కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సచివాలయం ‘నబన్నా’ ముట్టడికి వచ్చిన వందలాది మంది బీజేపీ నిరసకారులకు, పోలీసులకు మధ్య గురువారం ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై టియర్‌గ్యాస్, నీటి ఫిరంగులు ప్రయోగించి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ఇక ఆమె పదవిలో ఉండే రోజులు లెక్కబెట్టుకోవాల్సిన తరుణం అసన్నమయ్యింది అన్నారు. ఈ మేరకు నడ్డా వరుస ట్వీట్లు చేశారు. ‘శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై నీటి ఫిరంగులను, టియర్ గ్యాస్‌ని ఉపయోగించారు.
ఇవన్నీ దీదీలోని నిరాశను తెలియజేస్తున్నాయి. ఆమె పదవి కోల్పోయే సమయం దగ్గర పడింది. బెంగాల్ ప్రజలు ఆమె నిరంకుశ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి సిద్ధమయ్యారు. బీజేపీ కార్యకర్తలు బెంగాల్ కోల్పోయిన కీర్తి, ప్రతిష్టలను పునరుద్ధరించడానికి గాను అవినీతి, నిరంకుశ, హింసాత్మక ప్రభుత్వంపై శాంతియుతంగా పోరాటడానికి సంకల్పించారు. కానీ వారిపై అమానుషంగా దాడి చేశారు. బెంగాల్ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు ఆమె ఓటమి కోసం కృషి చేస్తారు’ అన్నారు నడ్డా. (చదవండి: ‘నబన్నా’ ముట్టడి, కోల్‌కతాలో ఉద్రిక్తత)
‘వామపక్షాల పాలనలో కంటే మమతా బెనర్జీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై హింస, దాడులు పెరిగాయి. దీదీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కానీ మేం బెంగాల్ ప్రజలతో నిలబడతాం. మా ధైర్యవంతులైన బీజేపీ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి ప్రయత్నం చేశారు. దీదీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అనడానికి ఇదే నిదర్శనం. దౌర్జన్యం, రక్తపాత దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిరసనలు చేయకుండా నిరోధించడానికి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ యంత్రాంగం బీజేపీ కార్యకర్తలపై దారుణమైన హింసకు పాల్పడ్డారు. ఈ అధికార దుర్వినియోగం ఆమోదయోగ్యం కాదు’ అంటూ నడ్డా వరుస ట్వీట్లు చేశారు. పెద్ద పెద్ద సమూహాలుగా ఏర్పడి సమావేశాలను నిర్వహించడంపై మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి నిరసనగా బీజేపీ ‘ఛలో నబన్నా’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర బీజేపీ యువజన విభాగం చీఫ్ తేజస్వి సూర్య ఈ నిరసనలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment