విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
సాక్షి, అనంతపురం: ‘రాయదుర్గం ప్రజల దీవెనలతో రాష్ట్రానికి మంత్రిగా చేశావ్. నీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదు. అదే మేము ప్రజలకు మంచి చేస్తుంటే సంతోషించాల్సింది పోయి కంత్రీలా వ్యవహరిస్తావా’ అంటూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీరుపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన రాయదుర్గంలోని తన కార్యాలయంలో మునిసిపల్ చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప, వైస్ చైర్మన్ వలీబాషా, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ ముస్తాక్, జెడ్పీటీసీ సభ్యుడు పీఎస్ మహేష్, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, పలు వార్డుల కౌన్సిలర్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాలవ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
అనంతపురంలో కూర్చొని చెంచాగాళ్లయిన కొందరికి డైరెక్షన్ ఇస్తూ తమను అడ్డుకోవాలని కుట్ర పన్నడం, దాన్ని ఏదో జరిగిపోయినట్టు ఎల్లోమీడియా చిత్రీకరించడం, ప్రజల్లో తమకు వ్యతిరేకత ఉన్నట్టు దుష్ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని హెచ్చరించారు. డి.కొండాపురంలో ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో మూడు రేషన్‌కార్డులుంటే రూ.2.40 లక్షలు, వడ్రవన్నూరులోనూ టీడీపీ నాయకుడి కుటుంబానికి రూ.2.50 లక్షల ప్రభుత్వ సహాయం అందిందని, అందుకు సంబంధించిన బ్రోచర్లను తాము అందించామని తెలిపారు. ఇలా లబ్ధి పొది కూడా పచ్చ నాయకులు విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
చదవండి: (పిల్లల చదువు కోసం ఎక్కడా వెనక్కి తగ్గేదిలే: సీఎం జగన్)
ఐటీ కట్టినోడికి అమ్మఒడి ఎలా ఇవ్వాలి?
‘రాయదుర్గం 8వ వార్డులో టీడీపీ సోషల్‌మీడియా కార్యకర్తకు గత రెండేళ్లు అమ్మఒడి వచ్చింది. ఈ ఏడాది ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించినందున జాబితాలో పేరు రాలేదు. అంతమాత్రాన ఉద్యోగులు, వలంటీర్ పట్ల రౌడీలా ప్రవర్తిస్తాడా? ఇంటి వద్దకెళ్లిన నా పట్ల కూడా అసభ్యకరంగా మాట్లాడమని డైరెక్షన్ ఇస్తావా కాలవా? అతనిపై వలంటీర్ ఫిర్యాదిస్తే నీవు గుంపును వెంటేసుకుని రచ్చ చేస్తావా? కర్ణాటక రాష్ట్రం రాంపురంలో బిందెల కంపెనీ పెట్టి ఆ ప్రాంత ప్రజలతో చీపుర్లతో కొట్టించుకున్న వ్యక్తికి నీలాంటి ద్రోహులు అండగా నిలవడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నార’ని విప్ కాపు అన్నారు. ఇటీవల కణేకల్లులోనూ అప్పులు ఎగ్గొట్టిన టీడీపీ నాయకుడికి కాలవ అండగా నిలవడం శోచనీయమన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన కాలవ.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. రాజకీయ వ్యభిచారిగా మారిన అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం దురదృష్టకరమన్నారు.
అప్పుడేం పీకావ్?
‘రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం పీకావ్? పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఎందుకివ్వలేదు? మీ అసమర్థత వల్లే ఈ రోజు మా ప్రభుత్వం రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాల్సి వచ్చింది. నీ హయాంలో టెంకాయ కొట్టిన రోడ్లను సైతం మేమే బాగుచేశాం. దమ్మూ ధైర్యముంటే మాతో పాటు గడప గడపకూ రా! నీవేం చేశావో.. మేమేం చేస్తున్నామో ప్రజలనే నేరుగా అడుగుదాం’ అని సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. నీవొక అడుగు ముందుకేస్తే..తాను పదడుగులు ముందుకేస్తానని, తగ్గేదేలేదని అన్నారు. సమావేశంలో మునిసిపల్ కౌన్సిలర్లు దేవరాజు, పద్మ, శారద, గోవిందరాజులు, ఫకృద్దీన్, కృష్ణమూర్తి, పొరాళ్ల శివ, వైజాక్ రిబ్కా, గుమ్మఘట్ట మండల కన్వీనర్ బోయ మంజునాథ, ఎస్సీసెల్ రాష్ట్రకార్యదర్శి గోవిందు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మార్కెట్‌యార్డు డైరెక్టర్ నారాయణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment