తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఆయనకు ఏదో మానసిక సమతుల్యత కోల్పోతున్నారా? అని అనుకున్నవారికి మరింత ఆశ్చర్యం కలిగించేలా దురహంకారంతో డైలాగులు విసురుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని దారుణమైన ట్రీట్మెంట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఈయన గెలుస్తారట. ఆ తర్వాత జగన్‌కు ట్రీట్ మెంట్ ఇస్తారట. జగన్ బట్టలూడదీస్తారట. కొద్ది రోజులుగా ఈయన చేస్తున్న ప్రసంగాలలో కొన్ని మాటలు ఇవి.
ఉడత ఊపులకు చింతకాయలు రాలతాయా? అనే సామెత ఒకటి ఉంది. చంద్రబాబుకు సరిగ్గా ఇది వర్తిస్తుంది. ఒకవైపు తాము ఒంటరిగా గెలవలేమన్న భయంతో జనసేన వైపు చూస్తున్నారు. మరోవైపు డాంబికంగా మాటలు విసురుతున్నారు. టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటే ఆయన ఇలా ఆవేశపడాల్సిన అవసరం ఏముంటుంది?. ఓటమి భయం తప్ప ఇంకొకటి కాదనిపిస్తుంది. ఇంతకీ ఆయనకు కోపం ఎందుకు వస్తోంది?..
👉 తన ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్‌తో అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాల ఎదుట ఆయన కూడా విచారణకు హాజరుకావల్సి రావొచ్చు. ఆ భయంతో ఆయన ఏవేవో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. దూషణలకు దిగుతున్నట్లుగా అనిపిస్తోంది. నిజానికి ఇంతకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి నోట ఇలా.. ట్రీట్మెంట్ ఇస్తాం, బట్టలూడదీస్తాం.. అంటూ మరో రాజకీయ నేతను పట్టుకుని అనొచ్చా?. ఆయన ఇంకో మాట కూడా అన్నారు.'ఏభైసార్లు జైలుకు పంపితే వారు ఊరుకుంటారా?’ అని ప్రశ్నిస్తున్నారు. వారు మనుషులేగా" అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దీని అర్దం ఏమిటి? ముఖ్యమంత్రి జగన్ పై ఏదో కుట్ర జరుగుతున్నట్లు కనిపించడం లేదు.
👉 అసలు ఎవరిని ఏభై సార్లు జైలుకు పంపారు?. నీచంగా ముఖ్యమంత్రిని దూషించిన తెలుగుదేశం చోటా, మోటా నేతలు కూడా మీ అండతో బెయిల్ పొంది, మళ్లీ మళ్లీ చెలరేగిపోతున్నారే!. రాజకీయాలను గబ్బు పట్టిస్తున్నారే!. చండాలపు పోస్టింగ్‌లు పెట్టినవారికి, స్కామ్‌లు చేసినవారికి, అల్లర్లు చేస్తున్నవారికి.. చంద్రబాబు మద్దతు ఇచ్చే పరిస్థితి. అది ఆయన రాజకీయ మనస్తత్వానికి అద్దం పడుతోంది. ఇలాంటివారిని కదా సైకో రాజకీయవేత్తలు అనవలసింది. పైగా తాను ముఖ్యమంత్రిని అయితే కొన్ని మీడియా సంస్థలను బ్యాన్ చేస్తానని నిస్సిగ్గుగా చెబుతున్నారే!. ఇప్పుడు ఏకంగా మరో నేతను పట్టుకుని ట్రీట్ మెంట్ ఇస్తానని అంటారా?. ఇదన్నమాట ఈయన ప్రజాస్వామ్యం.
👉 చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వంలో ఎవరిపైన అయినా అక్రమంగా కేసులు పెడితే.. ఆ విషయం సోదాహరణంగా చెప్పి ప్రజల సానుభూతి పొందవచ్చు. అలా చేయలేకపోతున్నారు. ఏదో విధంగా కార్యకర్తలను రెచ్చగొట్టి వారిని కేసులలో ఇరికించి, తద్వారా వారు పార్టీలోనే కొనసాగేలా వ్యూహం అమలు చేస్తున్నది చంద్రబాబు కాదా?. నిజానికి ఇలాంటి మాటలు అంటున్న చంద్రబాబుకు ట్రీట్మెంట్ ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ నేతలు గనుక అంటే.. అదిఎంత ఇబ్బందిగా ఉంటుంది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తను చేసే ప్రతి కార్యక్రమానికి నెగిటివ్‌గా వార్తలు రాస్తున్న మీడియానే జగన్ ఏమీ అనడం లేదు కదా!. కాకపోతే దుష్టచతుష్టయం అని చెప్పి ప్రజల మద్దతు కూడగడుతున్నారు అంతే. అయినా చంద్రబాబు శాంతించలేకపోతున్నారు.
👉 అందుకు కారణం ఆయన్ని ఏపీ ప్రజలు కేవలం 23 సీట్లకు పరిమితం చేసి ఘోరంగా ఓడించడమే. ఆ అక్కసులో నిత్యం ఏదో ఒక అలజడి సృష్టించడానికి ఆయన యత్నిస్తున్నారు. అయినా ఏపీలో శాంతిభద్రతలు సజావుగా ఉండడంతో ఏమీ చేయలేక నోటికి వచ్చిన కూతలు కూస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు బరి తెగించి, బట్టలూడదీసుకుని మరీ చండాలంగా ప్రవర్తిస్తున్నాయి. పచ్చి అబద్దాలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయి.
👉 మార్గదర్శి కేసులో రామోజీరావును సీఐడీ విచారించడం తప్పు అనిపిస్తే దైర్యంగా చెప్పాలి. అలాగే ఆయన మార్గదర్శి చిట్స్ ద్వారా చట్ట విరుద్దంగా డబ్బు మళ్లించారా? లేదా? అనేది కూడా చెప్పాలి. అనుమతి లేకుండా డిపాజిట్లు తీసుకోవడం తప్పా?రైటా? అనే దానికి సమాధానం చెప్పాలి. అవేమీ చెప్పని చంద్రబాబు, రామోజీరావులు సీఎం జగన్పై ద్వేషం వెళ్లగక్కుతున్నారు.
👉 రామోజీకి సంబంధించి వచ్చిన తాజా వీడియో లో ఆయన సానుభూతి కోసం అన్నారో లేదంటే ఇంకే ఉద్దేశంతో అన్నారో గానీ.. తన వద్దకు సీఐడీ రావడం కాలమహిమో, జగన్ మహిమో అని అన్నారు. అంతే తప్ప సీఐడీ అడిగిన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పలేకపోయారు. ఆయన చేతిలో పత్రిక, టీవీ ఉందని ఇష్టం వచ్చినట్లు పచ్చి అబద్దాలను వండి వార్చుతున్నారు. నాలుగేళ్లుగా రామోజీ ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నారు. ఆ రకంగా జగన్‌ను వేధిస్తున్నామని రామోజీ సంతృప్తి చెందితే.. చంద్రబాబేమో తనపై వచ్చిన స్కాముల ఆరోపణలకు జవాబు ఇవ్వలేక ట్రీట్మెంట్ డైలాగులు వదులుతూ భయపెట్టాలని చూస్తున్నారు. తద్వారా తనవరకు విచారణ రాకుండా చూసుకోవాలన్న ఎత్తుగడను ఆయన అనుసరిస్తున్నట్లుగా ఉంది.
👉 చంద్రబాబు, రామోజీలు ఒకరకంగా పిరికితనంతో వ్యవహరిస్తుంటే.. గతంలో తనపై కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐని తమ పనిముట్టుగా వాడుకుని కేసులు పెట్టినా.. వైఎస్ జగన్ తొణకలేదు.. బెణకలేదు. ఆయా కేసుల్లో తన వాదన ఏమిటో వినిపించారే తప్ప ఇలా బీద ఏడుపులు చేయలేదు. అప్పుడు చంద్రబాబు, సోనియాగాంధీ, సీబీఐ లక్ష్మీనారాయణ కలిసి ఎన్ని కుట్రలు పన్నింది అందరికీ తెలుసు. ఆనాడు రామోజీ ఎలాంటి దారుణమైన పాత్ర పోషించింది తెలియదా?. జగన్ పై ఎన్ని కుట్రపూరిత వార్తలు రాశారు. ఎన్నిసార్లు జగన్‌ను వీరు తమ పత్రికలో తీహారు జైలుకు పంపించారు? మరి అవన్నీ రామోజీ మహిమ అనాలా? లేదంటే ఇంకొకటి అనాలా?..
👉 ఇప్పటికీ అనేక తప్పుడు వార్తలు రాస్తున్నారు. మరి అవి రామోజీ మహిమ కాదా!. తామేమి చేసినా, తాము దొరికిపోయినా.. ఎవరూ ఏమీ అనకూడదు. తాము మాత్రం ఎదుటివారిపై ఎంత బురదైనా చల్లుతాం అన్నట్లు వ్యవహరిస్తే ఎవరైనా సహించగలుగుతారా?. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ మార్గదర్శి కేసుకు సంబంధించి ఆయా సదస్సుల్లో, సందర్భాల్లో మాట్లాడుతూ చెబుతున్న సంగతులలో ఒక్కదానికి రామోజీ లేదంటే చంద్రబాబు సమాధానం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నారా?.. మరి ఇదే తరహా కేసులో టీడీపీ నేత అప్పారావు, ఆయన కుమారుడు వాసులు ఎలా అరెస్టు అయ్యారు?. రామోజీ గానీ, ఆయన మనుషులు గానీ సురక్షితమైన ఆర్డర్లు ఎలా పొందగలిగారని ఉండవల్లి ప్రశ్నిస్తున్నారు. న్యాయవ్యవస్థకు సంబంధించి పలు సూటి ప్రశ్నలు ఆయన సంధించారు. వాటికి సమాధానం ఇచ్చే పరిస్థితి ఆ వ్యవస్థలో ఉందని ఎవరూ అనుకోవడం లేదు.
ఏదిఏమైనా చంద్రబాబు నాయుడులో పెరిగిన అసహనం, మానసిక ఉద్రిక్తత తదితరాల కారణంగా.. ట్రీట్మెంట్, బట్టలూడదీస్తానంటూ.. వార్నింగ్‌లు ఇస్తున్నారు. అయినా కూడా ఆయనకు వచ్చే నోటీసులు రాకుండా ఆగుతాయా?..
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
ఇదీ చదవండి: బిల్డప్ బాబూ బిల్డప్..!
Comments
Please login to add a commentAdd a comment