సినిమాల్లో హీరో ఎన్ని విన్యాసాలైనా చేయవచ్చు కానీ.. నిజజీవితంలో మాత్రం అలా చేయడం సాధ్యం కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సినిమా, నిజజీవితాల మధ్య తేడా పెద్దగా తెలిసినట్లు కనిపించడం లేదు. లేదంటే అతడిది ఓవర్‌యాక‌్షన్ అయినా అయిఉండాలి. కాదంటే అనుభవ రాహిత్యమా? కక్ష సాధింపా? ఈ మాటలన్నీ అనాల్సి వచ్చేందుకు కారణం.. పవన్‌కళ్యాణ్ ఇటీవలి ఢిల్లీ పర్యటన! ఇందులో ఆయన ప్రధాని నరేంద్రమోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.
మర్యాదపూర్వకంగానో.. తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధించిన వారితోనో కలిస్తే సమస్య లేదు. కానీ రాజకీయ విశ్లేషకులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యేలా ఆయన ఎవరెవరినో కలిసివచ్చారు. పవన్ తన ఢిల్లీ పర్యటన ద్వారా తానూ చంద్రబాబు ఒకటేనని చెప్పదలచినట్టుగా కనిపిస్తోంది. ఢిల్లో బాబు కంటే తనమాటకే ఎక్కువ విలువ, పలుకుబడి ఉన్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నమూ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కాకినాడ పోర్టును సందర్శించిన వైనం, అక్కడ ఆయన చేసిన షో కూడా అందులో ఒక భాగం కావచ్చు. బీజేపీ పెద్దలు చేసిన సూచనల మేరకే పవన్ కళ్యాణ్ తనకు పవర్ ఉందని ప్రజలను నమ్మించేందుకు పోర్టు వద్దకు వెళ్లారని, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, తనకంటే సీనియర్ అయిన టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును కూడా కొంత కించపరిచేలా వ్యవహరించారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ఏపీలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆయన చెప్పకనే చెప్పేశారు కూడా. ఆ రకంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని గబ్బు పట్టిస్తూనే, మరో వైపు ఆ గబ్బుతో తనకు సంబంధం లేదన్నట్లుగా పవన్ నటిస్తున్నారా అన్న సందేహం వస్తోంది. చంద్రబాబు సమక్షంలో అతి వినయం, అతి విధేయత చూపుతూ, అవసరానికి మించి ఆయనను పొగిడే పవన్ కళ్యాణ్ బయట మాత్రం తానే సూపర్ సీఎం అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారా అన్న సంశయం వస్తోంది. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ప్రభుత్వంలో మొత్తం పెత్తనం చేస్తున్నారని అంతా అనుకుంటున్న సమయంలో తనకు కూడా పవర్ ఉందని చెప్పుకోవడానికి పవన్ తంటాలు పడ్డారా అన్న ప్రశ్న వస్తుది. మరో సంగతి కూడా చెబుతున్నారు. పోర్టు యాజమన్యంపై ఉన్న కక్ష తీర్చుకోవడానికి అక్కడకు వెళ్లి ఉండవచ్చని అంటున్నారు. మరుసటి రోజు పోర్టును నిర్వహిస్తున్న అరబిందో సంస్థపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేయడమే ఇందుకు నిదర్శనం.
కాకినాడ పోర్టు వద్ద సుమారు 640 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతోందని జిల్లా కలెక్టర్ గుర్తించి స్వాధీనం చేసుకుంటే, వపన్ కళ్యాణ్ వెళ్లాక మళ్లీ సీజ్ చేసినట్లు చూపే యత్నం చేశారట. జనసేనకే చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడ పవన్ కళ్యాణ్ నటన చూసి బిత్తరపోవడం మినహా ఏమీ చేయలేక పోయారు. నిజానికి పవన్ కన్నా రాజకీయాలలో మనోహర్‌కు చాలా అనుభవం ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మనోహర్ 2004లోనే ఎమ్మెల్యే. ఆ తర్వాత ఉప సభాపతిగా, సభాపతిగా బాధ్యతలు నిర్వహించారు.
అనూహ్య పరిణామాలలో జనసేనలో చేరారు. ఇప్పుడు మంత్రి అయ్యారు. కానీ పవన్ తీరుతో ఆయన బిక్కచచ్చినట్లు నిలబడిపోయారా అన్న భావన కలుగుతోంది. మనోహర్ ఇప్పటికి పలుమార్లు కాకినాడ వెళ్లి పోర్టు ద్వారా అక్రమంగా ఎగుమతి అయ్యే రేషన్ బియ్యం గురించి పలుమార్లు మాట్లాడారు. అధికారులను అప్రమత్తం చేశారు. ఎంత మంత్రి ఆదేశాలు ఇచ్చినా, ఇలాంటివి కొన్ని జరుగుతూనే ఉంటాయి. వాటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ.
పవన్ పౌరసరఫరాల శాఖలో వేలుపెట్టి ఇలా కెలకడం అంటే నాదెండ్లను ఒకరకంగా అవమానించినట్లే అవుతుందేమో! వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై ఉన్న ద్వేషంతో కూడా పవన్ కళ్యాణ్ ఇదంతా చేస్తున్నారని అందరికి తెలుసు. పవన్ ఈగోని సంతృప్తిపరచడానికి మంత్రి మనోహర్ తన వంతు ప్రయత్నం చేశారు.కాని ద్వారంపూడి అసలు బియ్యం ఎగుమతి వ్యాపారం నుంచే తప్పుకోవడంతో వీరికి దొరకడం లేదని అంటారు. ఆ ఫ్రస్టేషన్ లో నేరుగా ఆ విషయం చెప్పలేక పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు అనిపిస్తుంది.
కాకినాడ పోర్టులో కొన్ని దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగుతున్నాయి. అక్కడ ఎప్పుడూ తీవ్రమైన నేరాలు జరిగిన ఫిర్యాదులు లేవు. ఆ మాటకు వస్తే విశాఖ ఓడరేవుకు శాసనసభ ఎన్నికలకు ముందు పాతిక వేల క్వింటాళ్ల మేర మాదకద్రవ్యాలు వచ్చాయన్న వార్త పెద్ద కలకలం రేపింది. ఆ కేసును సీబీఐ టేకప్ చేస్తుందని అన్నారు. ఆ కేసు ఏమైందో తెలియదు. దీనిపై పవన్ ఎన్నడూ నోరు విప్పలేదు. అక్కడకు వెళ్లలేదు.ప్రశాంతంగా ఉండే కాకినాడ వెళ్లి రచ్చ చేసి వచ్చారు. తత్ఫలితంగా కాకినాడ పవన్ ఓడరేవు విశ్వసనీయతను దెబ్బతీశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పిచ్చి ఆరోపణలు చేసి ఆ దేవాలయం పవిత్రతను దెబ్బతీశారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి.
ఇప్పుడు కాకినాడ ఓడరేవు వంతు వచ్చింది. పవన్.. కాకినాడ పోర్టు స్మగ్లర్ల అడ్డాగా ఉందని, బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా? అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి, ప్రధాని కార్యాలయ దృష్టికి తీసుకెళతానని చెప్పారు ఆయన. కీలకమైన సమాచారం ఏదైనా ఉంటే నేరుగా కేంద్రానికి తెలియచేసి చర్యలు తీసుకోవాలి తప్ప, ఇలా బాధ్యత లేకుండా మాట్లాడడం ఏమిటో? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోర్టుల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ దళాలు సముద్రంలో నిరంతరం కాపలా కాస్తుంటాయి. ఈ విషయం పవన్‌కు తెలియదా? బియ్యం లేదా మరో సామగ్రి అక్రమంగా ఎగుమతి అవడం వేరు.. ఏకంగా ఆయుధాలు రావడం, ఉగ్రవాదులు చొరబడడం వేరు. ఈ సంగతులు ఏమీ కేంద్రానికి తెలియవన్నట్లుగా పవన్ మాట్లాడి, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల పరువు తీసినట్లు అనిపిస్తుంది. ఓడరేవులలో కొన్ని అక్రమ కార్యకలాపాలు జరుగుతుండవచ్చు.నిర్దిష్ట సమాచారంతో సంబంధిత నేరగాళ్లను పట్టుకుంటారు. ఉదాహరణకు గుజరాత్ లోని ముంద్రా రేవులో పలుమార్లు డ్రగ్స్ పట్టుబడ్డాయి.
కస్టమ్స్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ మాటకు వస్తే దేశంలోని పలు విమానాశ్రయాలలో కూడా బంగారం, ఇతర వస్తువులు కొన్ని అక్రమంగా దిగుమతి అవుతుంటే అధికారులు పట్టుకుంటుంటారు. అయినా జాగ్రత్తలు చెప్పడం వేరు. మన ప్రతిష్టను మనమే దెబ్బ తీసుకోవడం వేరు. పవన్ చెప్పింది ఎలా ఉందంటే కాకినాడ వద్ద అంతా ఫ్రీ గా ఉనట్లు, రక్షణే లేనట్లు ,ఉగ్రవాదులు ఎవరైనా చొరబడే అవకాశం ఉందన్న సమాచారం ఇచ్చినట్లు ఉంది. ఇలా మాట్లాడడం అంత తెలివైన చర్య కాదని చెప్పాలి. ఆర్డీఎక్స్ వంటివి కూడా దిగుమతి కావచ్చని చెప్పడం అంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వ శాఖల సమర్థతను డైరెక్టుగా అనుమానించడమే.
ఎన్నికల ముందు ఏపీలో 31వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ అబద్దపు ఆరోపణ చేసి, ఆ తర్వాత దాని గురించే మాట్లాడకుండా పవన్ తన నిజస్వరూపం తెలియచేశారు. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారా? లారీల ద్వారా అక్రమ బియ్యం కాకినాడ పోర్టుకు చేరుతున్నదంటే ఏమిటి దాని అర్థం? రాష్ట్రంలోని ఆయా రహదారులలో ఉండే సివిల్ సప్లై చెక్ పోస్టులు లేదా వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులు సరిగా పనిచేయడం లేదనే కదా! అధికారులు నిద్రపోతున్నట్లో, లేక కుమ్మక్కు అయినట్లు చెప్పడమే కదా! కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు బియ్యం స్మగ్లింగ్ జరగబోదని చెప్పినా, ఇలా ఎందుకు జరుగుతోంది.
అంటే చంద్రబాబు ప్రభుత్వం, మంత్రి నాదెండ్ల మనోహర్, పోలీసు శాఖ విఫలం అయిందని పవన్ ఒప్పుకున్నట్లేనా? జిల్లా మంత్రిగా ఉన్న ఆయన కూడా విఫలమైనట్లేనా? తను వస్తున్నానని తెలిసి ఎస్పీ సెలవు పెట్టి వెళ్లారని పవన్ అన్నారట. ఆయన ఎందుకు అలా చేశారో తెలుసుకోవాలి. ఏదైనా సొంత పని ఉండి వెళ్లారా? లేక తెలిసి, తెలియక పవన్ మాట్లాడే వాటికి సమాధానం ఇవ్వడం కష్టం అని వెళ్లారో చూడాలి. ఏపీలో సాగుతున్న విధ్వంసకాండ, హత్యలు, అత్యాచారాలపై స్పందించలేని పవన్ కళ్యాణ్, పోర్టులో ఏదో జరిగిపోతుందని మాట్లాడడం విడ్డూరమే.
తాడిపత్రి, జమ్మలమడుగు కూటమి నేతలు చేస్తున్న బూడిద దందా గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది కదా! కొద్ది కాలం క్రితం ప్రజలు ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారని, హోం మంత్రి అనిత ఏమి చేస్తున్నారని అడుగుతూ, తానే ఆ శాఖ తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎలా మాట మార్చేసింది చూశాం. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును అధికారుల సమక్షంలోనే మందలించినట్లు మాట్లాడి చిన్నబుచ్చారు. వీటన్నిటి ద్వారా తాను చంద్రబాబు సమానమే అన్నట్లుగా పవన్ ప్రవర్తిస్తున్నారు. నిజంగా ఆ ధైర్యం ఉంటే మంచిదే. తప్పు లేదు. కానీ ఆ వెంటనే చంద్రబాబు దగ్గకు వెళ్లగానే జారిపోతున్నారు. అది అసలు సమస్య. ప్రభుత్వ వైఫల్యాలతో తనకు నిమిత్తం లేనట్లుగా, సూపర్ సిక్స్ హామీల ఊసే ఎత్తకుండా కథ నడుపుతూ ప్రజలను మభ్య పెట్టడానికి ఇలాంటి వేషాలన్నీ వేస్తే సరిపోతుందా? అక్రమాలు ఎక్కడా జరిగినా నిరోధించాల్సిందే. కానీ పవన్ ఒక్క కాకినాడ పోర్టులోనే అంతా జరిగిపోతున్నట్లు మాట్లాడి రాష్ట్రం పరువును, ముఖ్యంగా కాకినాడ ప్రతిష్టను దెబ్బతీయడం అభ్యంతరకరం.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment