సంక్షేమాభివృద్ధి పథకాలపై చర్చకు సిద్ధమా?  | Jogi Ramesh fires on Union Minister Anurag Singh Thakur | Sakshi
Sakshi News home page

సంక్షేమాభివృద్ధి పథకాలపై చర్చకు సిద్ధమా? 

Published Mon, Aug 22 2022 4:51 AM | Last Updated on Mon, Aug 22 2022 6:49 AM

Jogi Ramesh fires on Union Minister Anurag Singh Thakur - Sakshi

సాక్షి, అమరావతి: ‘దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు.. రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చర్చకు సిద్ధమా?’ అని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాలు, ప్రసార సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌కు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ సవాల్‌ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. మూడేళ్లలో రెండు లక్షల మందికి రెగ్యులర్‌ ఉద్యోగాలు, 2.60 లక్షల మందికి వలంటీర్లుగా అవకాశం, 90 వేల మందికి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలిచ్చి.. సీఎం జగన్‌ యువతకు బాసటగా నిలిచారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా  ఈ తరహాలో ఉద్యోగాలిచ్చారా? అని నిలదీశారు. మంత్రి  ఇంకా ఏమన్నారంటే.. 

మోసం చేసిన మీరు నీతులు చెబుతారా? 
► టీడీపీ కార్యాలయం నుంచి సుజనా చౌదరి తె  చ్చిన స్క్రిప్టును కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ చదువుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేశారు. స్వతంత్ర భారతదేశ 75 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో కేవలం మూడేళ్లలోనే రూ.1.65 లక్షల కోట్లను డీబీటీ పద్ధతిలో లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేశారు. 
► సంక్షేమ, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ను ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగానే కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చూస్తున్నారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది.  
► రాష్ట్రానికి  పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? రెవెన్యూ లోటు భర్తీ, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటులోనూ కేంద్రం మోసం చేసింది. రాష్ట్ర ప్రజలను వంచించిన బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు. 

కాల్షీట్లు అమ్ముకున్న జన సేనాని 
► చంద్రబాబుకు వీకెండ్‌ కాల్షీట్లు అమ్ముకున్న జనసేన అధ్యక్షుడు బుర్ర తక్కువ పవన్‌ కల్యాణ్‌..  రాజంపేట, తిరుపతి ప్రాంతాల్లో పనికిరాని మాటలు మాట్లాడారు. 2014లో జనసేనను చంద్రబాబుకు తాకట్టు పెట్టింది కాక.. ఇప్పుడు తనను నమ్మిన కొంత మంది కాపు సామాజిక వర్గం వారిని మళ్లీ చంద్రబాబుకు అమ్మేయడానికే వీకెండ్‌ నాటకాలాడుతున్నారు. వ్యవసాయం, కౌలు రైతుల గురించిన కనీస అవగాహన లేని పవన్‌.. సేద్యం గురించి మాట్లాడటం విడ్డూరం. 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే దమ్ముందా?
► సీఎం జగన్‌ రైతులను రారాజులుగా చేస్తున్నారు. జన రంజక పాలన అందిస్తున్నందుకు 175కు 175 స్థానాల్లోనూ విజయం సాధించే దిశగా అడుగులేస్తున్నాం. 2019 ఎన్నికల్లో చంద్రబాబును చెప్పుతో కొట్టి 23 సీట్లకు పరిమితం చేసిన ప్రజలు.. 2024 ఎన్నికల్లో రెండు చెప్పులతో కొట్టి రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయడం ఖాయం.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement