హైదరాబాద్: రాష్ర్టంలో నిరుద్యోగులు, కౌలు రైతులు, ప్రయివేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అతిపెద్ద నియంత కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకులు భట్టి విక్రమార్క మల్లు. తెలంగాణా రాష్ర్ట సమితి శానససభా పక్షం లో తెలంగాణా తెలుగుదేశం శాసనసభా పక్షం విలీనం అత్యంత దుర్మార్గం, ప్రజస్వామ్యాన్ని పతానికి తీసుకువెళ్లే అడుగుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టించారని , ప్రతిపక్షమే లేకుండా చేస్తూ దేశంలో 29 రాష్ర్టంగా ఆవిర్భవించిన తెలంగాణా రాష్ర్టాన్ని ఫిరాయింపుల పర్వంలో అగ్రస్థానంలో నిలబెట్టి సంపూర్ణ నియంత పాలన కింద కు తీసుకువచ్చాడని ,ఒకవైపు ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ, మరోవైపు ప్రతిపక్షాలను లేకుండా చేస్తూ దేశంలోనే అతిపెద్ద నియంతగా కేసీఆర్ అవతరించారని భట్టి విమర్శించారు.
నిరుద్యోగుల పరిస్థితేంటి
నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటి గురించి మాట్లాడకుండా, పట్టించుకోకుండా ఇతర పార్టీల బి ఫామ్ లపై గెలిచిన వారిని తమ పార్టీలోకి ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచించడం అత్యంత దుర్మార్గమన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో యువకులను రెచ్చగొట్టి వారు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించి వందలమంది తల్లుల కడుపుకోత కు కారణమైన కేసిఆర్ ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగ యువత ఆత్మహత్య లు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నారని, వారి తల్లుల కడుపుకోత కేసిఆర్ కు తగలక మానదని, ఎలక్షన్ కలెక్షన్ ఉంటే చాలు అనుకునే కెసిఆర్ కు కౌలు రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు, ప్రైవేట్ టీచర్స్ ఆత్మహత్యలు కనపడటం లేదా అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క.
ఫిరాయింపుల ప్రమాదాలను గుర్తించే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆనాడే ప్రతిపక్షం వుంటేనే అభివృద్ధి, రాజ్యాంగం సంరక్షించబడుతుందని చెప్పారన్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం డబ్బు ఎరవేసి శాసనసభ్యులను కేసీఆర్ కొట్టున్నాడని, గతంలోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలచిన ఎంఎల్ ఎ లను ఇదే విధంగా డబ్బు ఎరవేసి, ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారన్నారు. ప్రజాస్వామ్య పతనానికి దారి తీసే అన్ని అడుగులను కేసీఆర్ వేస్తున్నాడన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని నిసిగ్గుగా పార్టీలో విలీనం చేసుకుంటున్నాడని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడడం అత్యంత దుర్మార్గంమని, పార్టీల విలీనం అనేది ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశమని, రెండు పార్టీల అధ్యక్షల అంగీకారంతో వారు ఇచ్చే లేఖ ఆధారంగా ఆ ప్రక్రియ జరగాలని , ఒక పార్టీ అధ్యక్షుడు ఇచ్చే బి ఫామ్ మీద గెలిచిన ఎం ఎల్ ఏ లు తమ పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ కు లెటర్ ఇస్తే సరిపోదన్నారు. ఏ విధంగా కూడా దీనికి చట్టబద్ధత లేదని, చెల్లదని, విలీనం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో లేదని, ఎన్నికల కమిషన్ ధృవీకరించిన తరువాతే అసెంబ్లీలో కూడా అది వర్తిస్తుందని, వీటన్నింటిపై ప్రజాస్వ్యామ వాదులంతా ఆలోచన చేయాలన్నారు భట్టి విక్రమార్క.
కేసిఆర్ నిరంకుశ నిజాం నవాబును తలపిస్తున్నాడు
అధికార దాహంతో ఉన్న కేసిఆర్ నిరంకుశ నిజాం నవాబును తలపిస్తున్నాడని, తన మీద ప్రజలలో రోజు రోజు కు పెరుగుతున్న వ్యతిరేకతతో ప్రతిపక్షాలకు రాజకీయంగా లాభ జరుగుతుందనే కుట్ర తో వారిని బలహీన పరచాలనే ఆలోచనతోనే ఇతర పార్టీల ఎం ఎల్ ఏ లను ప్రలోభాలకు, భయభ్రంతాలకు గురిచేస్తూ తమ పార్టీలోకి చేర్చుకుంటున్నాడని భట్టి అన్నారు. ఎంతమంది ఎంఎల్ ఎలను , నాయకులను కలుపుకున్నా, చేర్చుకున్నా ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని, ప్రజల్లో మీ పై వ్యస్తున్న వ్యతిరేకతను ఆపలేరని, దీనిని గమనించాలని రాష్ర్ట ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నానన్నారు భట్టి విక్రమార్క.
( చదవండి: తెలంగాణ కోర్టుల్లో కరోనా కలకలం )
Comments
Please login to add a commentAdd a comment