
తాడేపల్లిగూడెం రూరల్: ‘రాజధాని పేరిట అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబు వేలాది ఎకరాల భూములను దోచుకుని ఆ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చాలని ప్రయత్నించడం నిజం కాదా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బట్టబయలు చేసిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో నిజం లేదా? టీడీపీ నాయకులకు దమ్ముంటే తప్పని చెప్పాలి...’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సవాల్ విసిరారు.
గత టీడీపీ ఐదేళ్ల పాలనాకాలంలో చంద్రబాబు దోచుకున్న డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వస్తున్నారని, అది ఎన్నాళ్లో సాగదని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం కొట్టు సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల శాతం కంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల శాతం తక్కువేనని స్పష్టంచేశారు. చంద్రబాబు పాలనాకాలంలో చేసిన అప్పుల కంటే కూడా ఇప్పుడు తక్కువగానే అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు గాలికొదిలేసిన విద్యుత్ డిస్కంల బకాయిలు రూ.22 వేల కోట్లను సీఎం జగన్ చెల్లిస్తూ వస్తున్నారన్నారు.
నాడు చంద్రబాబు నిర్లక్ష్యంగా వదిలేసిన రోడ్లను సైతం నేడు నిర్మిస్తున్నారని తెలిపారు. టీడీపీ సిగ్గుమాలిన పార్టీ అని, ఆ పార్టీ నాయకులు దిగజారి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచితే, రాష్ట్ర ప్రభుత్వంపై బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ.200 ఇస్తే గానీ టీడీపీ కార్యక్రమాలకు మనుషులు రాని దుస్థితి నెలకొందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment