సాక్షి, హైదరాబాద్/మహబూబ్ నగర్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరికలపై పార్టీ నేతలు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఇటీవలే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఇక, మరో కీలక నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికపై సస్పెన్స్ నెలకొంది.
అయితే, జూపల్లి కాంగ్రెస్‌లో చేరిక వాయిదా పడినట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ కొల్లాపూర్ సభ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో సభ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. సభ వాయిదాపై కాంగ్రెస్ అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇక, ఈనెల 20వ తేదీన జూపల్లి చేరిక సందర్భంగా సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది.
కాంగ్రెస్‌లోకి బీజేపీ సీనియర్ నేత..
ఇదిలా ఉండగా.. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ రాష్ట్రనేత ఒకరు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దేవరకద్ర నియోజకవర్గంలోనూ గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్ననేత చేరికపైనా చర్చ నడుస్తోంది. ఇక, జడ్చర్ల నియోజకవర్గంలో ఓ కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.
బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి..
మరోవైపు.. జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న సరిత.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు. వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీఆర్ఎస్కి రాజీనామా చేసిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి సహా పలు మండలాల బీఆర్‌ఎస్ కీలక నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొడంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చేరిక కూడా ఇప్పటికే ఖరారైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచర వర్గం అటు కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: ధరణి పోర్టల్‌పై భట్టి సంచలన కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment