సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో పొరపాటు ఎక్కడ జరిగిందనేదానిపై జాతీయ నాయకత్వంతో సమీక్షించి లోపాలు సరిదిద్దుకుంటాం. సమీక్షించుకున్న తర్వాత రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం బాగా పెరిగింది’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
‘ తెలంగాణలో కాంగ్రెస్ బొటాబొటీలో గెలిచింది. కాంగ్రెస్‌లో ఎవరు సీఎం అవుతారో తెలీదు అదో విచిత్రమైన పరిస్థితి. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌రెడ్డిని ఓడించి మా అభ్యర్థి గెలిచారు. దేశ రాజకీయాల్లో ఇదో చరిత్ర. వెంకటరమణారెడ్డికి నా అభినందనలు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘన విజయంతో ప్రధాని మోదీకి దేశ ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందో తెలుస్తోంది. కేంద్రంలో మోదీ నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తాం’ అని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
‘మా మీద ఏడ్చి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్‌కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తాం. ప్రజల పక్షాన ఐదేళ్లు అనేక పోరాటాలు చేశాం. మా పోరాటం వల్ల కాంగ్రెస్‌కు లాభం జరిగింది. రానున్న రోజుల్లో మరింత కసిగా పనిచేస్తాం. ఢిల్లీ వెళ్లి ఇక్కడున్న పరిస్థితులు ఎన్నికల ఫలితాలపై అధిష్టానానికి వివరిస్తా’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment