బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆమె నాచన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సియాంజ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కార్టూన్ క్యారెక్టర్ అంటూ అభివర్ణించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని నహాన్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో మౌంటెన్ క్యాప్ ధరించడంలో రాహుల్ గాంధీ చేసిన చిన్న పొరపాటును కంగనా ఎద్దేవా చేశారు. ఆయనకు మౌంటెన్ టోపీ ఎలా ధరించాలో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. రాహుల్ ఆ క్యాప్ పట్టుకుని వేదిక అంతా తిరిగారని, కొద్దిసేపటి తరువాత అక్కడున్న ఒక వ్యక్తి సాయంతో రాహుల్ ఆ క్యాప్ ధరించగలిగారని కంగన అన్నారు.
రాహుల్ గాంధీ ఒక కార్టూన్ క్యారెక్టర్ అంటూ, ఏ విషయాలను అర్థం చేసుకోలేనివారు తనను ఎగతాళి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాహుల్, ప్రియాంక ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారని, వారికి మౌంటెన్ క్యాప్ ఎలా ధరించాలో కూడా తెలియదని కంగనా వ్యాఖ్యానించారు. చంద్రునిపై బంగాళదుంపలు పండించడం గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆమె వ్యంగ్యంగా అన్నారు.
తాను ముంబై వెళ్లినప్పుడు కొందరు తన పహాడీ క్యాప్‌ను చూసి ఎగతాళి చేశారని, తనకి ఇంగ్లీషు రాదని చాలా మంది జోకులు వేసేవారని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఇంగ్లీషు నేర్చుకున్నానని, ముంబైలో కూడా నివసించానని, అయినా తన ప్రాంతంతో అనుబంధాన్ని కోల్పోలేదని కంగన పేర్కొన్నారు. ఈసారి బీజేపీ అభ్యర్థిగా తాను అత్యధిక మెజారిటీతో గెలుస్తానని కంగనా ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment