సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ నిరసన సభలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం మాయల ఫకీర్‌లా మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారం వారి స్వార్థం కోసం వాడుకుంటోందని.. బీజేపీ ప్రజల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తోందన్నారు.
‘‘దేశంలో వరుసగా 3వ సారి ప్రధాని అయినా ఘనత మోదీదే. విపక్షాలు బలంగా ఉన్నప్పటికీ కూడా మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ అనుకూల ఓటు వచ్చింది. 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఆరు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. 19 రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం. గత రికార్డులను బ్రేక్ చేస్తూ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతుతో నిలబడే ప్రయత్నం చేసి ఆ పార్టీలను ముంచేస్తోంది.
..ప్రాంతీయ పార్టీల అండతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో బీజేపీఅధికారంలోకి రావడం ఖాయం. ఇతర పార్టీల బలహీనతలే.. కాంగ్రెస్ బలం’’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
రేవంత్‌కి ఆయన మీద ఆయనకే భరోసా లేదు. ఇక ప్రజలకు ఏమీ భరోసా కల్పిస్తారు. విద్య భరోసా కార్డు ఎక్కడ?. మహిళలకు రూ.2500 వచ్చాయా?. తులం బంగారం, లక్ష రూపాయలు అందాయా?. రేవంత్ ప్రభుత్వం మహిళ, యువత, రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఒక్కసారి కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తే మళ్లీ వారిని ఆ రాష్ట్ర ప్రజలు ఆదరించరు. ఉదాహరణకు 60 ఏళ్లుగా తమిళనాడులో, 30 ఏళ్లుగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్, 25 ఏళ్లుగా బీహార్‌లో కాంగ్రెస్ అధికారంలోకే రాలేదు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఇదే గతి రావడం ఖాయం.
రేవంత్‌రెడ్డి అబద్దాలతో గద్దె నెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. వారందరికీ బీజేపీ అండగా ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలను లేవనెత్తి అధికారమే లక్ష్యంగా బీజేపీ ఉద్యమాలు చేపడుతుంది. బీజేపీ ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ. 70 ఏళ్ల భారత చరిత్రలో ప్రభుత్వాలపై ప్రజల వ్యతిరేకత పెరిగేది. మోదీ అధికారంలోకి వచ్చాక బీజేపీకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. 2019తో పోలిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రూ.5 కోట్లకు పైగా ఓట్లు పెరిగాయి.
తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూశారు. వచ్చే రోజుల్లో బీజేపీకి పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి మళ్లీ మళ్లీ అధికారంలో వస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ ఒంటరిగానే మెరుగైన స్థానాలు సాధించింది. కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీ లాంటిది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ రీజినల్ పార్టీలపై ఆధారపడి గెలుస్తూ వస్తుంది. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో ప్రజలను మోసం చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. హిమాచల్‌లో ఫ్రీ కరెంట్ దేవుడు ఎరుగు.. అసలు కరెంట్ ఇవ్వడం లేదు’’ అంటూ జేపీ నడ్డా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment