నల్లగొండ రూరల్/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో 4కోట్ల మంది ప్రజలు గెలిచినట్లని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం నల్లగొండలో నియోజకవర్గ బూత్ ఇన్‌చార్జిలు, ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమావేశానంతరం వెంకట్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. 76 నుంచి 80 సీట్లలో విజయం సాధించి మరో 90 రోజుల్లో అధికారంలోకి రాబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లాలో కొత్తగా ఎవరినీ కాంగ్రెస్‌లో చేర్చుకోవడం లేదని, ఉన్న వారికే సీట్లు లేవని స్పష్టం చేశారు. వచ్చే నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామన్నారు. దళిత బంధుపై హైకోర్టులో పిటిషన్ వేశామని, గురువారం రిజిస్టర్ అవుతుందని తెలిపారు. హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు. తాను నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కోమటిరెడ్డి చెప్పారు.
ఒకటో తేదీనే జీతాలిస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండే ఈ కొద్దినెలలైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వాలని కోరుతూ ఆయన బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment