
గుంకలాం లేఅవుట్ వద్ద ప్రసంగిస్తున్న పవన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విజయనగరంలో ఆదివారం జరిపిన పర్యటన పవన్‌కళ్యాణ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్వయంగా జగనన్న కాలనీని చూసి అక్కడి లబ్ధిదారులతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించాలని ఆయన వేసిన పాచిక పారలేదు. ‘జగనన్న ఇళ్లు–పేదలకు కన్నీళ్లు’ నినాదంతో ఆ కాలనీలపై సోషల్ ఆడిట్ చేస్తామంటూ విజయనగరం శివారు గుంకలాంలోని జగనన్న కాలనీకి మధ్యాహ్నం 1.30కు వచ్చిన పవన్‌కు అక్కడి లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం.. సోషల్ ఆడిట్‌కు ఎవరూ హాజరుకాకపోవడంతో ఆయన కేవలం రోడ్‌షోకే పరిమితమయ్యారు.
ఫలితంగా దాదాపు రెండు గంటలపాటు విజయనగరం ప్రధాన రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. చివరకు గుంకలాంలో జగనన్న కాలనీకి చేరుకున్నా, అక్కడ లబ్ధిదారులెవరూ లేకపోవడంతో ఒకటీ రెండు ఇళ్లను మాత్రమే పవన్ మొక్కుబడిగా పరిశీలించారు. తర్వాత కొద్దిమంది పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వంపై, వైఎస్సార్‌సీపీ నేతలపై ఆరోపణలు చేశారు.
యువతను తప్పుదారి పట్టించేలా, రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘గడపగడపకు వచ్చే వైఎస్సార్‌సీపీ నాయకులను, పనిచేయని నేతలను చొక్కా పట్టుకుని నిలదీయండి. వాళ్లకూ మనకూ సెపరేటు రక్తం ఏమైనా ఉంటుందా? లక్షల మందిని అరెస్టు చేయగలరా? స్వచ్ఛందంగా జైళ్లను నింపేద్దాం. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేసి జనసేన జెండాను స్థాపిద్దాం.
గుంకలాం జగనన్న కాలనీలో లబ్ధిదారులకు స్థలాలిచ్చేందుకు రైతుల దగ్గర తక్కువ ధరకే కొనుగోలు చేసి ఎకరాకు రూ.30 లక్షల చొప్పున చూపించి రూ.పది వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకూ దోచేశారు. దీనిపై మోదీకి స్వయంగా నివేదిక అందజేస్తా. మోదీపై అపార గౌరవం ఉన్నవాడిని. నా మీద కేసులు పెట్టినా భయపడను. నేను చాలా బలంగా ఉంటాను. ఓడిపోయిన వాణ్ణి.. గాయపడ్డవాణ్ణి. దెబ్బతిన్న పులిలా నిలబడ్డాను.
ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపిస్తాను. ఓట్లు రాకపోయినా నామినేషన్ వేస్తాం. నామినేషన్లు వేయకుండా ఆపినా.. బెదిరించినా తాటతీస్తాం. పరిశ్రమలు ఎందుకు రావడంలేదని అడగండి. పిచ్చిపిచ్చి సమాధానాలు చెబితే తిరగబడండి. 2024కు వైసీపీ ప్రభుత్వం పోవాలి, జనసేన ప్రభుత్వం రావాలి. బొత్స జేబులో డబ్బులు ఏమీ ఇవ్వడంలేదు. మనం కట్టిన పన్నుల డబ్బులతో పథకాలు పెడుతున్నారు.’ అని పవన్ అన్నారు. అనంతరం 3.30 గంటలకు పవన్ విశాఖకు బయల్దేరారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో 4.20 గంటలకు హైదరాబాద్ వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment