తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి రెండు పదవుల్లో కొనసాగనున్నారా మోదీ కేబినెట్‌లో సీటుకు డోకా లేదా? కేంద్రమంత్రిగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? పార్టీ హైకమాండ్ వ్యూహమేంటీ? కిషన్ రెడ్డిని జోడు పదవుల్లో కొనసాగించడానికి కారణమేంటీ?..
అదనపు బాధ్యతలతో టైం మేనేజ్‌మెంట్‌లో ఇబ్బంది
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అనుకోకుండా తెలంగాణ కాషాయ పగ్గాలు దక్కాయి. ఎన్నికలకు టైం దగ్గరపడుతుంది. అటు కేంద్రంలో మూడు శాఖలకు మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.మరోవైపు అదనంగా పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో టైం మేనేజ్‌మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని, జిల్లా కార్యవర్గాలను, పార్టీ అనుబంధ విభాగాల పనితీరుపై సమీక్షలు చేసుకునే వెసులుబాటు కూడా దొరకలేదు. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ మధ్య నలిగిపోతున్నారు.
కిషన్ రెడ్డికి పూర్తి సపోర్ట్
మరోవైపు డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తున్నారు. అన్ని జిల్లాలను చుట్టేయాలని అనుకున్న వీలుకాకపోవడంతో.. కొన్ని జిల్లాలను పార్టీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ఛైర్మన్ ఈటల రాజేందర్‌కు అప్పగించారు. పార్టీ గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డికి పూర్తి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అమిత్ షా బాటలోనే కిషన్‌రెడ్డి!
ఒక్కరికి ఒకటే పదవి అన్నది బీజేపీ నిబంధన. కొన్నిసందర్భాల్లో కొందరికి మినహాయింపులు వర్తించాయి. అమిత్ షా గతంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు కేంద్ర హోం మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం అదే తరహాలో కిషన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఆయన్ను కేంద్ర మంత్రిగా కొనసాగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల వ్యూహం
ఎన్నికల వేళ తెలంగాణలో అధికార పార్టీ నుంచి ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి సపోర్ట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లిన సందర్భంలో కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార బీఆర్ఎస్‌పై పోరాటానికే ద్విపాత్రాభినయం కిషన్ రెడ్డి చేయనున్నారు. అదే వ్యూహంతో కాషాయ పార్టీ నేతలు వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది.
అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా తెలంగాణలో పాగా వేయాలని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. కేంద్రమంత్రిగా ఉంటూనే కిషన్ రెడ్డి అంబర్ పేట అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. మొత్తంగా జోడు పదవులతో ఎన్నికలకు వెళ్తున్న కిషన్ రెడ్డికి ఏ మేరకు మైలేజీ వస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment