సాక్షి, ఖమ్మం: తుమ్మల ఎపిసోడ్‌తో ఖమ్మం రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి.. అదీ ఆశిస్తున్న పాలేరు టికెట్ దక్కకపోవడంతో సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుబోతున్నారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు కాంగ్రెస్.. తాజాగా ట్విస్ట్ ఇస్తూ బీజేపీ కూడా ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ తరుణంలో.. గొల్లగూడెంలోని తన నివాసంలో ఆయన కార్యకర్తలతో భేటీ అయ్యాక.. పార్టీ మార్పుపై అభిప్రాయం వక్తం చేసే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితా ప్రకటించాక.. పాలేరు టికెట్ దక్కకపోవడంపై తుమ్మల అనుచరగణం రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ని పార్టీ మారాలని కోరుతూనే.. ఇవాళ భారీగా ఆయనకు ఘన స్వాగతం పలికింది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల నంచి భారీ ఎత్తున తరలి వచ్చారు అనుచరులు. ఇక తుమ్మల బలప్రదర్శన ఎపిసోడ్‌ను బీఆర్‌ఎస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది.
అయితే.. రాబోయే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని తుమ్మల డిసైడ్ అయినట్లు ఆయన తనయుడు యుగంధర్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. కానీ, ఇప్పటికే పాలేరు టికెట్ సిట్టింగ్ ఎమ్మేల్యే కందాలకు కేటాయించింది బీఆర్ఎస్. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో దిగొచ్చనే ప్రచారమే ఎక్కువగా వినిపిస్తోంది.
బీజేపీ ఆహ్వానం.. జరగదన్న అనుచరులు
బీఆర్‌ఎస్ జెండా లేకుండా.. తుమ్మల ఫొటోతో కూడిన జెండాతోనే ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. అయితే ఆ ర్యాలీలో కాంగ్రెస్ జెండాలు కూడా కనిపించాయి. అంతేకాదు.. జై తుమ్మల జై కాంగ్రెస్ నినాదాలు మారు మ్రోగాయి కూడా. అలాగే.. ఆయన్ని కాంగ్రెస్‌లో చేరాలని ఉమ్మడి ఖమ్మం అనుచరులు ఇప్పటికే తీర్మానం చేసినట్లు సమాచారం. అయితే.. కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేయాలనుకునేవాళ్లు.. పీసీసీకి దరఖాస్తు కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అందుకు ఇవాళే ఆఖరు తేదీ కూడా!.
ఇక.. తుమ్మల నాగేశ్వరరావును బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు పొంగులేటి సుధాకర్‌రెడ్డి. ఈ ప్రాంత వాసుడిగా తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నా. బీజేపీలోకి రండి.. కలిసి పని చేద్దాం. మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది. అన్ని వర్గాలకు సమనాయకత్వం దొరుకుతోంది. దేశ హితమే పరమావధి అయిన బీజేపీలోకి తుమ్మలను ఆహ్వానిస్తున్నా అని పొంగులేటి తెలిపారు. అయితే.. తుమ్మల ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేరే అవకాశం లేదంటున్నారు అనుచరులు.
Comments
Please login to add a commentAdd a comment