''ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై క్లియర్ పిక్చర్ లేదు’’... నలభై ఏళ్ల రాజకీయ అనుభవం నాదని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చూస్తే చాలా అమాయకుడని అనిపించవచ్చు. కానీ.. మాటల మార్చడంలో, ప్రగల్భాలు పలకడంలో, యూటర్న్ తీసుకోవడంలో ఈయన్ను మించిన వారు ఇంకొకరు ఉండరంటే అతిశయోక్తి కానే కాదు. బహుశా దేశం మొత్తమ్మీద ఇంకొకరు లేరనడానికి ఇది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బాబు వ్యాఖ్య ఒక నిదర్శనమనే చెప్పవచ్చు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ గురించి మీడియాతో మాట్లాడుతూ వారు ఏ ప్రశ్న అడిగినా అది సాధ్యం కాదన్న సమాధానం వచ్చేలా చెప్పారు. కేంద్రం ప్యాకేజీ ఇవ్వొచ్చుకదా అంటే ''అవును ఇవ్వొచ్చుగానీ అంతటితో అయిపోదు కదా, గనుల్లేవు అని ముక్తాయిస్తారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయొచ్చుకదా అంటే ''అలా చేయవచ్చుగానీ, అందుకు వారు అంగీకరించాలి. ఆర్థిక సమస్యలు ఉంటాయి'' అంటూ జవాబా ఇస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవటీకరణ కాకుండా నిలబెడతామన్నారు కదా అని ప్రశ్నిస్తే ''ప్రతిపక్షంలో ఉనప్పుడు మాకు క్లియర్ పిక్చర్ లేదు'' కదా అని నిస్సిగ్గుగా బదులిస్తారు.
వీటన్నిటి సారాంశం ఒకటే..స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అపలేమని చెప్పడమే. ఇక్కడే ఆయన తన తెలివితేటలన్నీ ఉపయోగిస్తుంటారు. ఇంకో అనుమానం కూడా వస్తోంది. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నదని, పది వేల మందికి ఉపాధి వస్తుందని తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి బ్యానర్ కథనాలు వండివార్చాయి. ఇందులో లోకేష్‌ను పైకెత్తడం ఒక పాయింట్ అయితే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జనంలో ఉన్న ఆందోళనను డైవర్ట్ చేయడం కూడా మరో అంశం అనిపిస్తోంది. నిజానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇన్ఫోసిస్, టీసీఎస్ మొదలైన సంస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను జగన్ స్వయంగా ఆరంభించారు. బీచ్ ఐటీ పేరుతో విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మార్చాలని జగన్ ప్రయత్నిస్తే ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతివంటివి ఎల్లో మీడియా రకరకాలుగా విమర్శిస్తూ అడ్డుకునేంత పనిచేశాయి. కానీ ఇప్పుడు ఆ సెంటర్ ఏర్పాటుపై పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఆ సెంటర్ వస్తే మంచిదే. కానీ అంతా అయిపోయినట్టు, పదివేల మందికి ఉపాధి వచ్చేసినట్టు ప్రచారం చేయడమంటే జనాన్ని మభ్యపెట్టడమే.ఇదంతా విశాఖలో స్టీలప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి మీద జనంలో ఉన్న నిరసనను తగ్గించడానికే అని అనుకోవచ్చు.
ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఏమని చెప్పారో గుర్తు చేసుకుందాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దానికోసం ఎందాకైనా వెళ్లి పోరాడతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు శపథాల మీద శపథాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి కొన్ని ప్రత్యామ్నాయాలు సూచిస్తే ఇంకేముంది భూములు కాజేయడానికే అని దుష్ప్రచారం చేశారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసినా జగన్ ప్రైవేటీకరణను ఆపడం లేదని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తేనే దాన్ని నిలబెడతామని గొప్పలకు పోయారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా తామే ఫ్యాక్టరీని నిలబెట్టామని చెప్పుకున్నారు. విశాఖ ఉక్కు రక్షణకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అన్ని పార్టీల వారిని ఢిల్లీ తీసుకువెళతామని చంద్రబాబు, పవన్ లు తమ ప్రసంగాల్లో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిద్దరూ చేతులెత్తేయడం, నాలుక మడతేయడం చేస్తున్నారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుకాదు.. కాదన్నట్లు పరిస్థితి ఏర్పడుతున్నా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిమ్మకు నీరెత్తితనట్లు వ్యవహరిస్తున్నది. ఎన్నికల ముందే తాము ప్రైవేటీకరణకు అనుకూలం అని చెప్పి ఉంటే, ఇప్పుడు తప్పు పట్టజాలం. అలా కాకుండా, జనాన్ని మభ్య పెట్టడానికి అప్పుడు కబుర్లు చెప్పి, ఇప్పుడు నాలుక మడతేయడం అంటే ఆంధ్రులను అవమానించడమే. ప్రధాని నరేంద్ర మోదీ తన జేబులో ఉన్నట్టు మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.
ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. కొద్ది రోజులక్రితం తెలుగుదేశం మీడియా ఈనాడులో విశాఖ స్టీల్‌ను విలీనం చేసుకోవడానికి సెయిల్ అంగీకరించింది అంటూ ఒక పెద్ద కథనాన్ని ఇచ్చారు. అంటే అప్పుడు కార్మికులను మభ్యపెట్టడం కోసం రాశారన్నమాట. అసలు వాస్తవం ఏంటంటే సెయిల్ లో విలీనం అంత తేలిక కాదు అని చంద్రబాబే చెబుతున్నారు. జనసేన నేతలైతే కార్మిక సంఘాల వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే పరిస్థితి వచ్చిందని ఎదురు దాడి కూడా చేస్తున్నారు.
చంద్రబాబు స్టీల్ ప్లాంట్ అంశంపై నంగినంగిగా మాట్లాడినప్పుడు ఎవరికైనా అనుమానం వచ్చింది. స్టీల్ ప్లాంట్ ను కేంద్రం విక్రయించడానికి సిద్ధమైందని, దానికి ఆయన ఓకే చేశారనిపిస్తోంది. అందుకే ఇప్పుడు అఖిలపక్షం వేస్తే ప్రయోజనం ఏముంటుంది? రాజకీయ విమర్శలు తప్ప అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు క్లియర్ పికచ్చర్ లేదని బుకాయిస్తున్నారు. తానే విశాఖ స్టీల్ ను కాపాడానని ప్రచారం చేసుకుంటూ ఇంకో వైపు క్లియర్ పిక్చర్ లేదని చంద్రబాబు చెబుతుండడం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును, ఆయనే ప్రైవేట్ వారికి అమ్మేస్తున్నట్టుగా అనుకోవాలన్న మాట.
పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబకు స్టీల్ ప్లాంట్ గురించి తెలియదంటే ఆయన విజన్ ఏమైనట్టు? ఆయన చేసిన వాగ్ధానాలు ఏమైనట్టు? ఎన్నికలకు ముందు కార్మికుల ఆందోళనలో భాగస్వామ్యమై వారిని నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇప్పుడు నట్టేట ముంచుతున్నారని అనుకోవాలి. కేంద్రంలోను, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీరు పూర్తిగా యూటర్న్ తీసుకోవడమంటే విశాఖ ప్రజలనే కాకుండా ఆంధ్ర ప్రజలందరినీ పచ్చిగా మోసం చేసినట్టు అవుతుంది కదా.
విశాఖ ఉక్కు ప్లాంట్ కోసం వేలాది మంది రైతులు తమ భూములను ఇచ్చారు. స్లీల్ ప్లాంట్ వచ్చాక విశాఖలో పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. అది ప్రభుత్వపరంగా ఉండడంతో ఉద్యోగులకు ప్రయోజనాలు చేకూరాయి. ఆ ప్లాంట్‌కు ఇప్పటికైనా ఐరన్ ఓర్ గనిని కేటాయించి, ఒక ప్యాకేజీ ఇస్తే అది నిలబడుతుందని, కానీ కావాలనే ఈ ప్లాంట్‌ను నష్టాల పాలు చేస్తున్నారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. వివిధ హామీల విషయంలో జనాన్ని మాయ చేసినట్లుగానే, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మరోసారి మాట తప్పుతున్నారు. తద్వారా రాష్ట్రానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమే తీరని ద్రోహం చేస్తోందన్న అభిప్రాయానికి అవకాశం ఇస్తున్నారు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment