
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ఏమన్నారు? ‘‘ప్రజలు గమనిస్తున్నారు.. జాగ్రత్త’’ అని! ప్రజలు మాత్రం కూటమి ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న అరాచకాలతోపాటు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని చంద్రబాబు వైఖరిని కూడా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కఠినమైన చట్టాల కింద తప్పుడు నేరాలు మోపడం మొదలుకొని రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసుల వేధింపులు, కూటమి నేతల జోలికి అస్సలు వెళ్లని వైనం.. అక్రమార్కులకు రక్షణ కల్పిస్తూండటం వంటి వన్నీ ప్రజల దృష్టిని మీరి పోలేదు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా జమ్మలమడుగుల్లో కూటమి నేతలు సృష్టించిన రభస ఇంకో ప్రత్యక్ష నిదర్శనం.
వైఎస్ జగన్ పాలనలో చీమ చిటుక్కుమన్నా భూతద్దంలో చూపిస్తూ అభూత కల్పనలు ప్రచారం చేసిన ఎల్లో మీడియా, కూటమి నేతల ఆగడాల విషయానికి వచ్చేసరికి.. వీలైనంత కప్పిపెట్టేందుకే ప్రయత్నిస్తోంది. అక్కడితో ఆగకుండా చంద్రబాబు పేరు వాడుకుంటూ ఆయన ఆగ్రహం చెందారన్న లీకులిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇవి. రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడే ఫ్లైయాష్ రవాణాకు సంబంధించి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తండ్రి, మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకరరెడ్డిల మధ్య వివాదం ఏర్పడింది.

సిమెంట్ కంపెనీలు వాడే ఆ బూడిదను రవాణా చేసే వ్యాపారం ఎవరిదన్న అంశంపై గొడవ. ప్లాంట్‌లో రోజూ ఉత్పత్తి అయ్యే నాలుగువేల టన్నుల ఫ్లైయాష్ రవాణా తమకే ఉండాలని ఇద్దరు నాయకులు బహిరంగంగానే బాహాబాహీకి దిగాయి. ఆదినారాయణరెడ్డి వర్గం తమ వాహనాలను అడ్డుకుంటోందని, దాన్ని సహించేది లేదని జేసీ ప్రభాకరరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై కడప ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. అవసరమైతే తానే రంగంలో దిగుతానని కూడా ఆయన బెదిరించారు. మరోవైపు థర్మల్ ప్లాంట్ తమ నియోజకవర్గంలో ఉన్నందున ఫ్లైయాష్ రవాణా తమ కనుసన్నలలోనే జరగాలని, ఆ వ్యాపారం తనవారికే దక్కాలన్నది ఆదినారాయణ రెడ్డి పట్టుదల.
ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావడంంతోనే ఈ వివాదం మొదలైంది. ఇందులో పవర్ ప్లాంట్ అధికారుల పాత్ర ఏమిటో తెలియదు. ఇద్దరు నేతల మధ్య సతమతమవుతున్నారు. ఇరువర్గాలను బుజ్జగించడానికి పోలీసు అధికారులు కూడా నానా తంటాలూ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీకు వార్తలు ఎల్లోమీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ నేతలకు చంద్రబాబు అంటే నిజంగానే భయం ఉంటే.. బహిరంగంగా రచ్చ చేస్తారా? అన్నది అసలు ప్రశ్న.
నిజానికి దౌర్జన్యం చేసేవారు ఎవరైనా సరే.. వారిపై పోలీసులు కేసులు పెట్టాలి. శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాలి. కానీ.. కేవలం నిషేధాజ్ఞలు విధించి.. పోలీసు బలగాలను మోహరించి.. ఇరువురు నేతలు ఎప్పుడు రాజీపడతారా? అన్నట్టుగా పోలీసులు ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. గొడవలకు కారణమైన వారిపై మాత్రం కేసులు పెట్టడం లేదు. ఫ్లైయాష్ రవాణా వ్యాపారాన్ని చెరిసగం పంచుకోవాలని కొందరు సూచిస్తున్నట్లు సమాచారం.
శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు రావని ఒకపక్క సుద్దులు చెబుతూ ఇంకోపక్క వర్గపోరుకు దిగుతున్న నేతలపై కేసులూ పెట్టకపోవడం కూటమి ప్రభుత్వపు ద్వంద్వవైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఫ్లైయాష్ రవాణాలో కోట్ల రూపాయల సంపాదన కోసమే నేతలు దీనిపై ఇంత రాద్ధాంతం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. కూటమి ప్రభుత్వం పోలీసులను కేవలం ప్రతిపక్షాలను అణచివేసేందుకు మినహా ఇలాంటి ముఠాల నియంత్రణకు మాత్రం ఉపయోగించడం లేదు. గతంలో ఇదే జమ్మలమడుగు ప్రాంతంలో మరో గొడవ జరిగింది. అదానీ కంపెనీ ఇక్కడ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ నిర్మిస్తోంది.

ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ సంస్థ దక్కించుకుంది. అయితే తమకు వాటా ఇవ్వలేదన్న కోపంతో ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందిన వారు అదానీ సంస్థ సిబ్బందిపై దాడికి దిగారు. సి.ఎం. రమేశ్ వర్గం దీనిపై ఈనాడు మీడియాలో ఒక వార్త రాయించింది. దీన్నిబట్టే అక్కడ పరిస్థితులు ఏమిటన్నది అర్థమవుతాయి. ఇద్దరూ బీజేపీ వారే అయినా.. ఎవరి గ్రూపు వారిదే అన్నమాట. తాజాగా ఆదినారాయణ వర్గం జేసీ ప్రభాకరరెడ్డి తో గొడవకు దిగింది.
ఈ నేపథ్యంలో తాను అదానీలా ఊరుకోబనని హెచ్చరించడం ఎస్పీకి రాసిన లేఖలోనూ లోడింగ్‌కు పంపుతున్న తన లారీలను అడ్డుకోండి చూద్దామంటూ సవాలు కూడా విసిరారు. ఎస్పీకే ధైర్యంగా తాను హింసకు దిగుతానని పరోక్షంగా హెచ్చరించారంటే జేసీ ఎంతకు తెగించారో... చంద్రబాబుపై వీరికి ఎంతమాత్రం భయం ఉందో అర్థం కావడం లేదా? ఈ ఘటనలో ఎస్పీ ఏమైనా ఇరు వర్గాలను పిలిచి చర్చించడం కానీ.. శాంతి భద్రతల పరిరక్షణ కసం వార్నింగ్ ఇవ్వడం కానీ చేయకపోవడం ఇంకో విశేషం. పైగా వీరి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు సాగాయి.
ఈ పద్దతి అనుసరించడం చంద్రబాబుకు కొత్తకాదు.గతంలో జమ్మలమడుగు లో ఆదినారాయణ రెడ్డి వర్గం, ఆయన ప్రత్యర్ధి వర్గం కాంట్రాక్టు పనులను ఎలా పంచుకోవాలో చెబుతూ ఆనాటి జిల్లా కలెక్టర్‌తోనే పంచాయితీ చేయించిన చరిత్ర ఉంది. ఆది నారాయణ రెడ్డి, జేసీల మధ్య ప్రస్తుతానికి రాజీ కుదరకపోవడంతో ప్రభాకరరెడ్డికి చెందిన ఆరు లారీలను పోలీసులు అడ్డుకున్నారట. జేసీ స్వయంగా అక్కడకు రాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారట. ఇలా ఉంది ఏపీలో పోలీసుల దయనీయ పరిస్థతి.

చట్టం ప్రకారం అయితే ఏమి చేయాలో పోలీసులకు తెలియదా! ఇప్పుడు జేసీ లారీలను అనుమతించాలంటే, ఎల్.అండ్ టి సిమెంట్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ సరఫరాకు సంబంధించిన బకాయిలతో పాటు, యాభై శాతం వాటా ఇవ్వాలని ఆది వర్గం డిమాండ్ చేస్తోందట. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ తాడిపత్రిలో ఉంది. అక్కడ పెత్తనం అంతా జేసీదే. కావడంతో ఆది వర్గం మండిపడుతోంది. ఆది నారాయణరెడ్డి వర్గీయులు జమ్మలమడుగులో జేసీ వర్గీయుల వాహనాలను అడ్డుకుంటే, తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి వర్గం లారీలను తిరగనివ్వబోమని చెబుతున్నారు. ఈ రకంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు సామంత రాజులుగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నాయి.
2014-19 టరమ్ లో వైఎస్సార్‌సీపీ పక్షాన ఎన్నికై, ఆ తర్వాత టీడీపీలో చేరి కొంతకాలం మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి 2019లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. ఈసారి ఆ పార్టీ పక్షాన పోటీచేసి గెలుపొందారు. ఈ కారణంగానే ఆది నారాయణ రెడ్డిని పిరికివాడని కూడా జేసీ ధ్వజమెత్తారు. ఓడిపోగానే టీడీపీ నుంచి బీజేపీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. అలాగే ఒకప్పుడు వీర కాంగ్రెస్ నేతలుగా ఉన్న జేసీ సోదరులు తదనంతర పరిణామాలలో టీడీపీలో చేరారు.
జేసీ ప్రభాకరరెడ్డి 2014లో తాడిపత్రి నుంచి టీడీపీ పక్షాన విజయం సాధించారు. 2019లో ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలలో ప్రభాకరరెడ్డి గెలిచి మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. 2024లో అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అస్మిత్ రెడ్డి పేరుకే ఎమ్మెల్యే. రాజకీయం, పెత్తనం మొత్తం ప్రభాకరరెడ్డిదే.
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిలోకి రానివ్వకుండా పోలీసులను ప్రయోగించగలుగుతున్నారు. ఇసుక గొడవలో అస్మిత్ రెడ్డి ఒక పోలీసు అధికారిని దూషించిన ఘటన కలకలం రేపింది. తాడిపత్రిలో మద్యం షాపులు పొందినవారు కచ్చితంగా తమకు ఇరవై శాతం కమిషన్ చెల్లించాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచకాలకు పాల్పడుతుంటే, జమ్మలమడుగు, తాడిపత్రిలలో మాత్రం ఆది, జేసీలు సొంత రాజ్యాంగం అమలు చేస్తామని ప్రజలను భయపెడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత సమర్థంగా..
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment