న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తాజాగా ఢిల్లీలోని కోచింగ్ సెంటర్‌లో విద్యార్ధుల మృతి అంశం లోక్‌సభను కుదిపేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ ప్రమాదంలో యూపీఎస్సీ విద్యార్ధుల మరణాలను ప్రస్తావిస్తూ దేశంలో కోచింగ్ సెంటర్లు ఓ మాఫియాలా తయారయ్యాయని మండిపడ్డారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల పట్ల వివక్ష చూపడం కలిగిస్తోందన్నారు.
‘2023లో రాజ్యసభలో ఓ మంత్రి పెరుగుతున్న విద్యార్ధుల ఆత్మహత్యపై సమాధానం ఇచ్చారు, 2018 నుంచి 2022 వరకు ఐఐటీలు, ఐఐఎంలతో సహా ఉన్నత విద్యాసంస్థల్లో సుమారు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇందుకు అక్కడ నెలకొన్న కుల వివక్ష ప్రధాన కారణాలలో ఒకటి.. దీనీనీ తక్షణమే పరిశీలించాలి.
దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్‌లలో భద్రత, నియంత్రణ సమస్యలను వేణుగోపాల్ ప్రస్తావించారు. నిన్నగాక మొన్న న్యూఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ కోచింగ్ సరైన అనుమతి, తగిన సౌకర్యాలు లేకుండా పనిచేస్తోందని మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. కొన్ని కోచింగ్ సెంటర్లు 'మాఫియా'లుగా మారాయి. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా?’’ అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు.
దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థులు ఎక్కడ చదువుకున్నా వారి శారీరక- మానసిక రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవినెత్తిన ఈ ప్రశ్న నేటి చర్చకు సంబంధించినది కాదు. కానీ కోచింగ్ సెంటర్, పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, ఇన్‌స్టిట్యూట్‌లు ఇలా విద్యార్ధులు ఎక్కడ చదువుతున్నప్పటికీ వారి శారీరక, మానసిక రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నాను అని పేర్కొన్నారు.
కాగా కోచింగ్ సెంటర్‌లకు సంబంధించి కేంద్రం జనవరిలో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు సమగ్రమైన, వివరణాత్మక మార్గదర్శకాలు అందించింది. అయితే రాజస్థాన్, బీహార్, గోవా మొదలైన రాష్ట్రాలు తమ సొంత నిబంధనలను కలిగి ఉన్నాయి.
కాగా ఢిల్లీలోని ఓ భవనం బేస్‌మెంట్‌లో నిర్వహిస్తున్న యూపీఎస్‌సీ కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది.
దీంతో, ఓల్డ్ రాజీందర్ నగర్‌లోని ఓ భవనం బేస్‌మెంట్‌లో నడుస్తున్న రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరద చేరడంతో కొందరు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. వరదతో బేస్‌మెంట్ పూర్తిగా నిండిపోయినట్లు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తోడారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో.. అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment