వినేవాడుంటే... కథలు చెప్పేది కూటమి ప్రభుత్వమని.. | KSR Comment On AP Government Dramas | Sakshi
Sakshi News home page

వినేవాడుంటే... కథలు చెప్పేది కూటమి ప్రభుత్వమని..

Published Thu, Dec 5 2024 10:55 AM | Last Updated on Thu, Dec 5 2024 4:51 PM

KSR Comment On AP Government Dramas

ఆంధ్రప్రదేశ్‌లో నెలకో కొత్త డ్రామా మొదలవుతోంది. సూపర్‌సిక్స్‌ హామీలను ఎప్పుడో గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నెలకో కొత్త కథ చెబుతోందనుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి గద్దెనెక్కగానే వైఎస్సార్‌సీపీ నేతలపై దౌర్జన్యం, దాడులతో తొలి నెల కథ మొదలు కాగా.. ఆ తరువాత ముంబై నటి జత్వానీతో వైఎస్సార్‌సీపీ నేతలను, తమకు అనుకూలంగా లేని అధికారులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఈ తంతు ముగుస్తోంది అనుకునేంతలోపే తిరుపతి లడ్డూ వివాదాన్ని ప్రజల నెత్తిన రుద్దారు. ఆపై.. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు, కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రి అల్లిన కథ.. ఇలా సాగిపోతోంది కూటమి రాజకీయ డ్రామా!

ఇప్పటికే పలు వ్యవస్థలను ద్వంసం చేసిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తాజాగా ఆర్థిక విధ్వంసానికి పూనుకున్నట్లు కనిపిస్తోంది. సామాజిక కోణమూ ఇందులో ఉందంటున్నారు. రెడ్డి సామాజికవర్గ పారిశ్రామిక వేత్తలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రభుత్వం దాష్టికాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. కాకినాడ డీప్ పోర్టు కంపెనీలో బలవంతంగా షేర్లు  పొందారని అంటూ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రావుతో ఒక ఫిర్యాదు చేయించి అందులో గత ముఖ్యమంత్రి జగన్ ను కూడా ఎలాగైనా ఇరికించాలన్న ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. తెలుగుదేశం పత్రిక ఈనాడులో వచ్చిన ఆ కథనం చదివితే అచ్చంగా ఒక కాల్పనిక కథను తయారు చేసేందుకు విఫలయత్నం చేసినట్లు స్పష్టమవుతుంది. చాలాచోట్ల తర్కం అసలు కనిపించకుండా పోయింది మరి!

గతంలో మాజీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కంపెనీ కాలుష్యానికి కారణమవుతోందని ప్రభుత్వం నోటీసిస్తేనే.. రాష్ట్రంలోంచి పరిశ్రమలను తరిమికొడుతున్నారని తెలుగుదేశం, ఆ పార్టీ మీడియా పచ్చి అబద్దాలను ప్రచారం చేశాయి. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కేంద్ర  ప్రభుత్వ సంస్థతో జరిగినా, జగన్‌పై ద్వేషంతో అదానీ కంపెనీలపై  బురద చల్లారు. ఈ పరిణామాలు అదానీ కంపెనీ ఏపీలో పెట్టాలనుకున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు. తాజాగా కూటమి ప్రభుత్వం అరబిందో గ్రూప్‌పై దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. అరబిందో మందుల తయారీతో సహా పలు రంగాలలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నిర్వహిస్తున్న సంస్థ. దాదాపు రూ.72 వేల కోట్ల పెట్టుబడులతో 150 దేశాల్లో యూనిట్లు నడుపుతోంది. 

కంపెనీ యజమానులు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డికి దగ్గర బంధువులు కావడంతో వారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం  జరిగిన లావాదేవీలపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఇందులో భాగమే అనిపించక మానదు. పోనీ దానికి ముందు అరబిందో కి లీగల్ నోటీసులు ఇచ్చారా? లేదు. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేయడం, వెంటనే కేసు నమోదు కావడం సందేహాలకు తావిస్తోంది. 

కాకినాడ డీప్  పోర్టు లిమిటెడ్ లోని రూ.2500 కోట్ల విలువైన వాటాలను రూ.494 కోట్లకు, కాకినాడ సెజ్ లోని రూ.1109 కోట్ల విలువైన వాటాలను రూ.12 కోట్లకే బలవంతంగా బదలాయించుకున్నారని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇందులో నిజం ఏమాత్రం ఉన్నా చర్య తీసుకోవచ్చు కానీ ఆ వార్తను చూస్తే ఏదో కల్పిత గాథ చదువుతున్నట్లు అనిపిస్తుంది.

ఎందుకంటే కేవీరావు చిన్న వ్యక్తేమీ కాదు.1997లోనే ప్రభుత్వ అధీనంలోని కాకినాడ పోర్టును అతి తక్కువ పెట్టుబడితో  తన కంట్రోల్ కు తెచ్చుకున్న  వ్యక్తి. చంద్రబాబు సన్నిహితుడు కావడం వల్లనే పోర్టు ఆయనకు చౌకగా దక్కిందని అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా విమర్శించింది కూడా. ఈ అంశంపై అసెంబ్లీలో చాలా రచ్చ జరిగింది. అంత ఫవర్ ఫుల్ వ్యక్తి, కేవలం ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి బెదిరిస్తే లొంగిపోతారా? అన్న అనుమానం రాకమానదు. పనిలో పని ఈనాడు మీడియా జగన్‌ను కుట్రదారుడిగా ప్రొజెక్టు చేయడానికి గట్టి ప్రయత్నమే చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆడిట్‌లో  కాకినాడ సీ పోర్ట్ సంస్థ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.965 కోట్ల నష్టం కలిగించిందని తేల్చిందట. అది తప్పుడు నివేదిక అని ఇప్పుడు కేవీ రావు అంటున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే, సంస్థ  ఎండీగా ఆయనే ఉన్నారు కదా? మరో ఆడిటింగ్ సంస్థతో ఆడిట్ చేయించి ప్రభుత్వ వాదనను తప్పు అని రుజువు చేసి ఆ పత్రాలు తన వద్దకు ఎందుకు ఉంచుకోలేదో తెలియదు. లేదా ప్రభుత్వంపై దావా వేసే అవకాశం ఎందుకు వదులుకున్నారు? 

విక్రాంత్ రెడ్డి రమ్మనగానే హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లవలసిన అవసరం కేవీ రావుకు ఏమిటి? ఒప్పంద పత్రాలు సిద్దమవుతున్నప్పుడు కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ వాటాలు అరబిందోకి అమ్ముతున్నట్లు తెలిసిందని ఆయన అన్నదానిలో నిజం ఉండే అవకాశం ఉందా? ఈ కంపెనీ మొత్తాన్ని నిజంగానే అరబిందో స్వాధీనం చేసుకోదలచుకుంటే 41.12 శాతం మాత్రమే ఎందుకు తీసుకుంటుంది? అన్నదానికి జవాబు రావల్సి ఉంది. అరబిందో కి ఇచ్చిన వాటాల విలువ రూ.494 కోట్లుగా లెక్కవేశారని, నిజానికి అది రూ.2500 కోట్ల పై మాటే అని, దానిపై నిరసన తెలిపానని ఆయన చెబుతున్నారు. అదే వాస్తవమైతే ఆ మేరకు నిరసన లేఖ కూడా ఉండాలి కదా!వాటాలు అమ్మకపోతే తనను, తన కుటుంబ సభ్యులను జైలులో పెడతామని బెదిరించారని, ఇతర వ్యాపారాలు నిలిపివేస్తామని భయపెట్టారని కేవీ రావు ఫిర్యాదులో తెలిపారు. కొన్ని వేల కోట్ల రూఏపాయల వ్యాపారానికి అధిపతి అయిన కేవీ రావును అంత తేలికగా భయపెట్టే పరిస్థితి ఉంటుందా? 

ఈ డీల్ అయ్యాక విక్రాంత్ రెడ్డి తదితరులు ఆయనను జగన్ వద్దకు తీసుకువెళ్లారట. అప్పుడు నిరసన చెప్పడానికి ప్రయత్నించినా జగన్ మాట్లాడనివ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇష్టం లేకపోతే డీల్ పూర్తి అయ్యాక  జగన్ వద్దకు వెళ్లవలసిన అవసరం ఏమిటి? ఇదంతా జగన్ కోసమే జరుగుతోందని ఆయనకు అనిపించిందట. అంతే!  ఐదేళ్ల తర్వాత ఫిర్యాదులో ఆ విషయం చెబుతున్నారు. నిజంగానే జగన్‌కు  ఈ కంపెనీలో వాటా ఉంటే వేరే వారి పేరుతో ఎందుకు తీసుకుంటారు? గత అనుభవం చూస్తే జగన్ అలా చేయరన్న భావన కలుగుతుంది. 

సాక్షి మీడియా, పవర్ ప్రాజెక్టులు,సిమెంట్ కంపెనీ వంటివాటిని స్థాపించినప్పుడు ఆయన బినామీ పేర్లను వాడలేదు కదా? అలా వాడి ఉంటే అసలు కేసులే ఉండేవి కావు కదా! వాటాల బదిలీ తర్వాత ఆడిట్ నివేదికలో నష్టం రూ.తొమ్మిది కోట్లకు తగ్గించుకున్నారని అంటున్నారు. అందులో నిజం ఉంటే అప్పుడే ప్రొటెస్ట్ చెప్పాలి కదా. కాకినాడ సీపోర్టు లిమిటెడ్ యాజమాన్యం ఆయన చేతిలో ఉంటే, అలా ఎందుకు చేయలేదో అర్థం కాదు. విక్రాంత్ రెడ్డి వాటాలు బదిలీ చేయకపోతే ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇస్తుందని అన్నారట. ఈ మాటకే కేవీ రావు వణికి పోతారా? అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే వాటాలను ఎంతకు అమ్ముతున్నది, ఎంతకు కొంటున్నది ఒప్పందంలో లేదని, మర్చంట్ బ్యాంకర్లు నిర్ణయిస్తారని అంటే ఈయన ఎందుకు అంగీకరించింది తెలియదు. ఇలా కేవీ రావు ఫిర్యాదులో అనేక లొసుగులు కనిపిస్తాయి. ఈ వ్యవహారం అంతా చూస్తే  పక్కా ప్లాన్ ప్రకారమే ఈ కథ నడిపిస్తున్టన్లు  అనిపిస్తుంది. 

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇదే కేవీరావు, చంద్రబాబు నాయుడులపై తీవ్రమైన  ఆరోపణలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు మెప్పుకోసమో, మరెందుకోసమో గాని పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు వద్ద డ్రామా నడిపారు. రేషన్ బియ్యం అక్రమంగాఎగుమతి అవుతున్నాయంటూ యాంకరేజీ పోర్టు వద్ద గొడవ చేశారు. దీనికి, డీప్ సీ పోర్టుకు తేడా తెలియకుండా ఆరోపణలు చేశారు. తదుపరి మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం పెట్టి అరబిందో సంస్థ చేతికి వెళ్లాకే పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. తీరా చూస్తే రేషన్ బియ్యం పట్టుబడింది ప్రభుత్వ అధీనంలోని యాంకరేజి పోర్టులో. ఆ తర్వాత రోజు కాకినాడ పోర్టు వాటాల మార్పిడిపై వివాదం ఉందంటూ, సీఐడీకి ఫిర్యాదు చేశారని ఎల్లో మీడియా కథనం. 

అరబిందో సంస్థను, విక్రాంత్ రెడ్డి తదితరులను టార్గెట్ చేస్తూ, అందులో జగన్‌ను  ఇరికిస్తూ కేవీరావుతో ఫిర్యాదు ఇప్పించారు. నిజంగానే కేవీరావుకు  వాటాల అమ్మకం ఇష్టం లేకపోతే అప్పుడే ప్రొటెస్ట్ చెప్పి ఉండవచ్చు. కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసి ఉండవచ్చు. అప్పట్లో ప్రతిపక్ష నేత గా ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా దీనిని వివాదం చేసి ఉండవచ్చు. ఎల్లో మీడియా జగన్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్న నేపధ్యంలో కేవీరావు 2020లోనే కనుక ఈ ఆరోపణలు చేసి ఉంటే ఆ మీడియా పండగ చేసుకునేదే కదా! ఎవరైనా తమ ఆస్తిని అమ్ముకుని, ఐదేళ్ల తర్వాత దాని విలువ పెరిగిందనో, మరో కారణంతోనో కేసులు పెట్టడం మొదలైతే పరిస్థితి ఏ దశకు వెళుతుందో అర్థం చేసుకోవచ్చు.

దీనిపై అరంబిందో కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కేవీరావు ఇవేవి తెలియని అమాయకుడని, నోట్లో వేలు పెడితే కొరకలేని భయస్తుడని చెబితే ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు వ్యవహారాలలో ప్రముఖ పారిశ్రామిక సంస్థలపై, పెట్టుబడిదారులపై కేసులు పెట్టుకుంటే వెళితే అది అత్యంత ప్రమాదకరం అవుతుంది. అంతేకాక ప్రత్యేకంగా రెడ్డి సామాజిక వర్గం వారిపై ఒక వైపు సోషల్ మీడియా కేసులు, మరో వైపు రెడ్డి పారిశ్రామికవేత్తలపై వేధింపులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు.ఇవన్ని చూస్తుంటే తమ రాజకీయాలకోసమో, కక్ష సాధింపుల కోసమో ఏపీలో ఆర్థిక విధ్వంసానికి చంద్రబాబు  ప్రభుత్వం వెనుకాడడం లేదన్న అభిప్రాయం కలుగుతుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement