సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ యువత దీనావస్థకు రాష్ట్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలే కారణమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నందున, కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చునే నైతిక హక్కు కోల్పోయారని దుయ్యబట్టారు. ప్రవల్లిక అనే నిరుద్యోగ యువతి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమన్నారు.
ఇది కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిన హత్య అని ధ్వజమెత్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులారా ఆత్మహత్యలొద్దు.. దయచేసి 60 రోజులు ఓపిక పట్టండని కోరారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువత ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చారు. ‘అహంకారపూరిత ప్రభుత్వాన్ని గద్దెదించుదాం.. మీరు కలలు కంటున్న తెలంగాణను సాధించుకుందాం’ అని పిలుపునిచ్చారు.
నిరుద్యోగుల పరామర్శకు వెళ్లిన ఎంపీ లక్ష్మణ్‌తోపాటు యువతపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. పోటీపరీక్షలు వాయిదా పడటంతో మనస్తాపానికి గురైందని ప్రవల్లిక కుటుంబసభ్యులే చెప్తుంటే...ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కార ణమంటున్న పోలీసులు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ నినాదంలోని ‘నియామకాల’ విషయంలో ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ యువత దగాపడిందన్నారు.
ఇప్పుడు పోటీ పరీక్షలు, డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎన్నికల కోడ్‌ను కారణంగా చూపిస్తున్న కల్వకుంట్ల ప్రభుత్వం.. కోడ్ రాకముందు ఏం చేసిందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్–1 పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ తర్వాతే.. ఉద్యోగ నియామకాల్లో కల్వకుంట్ల కుటుంబం చిత్తశుద్ధి ఏపాటితో బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment