దమ్ముంటే సీబీఐ విచారణ వేయండి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  | KCR Confident Of No Action Against His Corruption Revanth reddy | Sakshi
Sakshi News home page

దమ్ముంటే సీబీఐ విచారణ వేయండి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

Published Thu, Nov 11 2021 4:05 AM | Last Updated on Thu, Nov 11 2021 4:08 AM

KCR Confident Of No Action Against His Corruption Revanth reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్‌ రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఒక్క విద్యుత్‌ ప్రాజెక్టుల్లోనే రూ.వెయ్యికోట్ల అవినీతి జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్‌ చేస్తున్నా. కేసీఆర్‌ అవినీతిని నేను నిరూపిస్తా. అలా నిరూపించకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని కాంగ్రెస్‌ కార్యకర్తల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కాంగ్రెస్‌పై ఉన్న భయంతోనే ప్రధాని మోదీ డైరెక్షన్‌లో సీఎం కేసీఆర్‌ బీజేపీని తిట్టినట్టు యాక్షన్‌ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, ప్రధాని మోదీ–కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల బంధం గట్టిదని, అందుకే కేసీఆర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని తిడుతున్నారేకానీ ఆ పార్టీని పల్లెత్తు మాట కూడా అనడంలేదని దుయ్యబట్టారు. కేసీఆర్, బండి సంజయ్‌ల ప్రెస్‌మీట్లు చిక్కడపల్లి కల్లు కాంపౌండ్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవాచేశారు.  

యూపీలో యోగిని మళ్లీ సీఎం చేసేందుకు... 
కేసీఆర్‌ ఇచ్చిన డబ్బులను తమిళనాడు ఎన్నికలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తరలించారని, తమిళనాడులో బీజేపీ ఎన్నికల ఖర్చంతా కేసీఆర్‌ పెట్టుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో యోగిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు మోదీతో కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఎంఐఎం చేత వంద సీట్లకు పోటీ చేయించి ప్రతిపక్ష ఓట్లను చీల్చి బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.  

మంత్రుల దోపిడీ 
మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌ రెడ్డి, స్పీకర్‌ పోచారం, ఎంపీ సంతోష్‌కుమార్‌ ఇసుక మాఫియాలా వ్యవహరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్‌ ఆరోపించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో సంజీవయ్య పార్క్‌కు సంబంధించి పదెకరాల భూమిని మంత్రి తలసాని ఆక్రమించారన్నారు. ట్యాంక్‌ బండ్‌పై నిర్మిస్తున్న అమరవీరుల స్తూపంలో కూడా అవినీతి జరిగిందన్నారు. స్తూపం నిర్మాణ ఖర్చును రూ.60 కోట్ల నుంచి రూ.180 కోట్లకు పెంచి.. రూ.120 కోట్లను ఏపీకి చెందిన కాంట్రాక్టర్‌కు చెల్లించారని ఆరోపించారు. సోనియా గాంధీ ఆమోదిస్తే వచ్చే సంవత్సరం ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తామన్నారు. కార్యకర్తల శిబిరాల్లో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్, పార్టీ రాష్ట్ర నేతలు బోసురాజు, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్యయ్య, రాంరెడ్డి దామోర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్‌ తదితరులు మాట్లాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement