ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని ఒక సామెత. మరొకటి ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది వాగుతారని.. పవన్ సినిమా(కెమెరామెన్ గంగతో రాంబాబు)లోని ఓ డైలాగ్ ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉందనిపిస్తుంది. తన పార్టీ గురించి కాకుండా ,అక్రమ పొత్తులో ఉన్న తెలుగుదేశం కోసం తిరుగుతూ చేస్తున్న విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు ఆయనకే ఎదురుతిరిగాయి. ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిడితే, సినిమాలలో మాదిరి అంతా పడి ఉంటారనుకుని పవన్ కళ్యాణ్ వాడిన ఆరాచక భాషకు కొంతమంది ప్రముఖులు ఇచ్చిన సమాధానం చూసిన తర్వాత అయినా ఆయన మార్పు వస్తుందా?లేదా? అన్నది చెప్పలేం. ప్రత్యేకించి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కూడా కెలికి పవన్ కల్యాణ్ పెద్ద తప్పు చేశారు. తద్వారా కామ్‌గా ఉన్న ముద్రగడను లేపి తన్నించుకున్నట్లయింది.
పవన్ యాత్ర ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు నో ఆన్సర్
ముద్రగడ రాసిన రెండు లేఖల సారాంశం చూశాక నిజంగా కాపు సామాజికవర్గానికి మేలు జరగాలని ఆశించేవారు. , వారి ప్రయోజనాలను కోరుకునేవారు ఎవరూ పవన్‌కు మద్దతు ఇవ్వరన్న అభిప్రాయం కలుగుతుంది. కేవలం అమాయకత్వంతోనో, అజ్ఞానంతోనో, లేక ఏదో భావావేశంతోనో పవన్ కోసం సీఎం. అని నినాదాలు ఇస్తూ తిరిగే కొద్ది మంది తప్ప ఎవరికి ఆయన ప్రసంగాల శైలి నచ్చడం లేదు. సినిమా యాక్టర్ కనుక కాసేపు చూసి వెళ్దామని ఆయన సభలకు వస్తే వస్తుండవచ్చు. కాని సభ పూర్తి అయ్యేసరికి ఇంతకీ పవన్ ఏమి చెప్పారన్న సందేహం వస్తుంది.
ఆయన ఎందుకు యాత్ర చేస్తున్నట్లు అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. తాను ఒక పక్క ఓడిపోతానని చెబుతారు. మరో పక్క ఏదో తన వారాహి ముందు నిలబడి సీఎం...సీఎం అని నినాదాలు చేస్తున్న బాచ్ కోసం ఆ పదవి కావాలని చెప్పాను తప్ప, తనకు ఆ పదవి నిర్వహించే శక్తి లేదని ఒక టీడీపీ పత్రికకు ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత ఈ యాత్ర లక్ష్యమే నీరుకారిపోయింది. అది ఒక అంశం అయితే ముద్రగడ వంటి సీనియర్ నేతను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా తన గొయ్యి తాను తవ్వుకున్నట్లయింది. ముద్రగడ పద్మనాభం ఇప్పటివారు కారు. 1978 లో తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికవడమే కాకుండా మంత్రిగా పనిచేసిన అనుభవ శాలి. ముద్రగడ రాజకీయాలలోకి వచ్చేనాటికి పవన్ కళ్యాణ్ నిక్కర్లు వేసుకుని తిరుగుతుండవచ్చు.అయినా పర్వాలేదు. విషయ పరిజ్ఞానం పెంచుకుని మాట్లాడితే అర్ధం ఉంటుందికాని ఏది పడితే అది మాట్లాడితే ఏమి ప్రయోజనం.
ముద్రగడ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేదు
ముద్రగడ కాపు సామాజికవర్గంలోని పేదరికం పోగొట్టాలన్న లక్ష్యంతో పనిచేశారు. ఆ క్రమంలో పూర్తి ఆశయం నెరవేరకపోయినా, ఆయన చిత్తశుద్దిని ఎవరూ శంకించలేదు. ముద్రగడ దీక్షలు చేసినా, తనను తాను గృహ నిర్భంధం చేసుకున్నా, భారీ సభలు నిర్వహించినా, అదంతా ఆయనకే చెల్లిందన్న భావన కాపు వర్గంలోనే కాకుండా ఇతర వర్గాలలో కూడా నెలకొంది. ఎవరూ ఆయనను వ్యక్తిగతంగా కించపరచలేదు. కాంగ్రెస్ టైమ్లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రగడ తమ డిమాండ్ల కోసం దీక్షకు కూర్చున్నపుడు ఆయనను విరమింపచేయడానికి ప్రత్యేక విమానంలో ఆనాటి మంత్రి రోశయ్యను పంపించారు. అంటే అంతటి ప్రాముఖ్యత ముద్రగడకు ఉందన్నమాట. ముద్రగడ డిమాండ్ మేరకు ఆనాటి ప్రభుత్వం ఒక జిఓ కూడా విడుదల చేసింది.
అది ఆయన పట్టుదల. కారణాంతరాలవల్ల అది కోర్టులలో నిలబడి ఉండకపోవచ్చు. అది వేరే సంగతి. తదుపరి చంద్రబాబు 2014లో తన మానిఫెస్టోలో కాపు రిజర్వేషన్లు పెట్టి, ప్రభుత్వంలోకి వచ్చాక అమలు చేయకపోవడంతో దాని గురించి నిలదీసిన వ్యక్తి ముద్రగడ. ఉద్యమించిన నేత ఆయన. మొత్తం కాపు సమాజాన్ని కదిలించారంటే అతిశయోక్తి కాదు. తన భార్య, తన కుమారుడు, కోడలిని చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు అరాచకంగా దూషించినా, భయపెట్టినా లొంగకుండా నిలబడ్డారు. తనను అదుపులోకి తీసుకుని రాజమండ్రి ఆస్పత్రికి తరలించినా వెన్నుచూపని నేత ఆయన. ఈ ధైర్య లక్షణాలతో పాటు ఆయన అన్ని వర్గాలవారిని ఎంతో గౌరవంగా చూస్తారు. ఆయన మర్యాదలను స్వీకరించడం అంటే అది ఒక అనుభూతే. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఏదో స్వార్దం కోసం ఉద్యమం నడిపారని అనడం సహజంగానే ఆగ్రహం తెప్పిస్తుంది. అందులోను ముద్రగడ అసలు అంగీకరించరు. అందుకే చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ కు లేఖ రాసి ఆయన వాడుతున్న బూతుభాషపై ముద్రగడ నిలదీశారు. వీధి రౌడీలా వ్యవహరించి పరువు తీసుకోవద్దని సలహా ఇచ్చారు.
కాపు సామాజిక వర్గానికి పవన్ ఏ రకంగా ప్రతినిధి?
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో తన కుటుంబానికి ఉన్న స్నేహసంబంధాలను వెల్లడించి, పవన్ ఆరోపణలను తోసిపుచ్చడానికి కూడా ముద్రగడ వెనుకాడకపోవడం విశిష్ట లక్షణం. ఆయన రాసిన మొదటి లేఖమీద పవన్ అభిమానులు కొంతమందికి కోపం వచ్చింది. అంతే..వెంటనే చండాలపు మెస్సేజ్ లు పెట్టి వయసులో కూడా పెద్దవాడని కూడా చూడకుండా ముద్రగడను అవమానించారట. అలాంటివాటిని పవన్ ఖండించి,తన మద్దతుదారులు అలాంటి అసభ్య మెస్సేజ్ లు పెట్టవద్దని సూచించకపోవడం కూడా ఆగ్రహం కలిగిస్తుంది.
ఈ బాధతో ముద్రగడ మరింత కలత చెంది మరోలేఖ రాసి, కాపులకు పవన్ కళ్యాణ్ ఎన్నడైనా ఏమైనా ఇసుమంతైనా సాయం చేశారా అని ప్రశ్నలు సంధించారు. అవి చదివితే కాపు సామాజికవర్గానికి అసలు పవన్ ఎలా ప్రతినిధి అవుతారన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. కేవలం తాను ఆ వర్గం వ్యక్తి కనుక, సినిమా నటుడిగా ప్రజలకు తెలిసిన మనిషి కనుక , ఏమైనా ముఖ్యమంత్రి అవకాశం వస్తుందేమో అని కొంతమంది అభిమానులు ఆశపడ్డారు. కాని వారి ఆశను నిరాశ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ యాత్ర సాగించారు. తొలిరోజు సభలో ఉన్న గాంభీర్యత ఆ తర్వాత కొరవడి ,బూతులు,పిచ్చి ఆరోపణలు, ముఖ్యమంత్రి జగన్ పై దూషణలు, కొన్ని డైలాగులు మినహాయించి అందులో పస లేకుండా పోయింది.
ఎజెండా ఏమిటో తెలీదు.. సవాల్‌కు సమాధానం లేదు
తన పార్టీ ఎజెండా ఏమిటో ఆయన చెప్పలేకపోతున్నారు. టీడీపీని సమర్దించడానికే తిరుగుతున్నట్లుగా వారి స్క్రిప్టులోని విషయాలనే ఈయన కూడా ప్రస్తావించడాన్ని అంతా గమనిస్తున్నారు. పైగా కాపు నేతలతోనే గొడవకు దిగడం. ముద్రగడ నిర్దిష్టంగా కొన్ని ప్రశ్నలు వేశారు. 1988లో వంగవీటి రంగాను టీడీపీ వారు హత్య చేసిన తర్వాత జరిగిన ఘటనలలో అరెస్టు అయిన కాపువర్గం వారిని విడిపించడానికి పవన్ ఏమైనా పనిచేశారా అని ముద్రగడ అడిగారు. అలాగే గత టరమ్ లో కాపులు అసలు రోడ్డు ఎక్కడానికి కారణం పవన్ అని ఆయన తేల్చి చెప్పారు. పవన్ మద్దతుతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత కాపు రిజర్వేషన్ ఊసే పట్టించుకోకపోతే ఉద్యమం వచ్చిందని, ఆ సందర్భంలో ఎన్నడైనా ఉద్యమానికి పవన్ మద్దతు ఇచ్చారా? ఆ కేసులలో ఉన్నవారికి సంఘీభావంగా పవన్ నిలిచారా? తుని వద్ద రైలు దగ్ధం తర్వాత కేసులలో ఇరుక్కున్న కాపులకు అండగా ఏమైనా పవన్ నిలబడ్డారా? ఇలా ప్రశ్నల పరంపరకు ముగింపుగా కాకినాడలో చంద్రశేఖరరెడ్డిపై కాని, పిఠాపురంలో తనపై కాని పోటీ చేయడానికి సవాల్ విసరాలని కూడా ముద్రగడ సలహా ఇచ్చారు.
వీటిలో ఒక్కదానికి కూడా పవన్ వద్ద సమాధానం లేదు. అందుకే ఆయన ఈ విషయాలను దాటవేస్తూ ఏవేవో సోది కబుర్లు చెప్పుకుంటూ యాత్ర నడుపుతున్నారు. పవన్ వ్యాఖ్యలపై వైసిపి నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందిస్తూ గుడ్డలూడదీస్తాం.. అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు అదే భాషలో సమాధానం ఇచ్చారు. అది పవన్ కనుక విని ఉంటే సిగ్గుతో తలదించుకోవల్సిందే. ప్రముఖ నటుడు , చలనచిత్ర అభివృద్ది సంస్థ అధ్యక్షుడు పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ వంగవీటి రంగాను చంపించిన చంద్రబాబుతో జత ఎలా కడతావని ప్రశ్నించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అనుకున్నది ఒకటి అయితే జరిగింది మరొకటి. ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలలో ఉన్న కాపు వర్గాన్ని సమీకరించి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కానుకగా సమర్పించాలని అనుకున్న పవన్ కళ్యాణ్ వ్యూహం గందరగోళం గా మారి బెడిసికొట్టినట్లనిపిస్తుంది. చివరికి కాపు సామాజికవర్గమే ఆయనను చీత్కరించుకునే పరిస్థితి తెచ్చుకోవడం బాధాకరం. అంతేకాక పవన్ కళ్యాణ్ వల్ల కాపు సామాజికవర్గం వారు ఇతర వర్గాలలో పలచన అవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. తన రాజకీయ స్వార్ధం కోసం ఏపీలో ప్రతిష్టాత్మకంగా జీవించే సామాజికవర్గాలలో ఒకటిగా ఉన్న కాపు వర్గాన్ని పవన్ కళ్యాణ్ వీధిన పడేయడం సముచితం కాదని వారు భావిస్తున్నారు.
:కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment