని పవన్ సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment