Kommineni Comment On CM Jagan Powerful Punches On Pawan Kalyan - Sakshi
Sakshi News home page

జగన్ క్లీన్‌ దెబ్బ.. పవన్ విలవిల.. అందుకే అలా..

Published Thu, Jun 29 2023 11:01 AM | Last Updated on Thu, Jun 29 2023 1:06 PM

Kommineni Comment On CM Jagan Powerful Punches On Pawan Kalyan - Sakshi

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వదలిన డైలాగులు పంచ్ కాదు.. పంజా విసిరినట్లుగా ఉన్నాయి. గత పది రోజులుగా చెలరేగిపోతున్న పవన్ కల్యాణ్‌కు ఎక్కడ దిగాలో.. అక్కడ దిగేలా జగన్ మేకులు కొట్టారు. వారాహి వాహనాన్ని ఆయన లారీతో పోల్చారు. ఆయన చేస్తున్న ప్రచారం అంతా అబద్దమని, అసలు ఆయనకు ఓ పద్దతి.. పాడు లేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. మన్యం జిల్లా కురుపాం వద్ద జరిగిన బహిరంగ సభలో అమ్మ ఒడి కార్యక్రమం కింద విద్యార్దుల తల్లుల ఖాతాలలో డబ్బులు వేసిన తర్వాత మాట్లాడుతూ రాజకీయ అంశాలపై కూడా స్పందించారు. తొలిసారిగా పవన్ ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలలో చేస్తున్న యాత్రకు బదులు ఇచ్చారు.

పవన్ తన యాత్రలో నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే.. జగన్ ఎక్కడా అసభ్య పదాల్ని వాడలేదు. పవన్ వాడిన అభ్యంతరకర పదాలను కొన్నిటిని  ఉటంకిస్తూ, తాము అలా మాట్లాడలేమని చెప్పి హుందాగా వ్యవహరించారు. పవన్ బూతులు తిడుతున్నారు కదా అని జగన్ రెచ్చిపోకపోవడం ఒక ప్రత్యేకతగా భావించాలి. పవన్ చేస్తున్న ప్రసంగాలు అన్నింటింకీ  జగన్  ఒక్క వ్యాఖ్యతో  ట్విస్టు ఇచ్చినట్లు అనిపిస్తోంది.

✍️ పవన్ కల్యాణ్‌ మాదిరి నలుగురు భార్యలను మార్చి.. పవిత్రమైన వివాహ వ్యవస్థను పాడుచేయలేమని జగన్ అన్నారు. తాను అచ్చమైన సనాతనవాది అయినట్లు, హిందూ సంప్రదాయాలను నిష్టగా ఆచరించే వ్యక్తి మాదిరి నటించే పవన్ కల్యాణ్‌కు  ఈ వ్యాఖ్య ఘాటు నషాళానికి అంటి ఉండాలి. దీనికి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి. లేకుంటే గతంలో మాదిరి మీరు కూడా ముప్ఫై పెళ్లిళ్లు చేసుకోండని బహిరంగ సభలలో చెబితే నవ్వుల పాలవుతారు. ఈ రకంగా పవన్‌ను జగన్ దెబ్బతీశారు.

✍️ రాజకీయాలలో ప్రత్యర్ధుల బలహీనతలపై కొట్టడం ఒక ఆర్ట్. ఆ విషయంలో జగన్ నైపుణ్యం సాధించే దిశలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను.. ఇద్దరినీ ఆత్మరక్షణలో పడవేస్తున్నారు. చంద్రబాబుకు అబద్దాలు ఆడడం, ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం వీక్ నెస్ . అలాగే పవన్ కళ్యాణ్ కు పెళ్లిళ్ల వ్యవహారం ప్రధాన వీక్ నెస్ .ఈ మధ్య బూతులు మాట్లాడడం కూడా ఆయనకు బలహీనతగా కనిపిస్తోంది.  వీరిద్దరిని కలిసి ఈ విషయంలో జగన్ ఆడుకున్నారని చెప్పాలి.

✍️ కురుపాంలో జగన్ ప్రసంగం చూడండి. పవన్ కల్యాణ్‌ను ఆయన చంద్రబాబు దత్తపుత్రుడుగా అభివర్ణిస్తుంటారు. అదే పేరుతో ఆయన ఉచ్చరిస్తుంటారు.

‘‘దత్తపుత్రుడు మామూలుగా మాట్లాడడు. ఊగిపోతుంటాడు. తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటాడు.తాట తీస్తానంటాడు. ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆ మనిషి నోటికి అదుపు లేదు. నిలకడా లేదు. వారిలో నలుగురిని పెళ్లి చేసుకుని భార్యలను మార్చలేం’’ అని జగన్ వ్యాఖ్యానించినప్పుడు సభికుల నుంచి విశేష స్పందన వచ్చింది. అలాగే.. ప్యాకేజీ స్టార్ దత్తపుత్రుడిలా బూతులు తిట్టలేం. అవన్నీ వారికి చెందిన పేటెంట్ అని జగన్ కొద్ది పదాలతో పవన్ గాలి తీసేశారు. తన ఉపన్యాసంలో పనికిమాలిన పంచ్ డైలాగులు ఉండవని అంటూ తమది సామాజిక న్యాయం, ఓదార్పు యాత్ర పునాది అని జగన్ చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నది, విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు,  గిరిజనులకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నది ఆయన తన సభలో ప్రజలకు వివరించారు. గతంలో చంద్రబాబు నాయుడు  టరమ్ పూర్తి అయ్యే సమయంలో కొద్ది నెలలు ఒక గిరిజనుడికి మంత్రి పదవి ఇస్తే, జగన్ ఏకంగా తొలి రోజు నుంచే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గిరిజనులను  గౌరవించారు. ఆ విషయాన్ని ప్రజలకు ఆయన గుర్తు చేస్తున్నారు.

✍️ పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయన నిజంగానే ఎక్కడకు వెళితే అక్కడ తాను చిన్నప్పుడు తప్పిపోయాననో, అక్కడే పుట్టాననో ఇలా ఏవేవో చెప్పి  ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. ఇప్పటికి నాలుగు పట్టణాలలో ఆయన తానిక్కడే పుట్టానని అన్నారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవన్ని ఆయన పరపతిని దెబ్బతీస్తాయి. అలాగే ముఖ్యమంత్రిని , వైఎస్సార్‌సీపీ రౌడీలని, బాబాయిని చంపినవారని, అసలు ప్రభుత్వంలో ఎవరికి ఏమీ జరగలేదని , కాపుల రిజర్వేషన్ ఇవ్వలేదని.. గుడ్డలూడదీసి కొడతామని, వెధవలు అంటూ రకరకాల బూతుపదాలను వాడుంటారు. జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. పోనీ తన గెలుపు మీద ఆత్మ విశ్వాసం ఉందా? అంటే అదీ లేదు.  

✍️ తాను ఓడిపోతానని తెలుసునని, తనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని చెప్పి తన అభిమానులను నిరాశపరచి, తెలుగుదేశం పార్టీ వారిని సంతోషపెడుతున్నారు. పవన్ కల్యాణ్ తన పార్టీకోసం తిరుగుతున్నారా? లేక టీడీపీ కోసం టూర్ చేస్తున్నారా? అనే అనుమానం ప్రజలకు వస్తుంటుంది. ఈ నేపధ్యంలో పవన్ కల్యాణ్‌కు ఒక ఎజెండా లేదని, ఆయన  వాడిన పదాలను సభ్యసమాజం అంగీకరించలేదని చెప్పడానికి జగన్ ఈ సభను వినియోగించుకున్నారు. అలాగే అసలు సమాజం పవన్ వరుస పెళ్లిళ్లను ఆమోదించదని చెప్పడం ద్వారా ఆయనపై వ్యతిరేకత పెరిగేలా జగన్ యత్నించారు. ఇదే పవన్ బలహీనతపై పంజా విసరడం అంటే..తానేదో పంచ్ డైలాగులు చెబుతున్నానని  మురిసిపోతున్న సమయంలో జగన్ పంజాదెబ్బకు పవన్ విలవిలలాడే పరిస్థితి ఏర్పడింది.


::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement