2019 - 2024 మధ్యకాలంలో అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఉద్యోగాలే లేవని, పరిశ్రమలూ స్థాపించలేదని, ఉపాధి కోసం వలస వెళ్లిన వారూ ఎక్కువంటూ నిన్నమొన్నటివరకూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు చేసిన విమర్శలు ఇవే కదా? కానీ ఇవే పార్టీలకూటమితో ఈ ఏడాది ఏర్పడ్డ ప్రభుత్వం ఏపీ శాసన సభకు ఇచ్చిన సమాధానం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఎందుకిలా?
రాష్ట్రంలో కేవలం నాలుగు లక్షల మంది నిరుద్యోగులు మాత్రమే ఉన్నారని, నిరుద్యోగ భృతి ఇచ్చే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని కూడా కూటమి ప్రభుత్వం ఈ మధ్యే లిఖితపూర్వకంగా అసెంబ్లీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నట్లు ఓ వార్తా కథనం వచ్చింది! అంటే.. గత ఐదేళ్లలో నిరుద్యోగం గణనీయంగా తగ్గిందనేగా అర్థం. అంటే.. కూటమి పార్టీలు ఇంతకాలం చేసిన ప్రచారం అసత్యమనేగా? ఇదే విషయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు అంగీకరిస్తారా? అసలు అంగీకరించరు. వెంటనే మాట మార్చేస్తారు.
ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీని నిరుద్యోగం విషయంలో నిత్యం విమర్శించేవన్నది కొత్త విషయం కాదు. పైగా తాము అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు రూ.మూడు వేల భృతి ఇస్తామని కూడా కూటమి నేతలు తమ సూపర్ సిక్స్ ఎన్నికల వాగ్ధానంలో భాగంగా చెప్పారు కూడా. అప్పుడలా అన్నారు... ఇప్పుడెందుకు ఇలా నిరుద్యోగులు నాలుగు లక్షల మందే ఉన్నారు.. భృతి గట్రా ఏమీ లేదంటున్నారు? అని అడిగామనుకోండి.. వెంటనే మీపై ఏదో ఒక కేసు పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగం పరిస్థితి ఏమిటా? అని విచారిస్తే.. కొత్త ఉద్యోగాల మాటెలా ఉన్నా.. ఉన్నవి మాత్రం లక్షల్లో ఊడుతున్నాయి అని తెలుస్తోంది. అయినాసరే.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దబాయించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మందే నిరుద్యోగులున్నారని ప్రభుత్వం ఏ ఆధారంతో సమాధానమిచ్చిందో కానీ అది ఒకరకంగా జగన్ ప్రభుత్వానికి కితాబు ఇచ్చినట్లు అవుతుంది. జగన్ ప్రభుత్వం టైమ్ లో పరిశ్రమలే లేవని, డీఎస్సీ వేయలేదని, ఉద్యోగాలే రాలేదని, వలసలు అధికమని అప్పుడు చెప్పారు. మరి వీటిలో ఏది నమ్మాలి? అన్న సందేహం వచ్చినా తీరదు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే జగన్ ప్రభుత్వం బాగా పనిచేసిందన్న భావన కలుగుతుంది.
జగన్ టైమ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు అనేక రూపాలుగా వచ్చాయి. ఒక్క ఆరోగ్య శాఖలోనే సుమారు ఏభై వేల ఉద్యోగాలు కల్పించారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ప్రైవేటు రంగంలో పలు పరిశ్రమలు తేవడం ద్వారా, చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీల బకాయిలు చెల్లించడం ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించగలిగారు.
చంద్రబాబు టైమ్‌లో 2014-2019 మధ్య ఆయా రంగాలలో ఎనిమిది లక్షల మంది ఉపాధి పొందితే, 2019-2024 మధ్య 32 లక్షల మందికి ఉపాధ కల్పించగలిగారని లెక్కలు చెబుతున్నాయి. ఒకేసారి గ్రామ, పట్టణ వార్డు సచివాలయాల ద్వారా సుమారు లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా జగన్ ఒక రికార్డు సృష్టించారు. వీరు కాకుండా వలంటీర్ల రూపంలో రెండున్నర లక్షల మందికి అవకాశం కల్పించారు. వారికి నెలకు రూ.ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చారు. ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించడంతో ఆ షాపులలో 15 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. టీచర్ల ఉద్యోగాలకు డీఎస్సీ ప్రకటించినా, ఎన్నికల కోడ్ రావడంతో అది పూర్తి కాలేదు.
ఇన్ని జరిగినా, రాష్ట్రంలో అసలు ఏమీ జరగనట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వారికి తోడుగా పచ్చి అబద్దాలను జనంపై రుద్దాయి. ఇప్పుడు మాత్రం ఏపీలో నాలుగు లక్షల మందే నిరుద్యోగులు ఉన్నారని లెక్కలు చెబుతున్నారట. ఇది కేవలం నిరుద్యోగ భృతి ఎగవేత కోసమే అన్న అనుమానం వస్తోంది. కూటమి ప్రకటనల ప్రకారం కనీసం ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటికే ఉన్నారు. వారికి భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కాని దానికి ప్రస్తుతానికి మంగళం పలికారు. ఇది నిరుద్యోగులను మోసం చేసినట్లే కదా అన్నది వైఎస్సార్‌సీపీ విమర్శ.
కూటమి ప్రభుత్వం రాగానే, ఉన్న వలంటీర్ల ఉద్యోగాలు ఊడాయి. జూన్ నుంచి వారికి గౌరవ వేతనాలూ ఇవ్వలేదు. అదేమిటి అని అడిగితే అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని మంత్రులు నిస్సిగ్గుగా ప్రశ్నిస్తున్నారు. గత ఉగాది నాడు చంద్రబాబు స్వయంగా వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పైగా వారికి నెలకు రూ.పది వేల చొప్పున ఇస్తామని పూజలు చేసి మరీ చెప్పారు. అది నిజం కాదా! ఆ విషయాన్ని చంద్రబాబు ఇప్పుడు ప్రస్తావిస్తే ఒట్టు. పవన్ కళ్యాణ్ కూడా తాము వలంటీర్ల కడుపు కొట్టబోమని, ప్రచారం చేశారు.
ఇప్పుడు మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు పాలకొల్లులో ప్రతి ఇంటికి వెళ్లి వలంటీర్‌కూ పారితోషికం పెంపు ఖాయమని, వైఎస్సార్‌సీపీని నమ్మవద్దని, అధికారం రాగానే తాము పెంచి తీరతామని, అప్పుడు తనకు స్వీట్ బాక్స్ లు తెచ్చి ఇవ్వాలని వలంటీర్లను కోరారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. వీరందరికి మంచి, మంచి పదవులు వచ్చాయి. నిమ్మల కూడా మంత్రి అయ్యారు. స్వీట్ బాక్స్ లు కూడా కొదవలేకుండానే వచ్చాయి. ఇక వలంటీర్ల స్వీట్ బాక్స్ లతో వీరికి పనేముంది. వలంటీర్లకు ఉన్న ఉద్యోగాలను ఊడపీకేశారు. వారి జీవితాలు చేదుగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా చోట్ల వలంటీర్లు నిరసనలు చెబుతున్నారు. ప్రభుత్వ మద్యం షాపులు ఎత్తేయడంతో 15 వేల మంది రోడ్డున పడ్డారు.
జనవరికల్లా టీచర్ల నియామకాలు చేస్తారని అనుకుంటే అది వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మరో వైపు పుండు మీద కారం చల్లినట్లు జగన్ ప్రభుత్వం బటన్ నొక్కిన డబ్బులతో జనం మందు, గంజాయికి అలవాటు పడ్డారని స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. మహిళలను కూడా అవమానించడానికి వీరు వెనుకాడలేదు. దీనిని బట్టి కూటమి నేతల వైఖరి ఏమిటో అర్థం అవుతుంది. జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల కన్నా...మూడు రెట్లు అధికంగా అమలు చేసి డబ్బులు పంచుతామని ఎన్నికల ముందు చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే వారి అసలు స్వరూపం ఇదన్నమాట అని ప్రజలు విస్తుపోతున్నారు.
ఇక మంత్రి లోకేష్ గత జగన్ పాలనలో అసలు పరిశ్రమలే రానట్లు, పారిశ్రామిక వేత్తలు ఎవరితోనూ మాట్లాడనట్లు వ్యాఖ్యలు చేయడం బాగోలేదు. చిన్న వయసులో వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిజాలు చెప్పవలసిన లోకేష్ ,తండ్రి మాదిరి అబద్దాలు ఆడతారన్న విమర్శలకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారో అర్థం కాదు. లోకేష్ ప్రకటనకు బదులుగా మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్ తమ పాలన టైమ్ లో వచ్చిన పరిశ్రమలకు సంబంధించి పెద్ద జాబితానే చదివారు.
అదానీ కంపెనీలు పెద్ద ఎత్తున వస్తుంటే, ఏపీని అదానీకి రాసిచ్చేశారని ఎల్లో మీడియా దుర్మార్గపు ప్రచారం చేసింది. ఇప్పుడు అదే అదానీ గ్రూపు పెద్దలు చంద్రబాబును కలిస్తే భారీ పెట్టుబడులు వస్తున్నాయని ఇదే మీడియా చెబుతోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎన్ని మాటలు చెప్పారు? ఇప్పుడు ఏమి చెబుతున్నారు?పైగా లోకేష్ దీని గురించి మాట్లాడకుండా రూ.1.5 లక్షల కోట్లతో అనకాపల్లి వద్ద కొత్త స్టీల్ ప్లాంట్ రాబోతోందంటున్నారు. నిజంగా వస్తే మంచిదే. కాని దానిని నమ్మేదెలా!ఇది జనాన్ని మాయ చేయడానికే అన్న భావన ఏర్పడింది. విశాఖ స్టీల్ లో అనేక మంది ఉద్యోగాలు ఏమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆరు నెలల్లో ఇన్నిలక్షల మంది ఉపాధి కోల్పోవడం కూడా ఒక చరిత్రే అవుతుందేమో! చంద్రబాబు 1995-2004 మద్యలో సంస్కరణల పేరుతో ఏభైకి పైగా కార్పొరేషన్ లను మూసివేశారు. దాని వల్ల వేలాది మంది నిరుద్యోగులు అయ్యారు. ఇప్పుడు అదే తీరులో ఉన్న ఉద్యోగాలు పీకేయడానికి వెనుకాడడం లేదు. ఎన్నికల ముందు కనుక తమ విధానం ఇది అని, వలంటీర్లను తీసివేస్తామని, మద్యం షాపులు ఎత్తివేసి ఆ ఉద్యోగాలను పీకేస్తామని చెప్పి ఉంటే తప్పు లేదు. అలా కాకుండా అడగని వరాలు సైతం ఇస్తామని హోరెత్తించి, ఇప్పుడు విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరు కూటమి ప్రభుత్వానికి మంచిదేనా? ఉగాది పండగ నాడు పవిత్రంగా పూజలు చేసి ఇచ్చిన వాగ్దానానికే దిక్కు లేకపోతే ప్రజలు ఏమని అనుకోవాలి? సనాతన ధర్మం అంటూ ప్రచారం చేసిన వీరికి అసలు నిజంగా మతంపై విశ్వాసం ఉన్నట్లా? లేనట్లా?
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment