సాక్షి,మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు ఆరు గ్యారేజీలుగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. విజయ సంకల్ప్ యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హామీల అమలు కోసం నిధులు సమకూర్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రణాళిక లేదన్నారు. ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. కర్ణాటకలో కరెంటు సమస్యతో రైతులు రోడ్డున పడ్డారన్నారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయనుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని మండిపడ్డారు. మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా... ఓవైసీ ,కేసీఆర్, రాహుల్ గాంధీ ఎంతమంది దిగొచ్చిన మోదీని అడ్డుకోలేరన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ ఉండదని మరోసారి స్పష్టం చేశారు.
‘రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కేసీఆర్ ఆవశ్యకత లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌కు ఎజెండా లేదు. ఆ పార్టీ పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు. అధికార దుర్వినియోగం, అహంకారం, అవినీతి వల్లే ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటికీ తెలియదు. దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీదే విజయం. దేశంలో తొమ్మిదిన్నరేళ్లుగా ఎలాంటి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారు. బీజేపీ విజయసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment