జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్‌ల ప్రకటనల తీరు తమాషాగా ఉంది.టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత దానిని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో అమోదించడానికి జరుపుకున్న సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అనండి.. ఉపన్యాసం అనండి.. యధా ప్రకారం జనసేన క్యాడర్ కు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మాట్లాడారు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి తగ్గి ఉండాలని సూచించడం విశేషం. లోకేష్ మాత్రం జగన్ ను వ్యతిరేకించేవారు ఎవరితోనైనా కలిసి పని చేస్తామని చెప్పడం ద్వారా పార్టీ బలహీనతను మరోసారి తెలియచెప్పినట్లయింది.
✍️మొత్తం మీద ఇద్దరు నేతలు వైసీపీ బలంగా ఉందన్న సంగతిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంగీకరిస్తుండడం గమనించదగ్గ అంశమే. తెలుగుదేశం మీడియాలో వచ్చిన పవన్ వ్యాఖ్యలను పరిశీలిద్దాం. ముఖ్యమంత్రి జగన్‌ను సాగనంపాకే అదికార పంపిణీ అని అన్నారు. అంటే ఏమిటి దాని అర్ధం. జనసేన విడిగా పోటీ చేయదా?అన్న సంశయం వస్తుంది. కొద్ది రోజుల క్రితం పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పేరుతో కార్యకర్తలకు విడుదల అయిన ఒక లేఖ లోని అంశాలకు ఈ పాయింట్లు దగ్గరగానే ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి అది ఎవరైనా సృష్టించిన లేఖేమో అన్న సంశయం ఉండేది. కాని ఇప్పుడు పవన్ చేసిన ప్రకటనతో ఆ సందేహం చాలావరకు తగ్గుతుంది. ఆ లేఖలో టీడీపీ గుర్తుతోనే పోటీచేయవలసి ఉంటుందని, అందువల్ల టీడీపీవారితో గొడవపడవద్దని చెప్పినట్లుగా ఉంది.
✍️సరిగ్గా అవే మాటలు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. వైసీపీని ఓడించిన తర్వాతే అధికార పంపిణీ అంటే బహుశా టీడీపీ గుర్తు అయిన సైకిల్ గుర్తుపైనే జనసేన వారు కూడా పోటీచేస్తారా అన్న డౌటు వస్తుంది. జనసేనకు ఇంతవరకు ఉన్న గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం రద్దు చేసినందున ఇలా చేస్తారేమో తెలియదు. మామూలుగా అయితే ఒక రిజిస్టర్డ్ పార్టీగా వారు కోరుకున్న గుర్తును సామూహికంగా ఆ పార్టీ అభ్యర్ధులకు కేటాయిస్తారు. కాని దానికన్నా రెండు పార్టీలు కలిసి ఒకే గుర్తుపై పోటీచేయాలని భావిస్తున్నారేమో తెలియదు.సాధారణంగా రెండు పార్టీలు ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలో నిర్ణయాంచుకుంటాయి. అలాగే ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఎంత కాలం ఉండాలో నిర్దేశించుకోవచ్చు.
✍️అయితే పవన్ కళ్యాణ్ తనకు సీఎం పదవి అక్కర్లేదని చెప్పి ఉంటే ఈ అవసరం ఉండదు. ఒకే గుర్తుమీద అంతా పోటీచేస్తే సాంకేతికంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికైనవారంతా ఒకే పార్టీవారు అవుతారు. 1983లో సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ పక్షాన నలుగురు ఉమ్మడి ఏపీలో పోటీచేశారు. వారంతా టీడీపీ గుర్తు సైకిల్ సింబల్ పైనే పోటీచేశారు.ఆ ప్రయోగం ఏమైనా జరుగుతుందేమో తెలియదు. కేవలం జాతీయ పార్టీలలో మాత్రమే ఎవరైనా ఒక నేతనే ముఖ్యమంత్రి అభ్యర్ది అంటే గ్రూపుల గొడవ ఉంటుందని ఎన్నిక తర్వాతే సీఎంను నిర్ణయిస్తామని చెబుతుంటారు. ఉదాహరణకు తెలంగాణ ఎన్నికలలో పోటీచేస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన సీఎం అభ్యర్ధిని ప్రకటించబోమని , ఎన్నికలలో గెలిచాకే నిర్ణయిస్తామని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. ప్రాంతీయ పార్టీలలో అలా ఉండదు. ఎందుకంటే ఎవరో ఒకరే ప్రదాన నేతగా ఉంటారు కనుక. అదే రెండు ప్రాంతీయ పార్టీలో, లేక ఒక ప్రాంతీయ పార్టీ, మరో జాతీయ పార్టీ పొత్తు పెట్టుకుని పోటీచేస్తే సీఎం పదవి, టిక్కెట్ల కేటాయింపు మొదలైనవాటిపై ముందే ఒక అవగాహనకు రావచ్చు.
✍️అయితే వీటిలో ఏదో ఒక పార్టీ బాగా పెద్దదయితే వారి నాయకత్వానికి రెండో పార్టీ ఓకే చేయవచ్చు. 2009లో టీడీపీ నాయకత్వానికి టిఆర్ఎస్, సిపిఐ,సిపిఎం లు అంగీకరించి మహాకూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు అదే తరహాలో పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకత్వానికి అంగీకరించారా అన్నది స్పష్టం చేయలేదు.అంటే టీడీపీ అదినేత చంద్రబాబు లేదా లోకేష్‌లలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి పవన్ ఓకే చేస్తే చెప్పలేం.
అందుకే జగన్ ను సాగనంపాకే అధికార పంపిణీ, రాజు ఎవరు? మంత్రి ఎవరు అనేది వైసీపీని ఓడించాకే అని అన్నారా అనుమానం కలుగుతుంది. తద్వారా సీఎం పదవిలో వాటా వదలుకున్నారేమో ననిపిస్తుంది. ఇదే నిజమైతే పవన్ తరపున గతంలో టీడీపీ నేతలు చెప్పినట్లు ఓ పదో, పరకో సీట్లు తీసుకున్నా నడిచిపోతుంది. వారు కూడా టీడీపీ గుర్తుపైనే పోటీచేస్తే రెండు గుర్తుల ఇబ్బంది రాదు. కాకపోతే జనసేన క్యాడర్ అంతా తీవ్ర నిరుత్సాహానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తోడు తెలుగుదేశం వారు ఒక మాట అన్నా నొచ్చుకోవద్దని, మాట జారవద్దని పవన్ అన్నారట. అలాగే లోకేష్, బాలకృష్ణల మధ్య నిలబడి పొత్తు ప్రకటన చేసినంతమాత్రాన మనం బలాన్ని అతిగా ఊహించుకోవద్దని చెప్పారు.
✍️ఇవన్ని ఏమి సూచిస్తున్నాయి. టీడీపీకి ఆయన పూర్తి స్థాయిలో సరెండర్ అయ్యారా? అన్న ప్రశ్న వస్తుంది. ఒకవేళ టీడీపీ గుర్తు మీద జనసేన అభ్యర్ధులు కూడా పోటీచేస్తే, గెలిచినవారంతా టీడీపీ ఎమ్మెల్యేలే అవుతారు.ఆ తర్వాత అధికారం వస్తే అప్పుడు సీఎం సీటును పవన్ అడిగితే మాత్రం టీడీపీ నేతలు అంగీకరిస్తారా?అన్నది చర్చనీయాంశమే. ఈ రెండు పార్టీలు కలిసినా జగన్ ను ఓడించడం అంత తేలిక కాదని పవన్ ,లోకేష్ లు ఇప్పటికే ఒప్పుకున్నారు.వీరిద్దరూ కలిసినా వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న అబిప్రాయం ఉంది. అది వేరే విషయం .కాని పవన్ నిజంగానే టీడీపీ గుర్తుమీద తన అభ్యర్దులను కూడా నిలబెట్టే పరిస్థితి వస్తే అప్పుడు జనసేన అన్న పార్టీ ఉనికే లేకుండా పోతుంది.ఇంతకాలం తమకు ఒక పార్టీ ఉందన్న భావనలో ఉన్న కాపు సామాజికవర్గంకాని, పవన్ అభిమానులు కాని ఈ పరిణామాన్ని భరించగలుగుతారా? ఇప్పటికే టీడీపీకి జనసేనను తాకట్టు పెట్టారని పార్టీలోని కొన్ని వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపద్యంలో అధికారంలోకి వచ్చాకే రాజు ఎవరు, మంత్రి ఎవరు అనేది నిర్ణయం అంటే దాని అర్దం టీడీపీకి పూర్తిగా లొంగిపోవడమే అవుతుంది కదా అన్న విశ్లేషణ వస్తుంది.మరో సందర్భంలో 2024 లో జనసేన తగినన్ని స్థానాలతో అసెంబ్లీలో అడుగుపెడతామని, టీడీపీతో అధికారం ఎలా పంచుకోవాలి?ముఖ్యమంత్రి పదవా? మరొకటా అన్నది తర్వాత ఆలోచిద్దాం అంటే దాని అర్దం ఏమిటో ఆయన వివరించాలి.
✍️అవసరమైతే సీఎం పదవిని వదలుకోవడానికి సిద్దమైనట్లే అవుతుంది కదా! చంద్రబాబుకాని, లోకేష్ కాని, తాము పవన్ కు సమాన అవకాశం ఇస్తామని, ఆయన సీఎం అవుతారని చెబితేనే తప్ప జనసేన క్యాడర్ ఈ ప్రకటనను నమ్మకపోవచ్చు. మరో చిత్రం ఏమిటంటే ఎన్డీఏ.లో లేని టీడీపీతో పొత్తు ప్రకటించి, తాను ఇంకా ఎన్డీఏలో ఉన్నానని చెప్పడం, మోడీ మద్దతుతోనే టీడీపీ,జనసేన కలిసివెళతాయని అనడం అంతా గందరగోళంగా ఉంది.మోడీని ప్రధానిగా మళ్లీ చూడాలని అనడం ద్వారా బీజేపీని మచ్చిక చేసుకునే యత్నం కనిపిస్తుంది. వారిని ఒక పక్క అవమానిస్తూ ,ఇంకో పక్క ఇలా మాట్లాడడం బుగ్గగిల్లి జోలపాడడమే అవుతుంది. అయితే బీజేపీ ఏపీ అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ పరిణామాన్ని తమకు అవమానంగా పీల్ అవుతున్నట్లు లేరు. ఆమె జనసేనతో తమకు పొత్తు ఉందని చెబుతూ, తాము కూడా చంద్రబాబు అరెస్టును ఖండించామని అనడం గమనించాల్సిందే. మరో వైపు లోకేష్ తాము జగన్ ను వ్యతిరేకించేవారెవ్వరితోనైనా కలుస్తామని అనడం ద్వారా అవసరమైతే కాంగ్రెస్ ఆద్వర్యంలోని ఐ.ఎన్.డి. కూటమితో కలుస్తామని చెప్పినట్లు అనిపిస్తుంది. ఈ మూడు పార్టీల నేతలు తాము ఎంత గందరగోళంలో ఉన్నది తెలియచేస్తున్నారు. వైసీపీని ఓడించలేమన్న భయంతో వీరు ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నది వీరి ప్రకటనలే తెలియచేస్తున్నాయి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment