
సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఈ కేసులో కర్త, కర్మ, క్రియ ఆయనేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయినా చంద్రబాబుపై ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని, ఎందుకు విచారణకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. ఇలా దొరికిపోయిన నేతను వదిలిపెట్టడం వల్ల ప్రజలకు చట్టం, రాజ్యాంగంపై విశ్వాసం సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఓటుకు కోట్లు కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు అనుచరుడు రేవంత్‌రెడ్డి ఉన్నట్టు తెలిపారు. స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలిస్తూ రేవంత్‌రెడ్డి పట్టుబడ్డారని, ఆ సమయంలో ‘మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ’ అంటూ చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన విషయం అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు పాత్రను ఈడీ ప్రస్తావించిందన్నారు.
అవి చంద్రబాబు మాటలేనని ఫోరెన్సిక్ రిపోర్టు ధ్రువీకరించిందని చెప్పారు. చంద్రబాబు సూచనలతోనే తాను రాయబారం చేశానని ఈడీకి మత్తయ్య వాంగ్మూలం ఇచ్చినా చంద్రబాబును విచారించకపోవడం సరికాదన్నారు. ఇలాగైతే వ్యవస్థలపై సామాన్యులకు ఎలా నమ్మకం కలుగుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో చంద్రబాబును విచారించి శిక్ష విధించాలని ఈడీని డిమాండ్ చేశారు.
సీఎం జగన్‌పై విషం చిమ్మడానికే మహానాడు డ్రామా
జూమ్ మీటింగ్‌లో రోజంతా మాట్లాడిన చంద్రబాబు.. రేవంత్‌రెడ్డిపై ఈడీ కేసు బుక్ చేసిన విషయంపై ఎందుకు స్పందించలేదని జోగి రమేష్ నిలదీశారు. పార్టీ వ్యవస్థాపకుడి చావుకు కారణమై.. ఇప్పుడు మహానాడు పేరుతో హైదరాబాద్ నుంచి జూమ్‌లో గంటలు గంటలు మాట్లాడుతూ డ్రామాలాడుతుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్మడమే మహానాడులో చంద్రబాబు అండ్ కో పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్ల ప్రభుత్వ విజయాలను మరుగునపర్చాలన్న ఏకైక అజెండాతో రెండు రోజులు మహానాడు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ప్రజా దీవెనలు ఎల్లప్పుడూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment