సాక్షి, న్యూఢిల్లీ: ‘నేను ఏ కమిటీలో లేను... ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నా. ఏ కమిటీలో లేను కాబట్టి ఐ యాం ఫ్రీ బర్డ్ నౌ’ అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల గురించి ఇప్పుడేమీ మాట్లాడనని, ఎన్నికలకు సరిగ్గా నెలముందు అన్నీ మాట్లాడతానని కోమటిరెడ్డి అన్నా రు. తెలంగాణ కాంగ్రెస్‌లో గతంలోని కమిటీలన్నీ రద్దయ్యాయని, ఇప్పుడిక తాను స్టార్ క్యాంపెయి నర్‌గా లేనని, లోక్‌సభ సభ్యుడిగా ఉన్నానని స్పష్టం చేశారు.
గతంలో తెలంగాణ కోసం మంత్రి పదవినే చెప్పుతో సమానంగా వదిలేసిన తాను కమిటీలను పట్టించుకుంటానా అని ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వచి్చనప్పుడు అప్పటి పరిస్థితిని బట్టి మాట్లాడతానన్నారు. కాగా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నల్లగొండ నుంచే పోటీ చేస్తానని గతంలోనే చెప్పానని, ఎంపీగా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలన్నది ఎన్నికలకు నెలరోజుల ముందు మాత్రమే చెప్తానన్నారు. తాను ఏ కమిటీలో లేని విషయాన్ని ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినప్పుడు తెలిపానని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీతో వెంకట్‌రెడ్డి 25 నిమిషాలపాటు భేటీ అయ్యారు. అనంతరం తన నివాసంలో ఏర్పా టుచేసిన మీడియా భేటీలో ఎంపీ మాట్లాడారు.
మూసీ ప్రక్షాళనే ప్రధాన అజెండా
ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సమస్యలతోపాటు తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించానని కోమటిరెడ్డి తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యతోపాటు డ్రైనేజీ, ఫార్మా, పారిశ్రామిక వ్యర్థాలతో మూసీ నది కలుషితమై లక్షలమంది అనారోగ్యం పాలవుతున్న విషయాన్ని ప్రధానికి వివరించానన్నారు. గుజరాత్‌లోని సబర్మతి నదిలా మూసీ నది రూపురేఖలు మార్చేలా ప్రక్షాళన చేయాలని కోరానని చెప్పారు. సబర్మతి, రూ.30 వేల కోట్లతో నమామి గంగే పేరుతో గంగానది ప్రక్షాళన చేసినట్లుగా తెలంగాణలోని మూసీని వెంటనే శుద్ధి చేయాలని కోరినట్లు తెలిపారు. మూసీనది నీటి, వాయు కాలుష్యం కారణంగా నల్లగొండసహా ఐదారు జిల్లాల్లోని కోటి మందికిపైగా జనం ఇబ్బందులు పడుతున్నారని వివరించానన్నారు. తన విజ్ఞప్తిపై స్పందించిన ప్రధాని మోదీ మూసీ ప్రక్షాళనకు త్వరలోనే ఒక కమిటీ వేస్తానని హామీ ఇచ్చినట్లు వెంకట్‌రెడ్డి చెప్పారు.
జాతీయ రహదారి–65ను ఆరు వరుసలుగా విస్తరించాలని...
మరోవైపు దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి 65ని తక్షణమే ఆరు వరుసల రహదారిగా చేయాలని ప్రధానికి ఎంపీ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్డుపై వాహనాల రద్దీ కారణం ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే విషయాన్ని వివరించానని తెలిపారు. ఈ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించి చర్యలు చేపడతానని ప్రధాని హామీ ఇచ్చారన్నారు. ఘట్‌కేసర్ వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ను జనగాం వరకు పొడగించాలని కోరారు. భువనగిరి, జనగాం రైల్వే స్టేషన్లను మోడల్ రైల్వే స్టేషన్ల పథకంలో చేర్చాలని, యాదాద్రి, భువనగిరి ఖిల్లాలను ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రోప్ వే వంటి ప్రాజెక్టులు చేపట్టాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment