తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ కల్తీ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గదే అయినప్పటికీ విచారణ నిస్పక్షపాతంగా సాగుతుందా? లేదా? అన్నదానిపై అప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము. ఎందుకంటే.. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై కొత్త ఎత్తులు వేస్తారా? అన్న సందేహం అందరిలోనూ ఉంది కాబట్టి! లడ్డూ వ్యవహారంలో తమకు సహకరించమని సుప్రీంకోర్టు కోరిన సోలిసిటర్ జనరల్ ఒకపక్క స్వతంత్ర సిట్‌కు ఓకే అంటూనే.. ఇంకోపక్క రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌కూ సర్టిఫికెట్ ఇస్తూ వారి అర్హతలు బాగానే ఉన్నాయనడం బాబు కేంద్రాన్ని ఏ మేరకు ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి అన్నది ఇక్కడ మరచిపోరాదు.
ప్రపంచం మొత్తమ్మీద కోట్లాది మందికి ఇష్టదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెలలో ఒక అర్థం పర్థం లేని ఆరోపణ చేయడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సాగిన ఈ అసత్యపు ఆరోపణలపై నిజాలు నిగ్గుదేల్చేందుకు విషయం సుప్రీంకోర్టుకు ఎక్కింది. అయినా సరే.. టీటీడీ పవిత్రతను కాపాడవలసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రే దానిని దెబ్బతీసేలా వ్యవహరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి దీనిపై దీక్ష పేరుతో ఒక డ్రామా కూడా ఆడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తోసిరాజని బహిరంగ సభపెట్టి మరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకే ఆదేశాలు ఇస్తున్న రీతిలో, మతాల మధ్య ద్వేషాలు పెంచేలా పవన్ మాట్లాడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజకీయ డ్రామాలు ఆపండని ఘాటుగా స్పందించడం విశేషం.
ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏ విచారణకు అయినా సిద్దం అని చెప్పలేకపోవడం ద్వారా చంద్రబాబు ఎంత ఆత్మరక్షణలో పడింది అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం, టీటీడీల తరఫు న్యాయవాదులు అఫిడవిట్లలో జంతు కొవ్వు కల్తీ ప్రస్తావనే తేలేదట. సుప్రీంకోర్టు మాత్రం తుషార్ మెహతా సూచనను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ నియమించే ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఎలా పనిచేస్తుంది? దాని ఎజెండా ఏమిటి? కాల పరిమితి ఏమిటి? ఏ అంశాలపై విచారణ జరుపుతుంది? మొదలైన విషయాలపై స్పష్టత రావల్సి ఉంది.
చంద్రబాబు, పవన్ లు అధికారంలోకి వచ్చాక జరిగిన ఈ ఘటనలను గత జగన్ ప్రభుత్వానికి పులిమి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నం జరిగింది. మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి విచారణ కోరి ఉండకపోతే, చంద్రబాబు తన అరాచక ఆరోపణలు కొనసాగించే వారు. తాను చెప్పిన విధంగా నివేదిక తయారు చేసేందుకే సొంత సిట్ ను నియమించుకున్నారు. ఈ విషయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంతవరకు గమనించినట్లే అనుకోవాలి. అందుకే వారు పలు ప్రశ్నలు సంధించారు. ఏ ఆధారంతో లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని చెప్పారని సూటిగానే అడిగింది. విచారణ జరగకుండా సీఎం మీడియాకు ఎక్కడమేమిటని అసహనం వ్యక్తం చేసింది.
సుప్రీం వేసిన ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ ల వద్ద జవాబు లేదు. టీటీడీ తరపున వాదించిన లాయర్ సిద్దార్ధ్ లూద్రా కల్తీ నెయ్యి తో లడ్డూ తయారు కాలేదని చెప్పారు. ఇది ప్రభుత్వం తరపున చెప్పినట్లే. అలాంటప్పుడు లడ్డూ విషయంలో స్పష్టత వచ్చినట్లయింది. ఇక విచారణ జరపవలసింది ఈ లడ్డూ వివాదంలో ఎవరి పాత్ర ఏమిటనేదే? చంద్రబాబు నాయుడు ఏ ఆధారంతో జంతుకొవ్వు కలిసిందని అన్నారు? తనతో శ్రీ వెంకటేశ్వర స్వామే నిజాలు చెప్పించారని అంటూ, గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలలో నిజం ఎంత? అబద్దం ఎంత?పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో సాగించిన తంతు ఏమిటి? ఈ ఓ శ్యామలరావు తొలుత వెజిటబుల్ ఫాట్ (వనస్పతి) కలిసిందని, ఆ టాంకర్లను వాడలేదని ఎలా చెప్పారు. తదుపరి జంతు కొవ్వు ప్రసావన ఎందుకు చేశారు. చంద్రబాబు ప్రభావంతోనే ఆయన అలా చేశారా? లడ్డూని పరీక్షకు పంపకుండా సీఎం స్థాయిలోని వ్యక్తి రెండు నెలల తర్వాత ఏ ఆరోపణ అయినా చేయవచ్చా? మైసూరులోని సంబంధిత పుడ్ టెస్టింగ్ లాబ్ కు తిరస్కరించిన నెయ్యి శాంపిల్స్ పంపించారా? లేదా? పంపిస్తే ఆ లాబ్ ఏమి రిపోర్టు ఇచ్చింది.
పనికట్టుకుని గుజరాత్ లోని ఎన్.డి.డి.బి లాబ్ కు పంపడంలో ఏమైనా కుట్ర ఉందా? ఆ సంస్థ చైర్మన్ సరిగ్గా అంతకు ఒకటి, రెండు రోజుల ముందే టీటీడీ ఈఓని, మరికొందరు ప్రముఖులను ఎందుకు కలిసి వెళ్లారు? గతంలో చంద్రబాబు హయాంలో కాని, జగన్ హయాంలో కాని ఇలా నాణ్యత ప్రమాణాలు లేని నేయి ట్యాంకర్లను తిరస్కరించినప్పుడు, వేరే లాబ్ లకు పరీక్ష నిమిత్తం పంపించారా? లేదా? లేకుంటే ఎందుకు చేయలేదు. సుప్రీంకోర్టు విచారణలో పలు సందేహాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ యధాప్రకారం లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని ఆరోపించడంలో ఉద్దేశం ఏమిటి? అయోధ్యకు కూడా కల్తీ నెయ్యి కలిసిన లడ్డూలు పంపారని పవన్ చెప్పడానికి ఆధారం ఏమిటి? అప్పట్లో అయోధ్యలో ఈ ప్రసాదం లడ్డూలను తిన్నవారెవరు ఎలాంటి పిర్యాదు చేయలేదు కదా? ఎన్.డి.డి.బి రహస్య నివేదిక ఇస్తే దానిని టీడీపీ ఆఫీస్ నుంచి ఎలా విడుదల చేశారు?
ఇలాంటి అంశాలన్నిటిపైన కొత్త కమిటీ దర్యాప్తు చేస్తే మంచిదే. కమిటీ కూర్పులో సీబీఐ నుంచి ఇద్దరు, పుడ్ సేఫ్టి టెస్టింగ్ లాబ్ నుంచి ఒకరిని నియమించడం వరకు ఫర్వాలేదు.రాష్ట్రం నుంచి ఇద్దరు సిట్ సభ్యులను నియమించడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది. వారు చంద్రబాబు పక్షాన ఆయనకు అనుకూలంగా ప్రభావితం చేయరన్న గ్యారంటీ ఉంటుందా.? కేంద్రంలోని సీబీఐపై కూడా విపక్షాలు పలు విమర్శలు చేస్తుంటాయి. అలాంటప్పుడు సుప్రీంకోర్టు నేరుగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తే బాగుండేదేమో! లేక ఒక న్యాయమూర్తిని లేదా రిటైర్డ్ జడ్జిని నియమించి విచారణ చేయిస్తే ఎక్కువ ఉపయోగం ఉండేదేమో ఆలోచించాలి. తొలుత విచారణ జరిపినప్పుడు న్యాయమూర్తులు చేసిన ఘాటైన వ్యాఖ్యలకు తగినట్లుగా ఈ విచారణ సంఘం ఏర్పాటు కాలేదేమో అన్న అభిప్రాయం ప్రబల వచ్చు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేయాల్సిన అపచారం అంతా చేసి, కేవలం రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి తప్పుడు ఆరోపణలు చేసి ఇంత గందరగోళం సృష్టించారన్న భావన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయడం , అందులో వివాదాస్పద ,పక్షపాతంతో పనిచేసే అధికారులను నియమించిన వైనంపై రాజకీయ పార్టీలు తప్పు పట్టాయి. ఇన్ని పరిణామాలు జరిగిన ఈ ఉదంతంలో తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లనే విచారించాలి. అలాగే టీడీపీ ఆఫీస్ లో టెస్ట్ రిపోర్టు అంటూ విడుదల చేసిన టీడీపీ ప్రతినిధులను ప్రశ్నించాలి.తదుపరి ఈ ఓ శ్యామలరావును ప్రకటనలపై దర్యాప్తు చేయాలి.టెస్ట్ రిపోర్టు వచ్చిన రెండు నెలల తర్వాత దానిని ముఖ్యమంత్రి ఎందుకు బహిర్గతం చేశారో తెలుసుకోవాలి.
ఎలాగూ ఏఆర్ సంస్థకు టెండర్ వచ్చిన దానిపై విచారణ జరుగుతుంది? అయితే వారు నెయ్యి సరఫరా చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. మాజీ చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలను, మాజీ ఈఓ ధర్మారెడ్డిని ఎలాగూ కమిటీ విచారిస్తుంది! ఏది ఏమైనా మొత్తం హైందవ సమాజం అంతటిని గందరగోళంలోకి నెట్టిన ఈ అంశంలో, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు సృష్టించిన ఈ వివాదంలో నిష్పక్షపాతంగా కమిటీ విచారణ జరగాలి.అప్పుడే తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి జరిగిన అపచారానికి పరిహారం అయినట్లు అవుతుంది.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment