
యాదాద్రి భువనగిరి జిల్లా: ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఫామ్ హౌస్, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి వరాలు కురిపిస్తారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. తనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పడంపై వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడం శుభపరిణామం అని వెంకటరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో అద్దంకి దయాకర్ చిన్నపిల్లవాడని సెటైర్ వేశారు.
అద్దంకి దయాకర్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రాజీనామా చేస్తానని కోమటరెడ్డి వెంకటరెడ్డి చమత్కరించారు. తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారని, మునుగోడు వ్యవహారం వాళ్లే చూసుకుంటారని కాస్త అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు మునుగోడు వైపు పోనే పోనని, మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు ఎట్లా తెలుస్తాది అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు వెంకటరెడ్డి. మీడియా వెళ్లి సర్వే చేసి మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు చెప్పాలన్నారు. మునుగోడు ఎన్నికలను సెమీఫైనల్‌గా అభివర్ణించారు.