Komatireddy Raj Gopal Reddy Sends Resignation Letter To Sonia Gandhi - Sakshi
Sakshi News home page

Komatireddy Rajagopal Reddy: సోనియా గాంధీకి లేఖ, ఆ వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేయలేను

Published Thu, Aug 4 2022 4:16 PM | Last Updated on Thu, Aug 4 2022 4:47 PM

Komatireddy Raj Gopal Reddy Sends Resignation Letter To Sonia Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్‌ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసేందుకు దారి తీసిన పరిణామాలను లేఖలో వివరించారు. 

తీవ్రంగా బాధించింది: కోమటిరెడ్డి
గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా సోనియా గాంధీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా, ఎక్కడా రాజీపడకుండా కష్టపడ్డానని రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీలో పనిచేశానని ప్రస్తావించారు. కానీ పార్టీకి విధేయులైన వారిని గత కొంతకాలంగా పదేపదే అవమానిస్తున్నారని అన్నారు. పార్టీ ద్రోహులు, మీ పైనే(సోనియా గాంధీ) వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక పదవులు అప్పగించడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. కాంగ్రెస్‌ను కొందరు నిర్వీర్యం చేశారని ఆరోపించిన కోమటిరెడ్డి.. ఎమ్మెల్యేలను గెలిపించలేని వారు ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపలేకపోయారని విమర్శించారు.
చదవండి: కాంగ్రెస్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. తెలంగాణలో బీజేపీ గేమ్‌ ప్లాన్‌ ఏంటి?

‘ఇప్పటికే అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశారు. జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను. తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్న విషయం మీకు తెలియనది కాదు. అరవై ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేసిన విషయం మీకు తెలిసిందే. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ రాష్ట ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయింది. ఈ బంధీనుండి విడిపించేందుకు తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా’నని లేఖలో పేర్కొన్నారు.

8న రాజీనామా 
ఈనెల 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా కోరారు. ఆగస్టు 8న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో 8వ తేదీన రాజీనామా చేసిన తర్వాతే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Hyderabad: వాహనదారుడిపై చేయిచేసుకున్న ట్రాఫిక్‌ సీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement