
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తక్కువోడు కాదు.. ప్రత్యర్దులను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల కోసం ప్రకటించిన తీరును గమనిస్తే ఆయనలో సాహసి కనిపిస్తారు. దాదాపు కొత్త స్కీములు లేకుండా, ఉన్నవాటిని యధాతధంగా కొనసాగిస్తూ తన నిజాయితిని రుజువు చేసుకున్నారు. ఒక టీచర్ మాదిరి తన గత మేనిఫెస్టోని,కొత్త మేనిఫెస్టోని చూపుతూ చేసిన స్పీచ్ ఆసక్తికరంగా ఉంది.
జగన్ మేనిఫెస్టో తర్వాత చంద్రబాబు మరింత ఆత్మరక్షణలో పడతారు. తాను ఇచ్చిన సూపర్ సిక్స్‌ను ప్రజలు నమ్మరన్న సంగతి ఆయనకు అర్ధం అవుతుంది. అందుకోసం చంద్రబాబు కొత్త అబద్దాలను చెబుతారేమో చూడాలి. జగన్ మేనిఫెస్టో తీరు చూస్తే, 2009లో ఈయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేనిఫెస్టోని ప్రకటించిన సందర్భం గుర్తుకు వస్తుంది.
అప్పటికి ఐదేళ్లు పాలన పూర్తి చేసుకున్న వైఎస్ ఆర్ తాను కొత్త హామీలను ఏమీ ఇవ్వబోనని ప్రకటించారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ మరో రెండు గంటలు అదనంగా ఇవ్వడం వంటి ఒకటి రెండు హామీలు మినహాయించి కొత్తవి లేకుండా వైఎస్ మేనిఫెస్టోని ప్రకటించడం సాహసంగా అప్పట్లో అనుకున్నారు. అప్పుడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా, టీడీపీ మేనిఫెస్టో నిండా వాగ్దానాల వరద పారించారు.

ప్రతి ఇంటికి నేరుగా నగదు బదిలీ చేస్తామని అది ఒక్కొక్కరికి పదిహేనువందల నుంచి ఉంటుందని చెప్పారు. అదొక్కటే కాదు.. అనేక ప్రజాకర్షక హామీలను గుప్పించారు. అయినా వైఎస్ తొణకలేదు.తాను చేయగలిగినవే చేస్తానని చెప్పారు. దానినే ప్రజలు నమ్మారు.ఆయనను గెలిపించారు. మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాని దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించారు.ఆ తర్వాత 2014లో వైఎస్ కుమారుడు జగన్ సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికలలోకి వచ్చారు. ఆ సమయంలో చాలామంది రైతుల రుణమాఫీ హామీ ఇవ్వాలని ఆయనకు సూచించారు. కాని ఆయన అందుకు ఒప్పుకోలేదు.
ఒకసారి ప్రకటించాక, ప్రభుత్వం వచ్చినా చేయలేకపోతే దెబ్బతింటామని అన్నారు. కాని అదే చంద్రబాబు నాయుడు మాత్రం ఆచరణసాధ్యం కాదని తెలిసినా లక్ష కోట్ల రూపాయల రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని,బ్యాంకులలో తాకట్టులో ఉన్న బంగారు నగలను విడిపిస్తామని హామీ ఇచ్చారు. అదే కాకుండా కొన్ని వందల హామీలను మేనిఫెస్టోలో పెట్టారు. అప్పటి పరిస్థితులలో టీడీపీ కూటమిని గెలిపించారు. ఆ తర్వాత చంద్రబాబు సినిమా చూపించడం ఆరంభించారు.
రుణమాఫీ అని ఆశపడ్డవారికి చుక్కలు చూపించారు. రకరకాల విన్యాసాలు చేశారు. పైగా రైతులను ఆశపోతులని తూలనాడారు. కాపు రిజర్వేషన్ తదితర అనేక అంశాలలో అదే పరిస్థితి. సుమారు 400 వాగ్దానాలు చేసి చేతులెత్తేశారు. ఆ విషయం ప్రజలకు బాగా అర్దం అయింది. 2019 లో మళ్లీ జగన్ ,చంద్రబాబుల మధ్యే పోటీ సాగింది.ప్రజలంతా చంద్రబాబు తమను మోసం చేశారని భావించి జగన్ వైపు వచ్చి భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ తర్వాత ఆయన తన మేనిఫెస్టోని ఎప్పుడూ లేని విధంగా సచివాలయంలో పెట్టి హామీల అమలుకు శ్రీకారం చుట్టారు.అలాగే ప్రతి ఏటా తన హామీల పరిస్థితిని ప్రజలకు వివరించారు.
దాంతో ప్రజలకు ఆయనపై ఒక నమ్మకం ఏర్పడింది. 99 శాతం పైగా హామీలు నెరవేర్చి మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.దీనిని ఎవరూ కాదనలేని పరిస్థితి. పైగా జగన్ అమలు చేసిన స్కీములను తాము చేస్తామని అంత పెద్ద సీనియర్ చంద్రబాబు నాయుడు చెప్పే పరిస్థితిని జగన్ కల్పించారు.అదే జగన్ కు పెద్ద విజయం గా భావించాలి. ప్రత్యర్ధి తనను అనుసరిస్తున్నాడంటే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లుగా చంద్రబాబు తీసుకునే యుటర్న్ లు జగన్ కు పెద్ద ప్లస్ పాయింట్లు అయ్యాయి. జగన్ వలంటీర్ల వ్యవస్తను పెట్టినప్పుడు ,ఆయా స్కీములు అమలు చేస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు చెప్పిన పిచ్చి సలహాలు నమ్మి ఏపీ శ్రీలంక అయిపోతుందని, నాశనం అవుతోందని చంద్రబాబు ప్రచారం చేశారు.
తీరా ఎన్నికల సమయానికి జగన్ స్కీములను, తెలంగాణలో,కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కలిపి సూపర్ సిక్స్ అంటూ ఒక పత్రం తయారు చేసుకుని ప్రజల ముందుకు వచ్చారు. అది చూసి జనం అంతా ఆశ్చర్యపోయారు. జగన్ అమలు చేస్తే నాశనం అన్నారు. అంతకు మించిన వాగ్దానాలు చంద్రబాబు ఎలా ఇస్తారని విస్తుపోయారు.దాంతో చంద్రబాబు క్రెడిబిలిటి పోయింది. ఆయనను సమర్ధించుదామని అనుకున్నవారికి వాదన లేకుండా చేశారు.
ఆ విషయాన్ని జగన్ ఇప్పుడు చాలా బాగా వాడుకుని తాను చేయలేనివి చెప్పనని, చంద్రబాబులా మోసం చేయబోనని ప్రజలకు పరిస్థితి విడమరిచి చెప్పారు. కేవలం వృద్దాప్య పెన్షన్ ను మరో ఐదు వందల రూపాయలు అది కూడా వచ్చే టరమ్ చివరి రెండేళ్లు పెంచుతానని,ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ల ఏర్పాటు చేస్తానని, అమ్మ ఒడి కింద ఇచ్చే మొత్తాన్ని పదిహేనువేల నుంచి పదిహేడువేలు చేస్తామని జగన్ తాజా మేనిఫెస్టోలో తెలిపారు.అలాగే రైతు భరోసాను పదహారువేలు చేస్తామని తెలిపారు.
ఆయా స్కీములను కొనసాగిస్తూ కొద్దిపాటి మార్పులు మాత్రం జగన్ ప్రతిపాదించారు. తాను అమలు చేస్తున్న స్కీములు, ఇవి కాకుండా తప్పనిసరిగా అమలు చేయవలసిన కార్యక్రమాలకు కలిపి డెబ్బైవే కోట్ల వ్యయం అవుతుందని, కాని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన స్కీములకు, ఎవరు ఉన్నా అమలు చేయవలసిన కార్యక్రమాలకు కలిపి లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందని లెక్కలుగట్టి చెప్పారు. చంద్రబాబు మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తున్నారన్న విషయం అర్ధం అయ్యేలా జగన్ విడమరిచి చెప్పారు. చంద్రబాబు తాను సంపద సృష్టిస్తానని బొంకుతారని అంటూ ఆయన అధికారంలో ఉన్న పద్నాలుగేళ్లలో రాష్ట్రం ఎప్పుడూ రెవెన్యూ లోటులోనే ఉన్న విషయాన్ని బడ్జెట్ పుస్తకాల ఆధారంగా చెప్పారు.
చంద్రబాబు దృష్టిలో సంపద అంటే రాజధాని గ్రామాలలో తనవారికి రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే బ్లాక్ మనీనే అనుకోవాలి. అందులో కూడా వారికి పన్ను రాయితీలు ఇప్పించారు. అంతే తప్ప మిగిలిన రాష్ట్రం అంతటిని గాలికి వదలివేశారు. పైగా రాష్ట్ర ప్రజలందరు పన్నులు రూపంలో కట్టిన డబ్బును రాజధాని గ్రామాలలో మాత్రమే వ్యయపరచడానికి సిద్దం అయ్యారు.దాంతో ప్రజలకు మండి ఆయనను ఘోరంగా ఓడించారు. అయినా ఇప్పుడు మళ్లీ అమరావతి అని చంద్రబాబు అంటున్నారు.కాని జగన్ మాత్రం చాలా ధైర్యంగా విశాఖ నుంచి పాలన చేస్తామని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని, కర్నూలు న్యాయ రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు. విశాఖను రాష్ట్రానికి ఉపయోగపడే గ్రోత్ ఇంజన్ గా మార్చాలన్నది జగన్ సంకల్పం అయితే, ఏపీ ప్రజలందరి సొమ్ము అమరావతి గ్రామాలలో ఖర్చు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన.
గతసారి ప్రజలు చంద్రబాబు ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక అప్పుల విషయంలో కూడా తన ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న తేడాను గణాంకాలతో సహా జగన్ వివరించారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్,మోడీలు కలిసి 2014లో ఇచ్చిన హామీల పత్రం జగన్ కు ఆయుధంగా మారింది. అందులో పేర్కొన్న ఏ ఒక్కటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేయయలేకపోయారు. తాను అలా చేయబోనని, చేయగలిగే వాటినే హామీలు గా ఇస్తానని జగన్ అంటూ చంద్రబాబు సూపర్ సిక్స్ వంటి అసాధ్యమైన హామీలతో పోటీ పడలేదు. చంద్రబాబు చెప్పే అబద్దాలతో తాను పోటీ పడబోనని కూడా జగన్ ప్రకటించారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ఒక ఉపాద్యాయుడు మాదిరి పలు అంశాలను వివరించిన తీరు ఆసక్తికరంగా ఉందని చెప్పాలి.
ఆయా వర్గాలకు చేయదలచిన కార్యక్రమాలను వివరించడం, పరిశ్రమల పరంగా ,ప్రాజెక్టుల పరంగా ఏమి చేయదలించింది చెప్పే యత్నం చేశారు. సిద్దం సభల మాదిరే మేనిఫెస్టో విడుదల కు కూడా ఆయన పూర్తిగా సిద్దం అయి ప్రజలను కూడా మానసికంగా సిద్దం చేయడానికి వీలుగా ప్రసంగించారు. చంద్రబాబు కూటమి ఇచ్చే హామీలను నమ్మవద్దని, గతంలో మాదిరే మళ్లీ చంద్రబాబు మోసం చేయడం కోసమే అలాంటి హామీలను ఇస్తున్నారని సోదాహరణంగా జగన్ వివరించారు. జగన్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడే పరిస్థితి ఏర్పడింది.
తాను చెబుతున్న వాగ్దానాలకు అయ్యే ఖర్చు చెప్పలేరు. చెబితే ఆయనను నమ్మే పరిస్థితి ఉండదు. ఆ రకంగా చంద్రబాబు సూపర్ సిక్స్ కు జగన్ బ్రేక్ వేసినట్లయిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కు పెద్దగా పోయేది లేదు..వచ్చేది లేదు ..ఆయన పోటీచేసే స్థానాలు కూడా పట్టుమని పది లేవు.అందువల్ల ఆయన చంద్రబాబు చెప్పేవాటికి భజన చేయడం తప్ప సొంతంగా ఆలోచించవలసిన అవసరం లేదు. బిజెపి వారు ఇప్పటికే తాము ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెబుతున్నారు.దానిపై చంద్రబాబు ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయారు. బిజెపితో ఎందుకు కలిసింది?దానివల్ల ప్రత్యేక హోదా తెస్తారా?లేక విభజన హామీలన్నిటిని తీర్చగలుగుతారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా? మొదలైనవి ఏమీ లేకుండా చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చినా జనం నమ్మరు.
జగన్ చెప్పినట్లు రాష్ట్ర ఆర్దిక వనరులను లెక్కలోకి తీసుకోకుండా ఏ హామీ పడితే అది ఇచ్చి ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కూటమి ముందుకు వస్తోంది.ఉదాహరణకు వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని,ఆ వ్యవస్థపై పలుమార్లు విషం కక్కిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు దానిని కొనసాగిస్తామని, పైగా వారికి ఐదువేల రూపాయల బదులు పదివేల రూపాయలు ఇస్తామని చెబుతున్నారు.అందుకు ఎంత వ్యయం అవుతుందో వారు లెక్కగట్టకుండా గండం నుంచి బయటపడడానికి హామీ ఇచ్చారు. అందువల్లే దానిని ఆయన మాటలను ఎవరూ విశ్వసించడం లేదు. చంద్రబాబును నమ్మితే జగన్ పద్దతిగా ఇస్తున్న సంక్షేమ పధకాలను కూడా నష్టపోతామన్న భయం ప్రజలలో ఉంది. అందువల్లే జగన్ ధైర్యంగా కొత్త హామీలు ఏవీ ఇవ్వకుండా ప్రజల ముందుకు వచ్చారు. జగన్ చేసిన వాదనకు ఎలా సమాధానం ఇవ్వలో తెలియక చంద్రబాబు జుట్టు పీక్కునే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment