చంద్రబాబు నాయుడు ( ఫైల్ ఫోటో )
ఆంధ్రప్రదేశ్ లో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు జరిగాయి. అవే కనుక ఏ తెలంగాణలోనో, లేక మరే రాష్ట్రంలోనో జరిగి ఉన్నట్లయితే , మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది. కాని అది ఏపీ కనుక, అక్కడ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు కనుక దానికి ఒక వర్గం మీడియా అంత ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపించదు. అయినా ఫర్వాలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తీర్చిదిద్దే కార్యక్రమాలవి. ఒకటి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చడం, మరొకటి మైక్రోసాప్ట్ సంస్త ఆద్వర్యంలో వేలాది మంది నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు అందచేయడం. గతంలో తన వల్లే ఇంజీనిరింగ్ చదివారని మైక్రోసాప్ట్ సిఈఓ సత్య నాదెండ్ల గురించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకునేవారు.
నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వకముందే ఆయన ఇంజనీరింగ్ పూర్తిచేశారు. అది వేరే సంగతి. కాని సత్య నాదెండ్లతో మాట్లాడి ఇప్పుడు జగన్ సంకల్పించిన నైపుణ్య శిక్షణను చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు?బిల్ గేట్స్ మీటింగ్ లే రద్దు చేసుకుని తనతో విందు సమావేశం జరిపారని ప్రచారం చేసుకున్నవారు, ఆయనతో మాట్లాడి లక్షలాది మంది పిల్లలకు ఎందుకు శిక్షణ ఇప్పించలేకపోయారు? ఎందుకంటే చంద్రబాబుకు విషయం కన్నా, విపరీత ప్రచారం అంటే ఎక్కువ ఇష్టం కనుక. మరి అదే జగన్ ప్రచారార్భాటం లేకుండా 36 వేల మంది విద్యార్దులకు సాప్ట్ స్కిల్స్ లో మైక్రోసాప్ట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించారు.దీనిని పిల్లలు సొంతంగా ఖర్చు చేసి నేర్చుకోవాలంటే ఒక్కక్కరు 25 వేల నుంచి ముప్పైవేల వరకు అవుతుందట.
అలాంటిదానిని మైక్రోసాప్ట్ వారిని ఒప్పించి అతి తక్కువ వ్యయానికి 32 కోట్లకు ఈ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఎపిలో నైపుణ్యాభివృద్ది సంస్థ చంద్రబాబు టైమ్ లోనే ఆరంభం అయింది. అక్కడ శిక్షణ ఇచ్చింది తక్కువ.. స్కామ్ చేసింది ఎక్కువ. శిక్షణ ఇవ్వకుండానే బిల్లులు రాసేసుకున్నారన్న అబియోగాలు వచ్చాయి. సుమారు 250 కోట్ల మేర స్కామ్ జరిగిందన్న కేసు విచారణ జరుగుతోంది. మరి జగన్ ప్రాక్టికల్ గా వేలాది మంది పిల్లలకు శిక్షణ ఇప్పించారు.
చంద్రబాబు టైమ్ లో సింగపూర్ నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలను తీసుకు వచ్చి, వారికి కారుచౌకగా భూములు ఇవ్వడానికి చూపిన శ్రద్ద ఇలాంటివాటిపై పెట్టి ఉంటే ఎంతో ప్రయోజనం జరిగి ఉండేది. ఈ కార్యక్రమంలో జగన్ సుత్తి కొట్టకుండా, సూటిగా విద్యార్దుల కోసం ఎలాంటి స్కీములు తెచ్చింది తెలిపి ,వారికి నైపుణ్యం అబ్బడానికిగాను చేపట్టిన చర్యలను వివరించారు.
ఏపీలో భవిష్యత్తు లో విద్యార్ధులను నిజమైన సంపదగా చేయాలన్న తన లక్ష్యాన్ని రుజువు చేసుకున్నారు. మరో అంశం ఏమిటంటే విశాఖ సముద్ర తీరంలో ప్లాస్టిక్ వ్యర్దాలను తొలగించడంతోపాటు , వాటిని రీసైకిలింగ్ చేసే పార్లే ఫర్ ద ఓషన్స్ అనే సంస్థతో ఒప్పందం చేసుకోవడం . ఇది కూడా భారీ ప్రాజెక్టే. వచ్చే కొద్ది సంవత్సరాలలో ఈ సంస్థ పదహారువేల కోట్ల వ్యయం చేస్తుంది. దీని ద్వారా ఇరవైవేల మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని జగన్ వివరించారు. చంద్రబాబు టైమ్ లో విశాఖ బీచ్ లో బికినీ ఉత్సవాలు పెట్టాలని భావించారు.దానిపై ప్రజలలో గగ్గోలు పుడితే వెనక్కి తగ్గారు.
కానీ ఇప్పుడు జగన్ ప్లాస్టిక్ లేని పర్యావరణ హిత బీచ్ లను తయారు చేసి,టూరిజంను ప్రమోట్ చేయడానికి చొరవ తీసుకున్నారు. ఏపీలో ప్లాస్టిక్ ను క్రమేపి తొలగించి, దాని స్థానంలో క్లాత్‌ను వాడాలని తాజాగా నిర్ణయించారు.ముందుగా ప్లాస్టిక్ ప్లెక్సీలను బాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరు తెలివైనవారు, ఎవరు రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారన్నదానికి ఈ పోలిక సరిపోతుంది. గత ప్రభుత్వంలో అనంతపురంలో ఒక కార్ల పరిశ్రమ ద్వారా అంతా కలిపి వెయ్యి మందికి ఉపాధి వచ్చిందేమో తెలియదు కాని, అది అసలు ప్రపంచంలోనే పెద్ద విషయంగా టీడీపీ నేతలు ప్రచారం చేసుకునేవారు.
వారు అతిగా ప్రచారం చేసుకోకపోతే దానిని కూడా ఒప్పుకోవచ్చు. మరి జగన్ ఈ మద్యకాలంలో తీసుకువస్తున్న ప్రాజెక్టులన్నీ వేల కోట్ల రూపాయలవి. వేలాది మందికి ఉపాధి కల్పించేవి అన్న సంగతిని ఒప్పుకోవడానికి వారి మనసు సిద్దపడడం లేదు. అందుకే టిడిపి నేత లోకేష్ ఇటీవలికాలంలో జగన్ ప్రారంభించిన పరిశ్రమలన్నీ తమ తండ్రి తెచ్చినవేనని ఒక ప్రకటన చేసి ఆత్మ సంతృప్తి చెందారు. ఇంతకాలం చంద్రబాబు, లోకేష్ లు చెప్పిందేమిటి? ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని కదా? అసలు ఒక్క పెట్టుబడి అయినా వచ్చిందా అని ప్రశ్నించేవారు కదా. తీరా పరిశ్రమలు వస్తుంటే ఏమి అనాలో తోచక ,వాటిని తమ ఖాతాలో వేసుకోవడానికి యత్నిస్తున్నారు.
800 కోట్ల రూపాయల ప్రాజెక్టు కూడా ఒక ప్రాజెక్టేనా అని లోకేష్ అంటున్నారంటే ఆయన పరిజ్ఞానం గురించి ఏమని అనుకోవాలి? విశాఖలో కోట్ల రూపాయలు వ్యయం చేసి సదస్సులు నిర్వహించిన ఆనాటి టీడీపీ ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టుల వివరాలను లోకేష్ ఇవ్వగలిగితే అసలు వాస్తవాలు బయటపడతాయి. రానివన్ని పరాయి ఖాతాలో, వచ్చినవన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి అలవాటు పడితే ఇలాగే మాట్లాడతారని అనుకోవాలి.
కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిసిటి స్టంట్ లేకుండా వేల కోట్ల రూపాయల పెట్టుబడి తేవడమే కాకుండా విశాఖకు విశేష ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఏపీలో కూడా పెద్ద నగరం ఉందని ప్రపంచానికి తెలియచెప్పే యత్నాన్ని జగన్ చేస్తుండడం ముదావహం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. ఆయనను ఏదో రకంగా విమర్శించాలని అనుకునేవారికి ,ఇదంతా అభివృద్దే అన్న సంగతి అర్ధం అయ్యేలా తన క్రియ ద్వారా చేయగలుగుతున్నారు. తను ప్రకటించిన పెట్టుబడులన్నీ వాస్తవరూపం దాల్చేవరకు ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని ఆశిద్దాం.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment