‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రూ. 6 వేలకోట్లకుపైగా భారం!’’, ‘‘అభివృద్ధికి రోడ్ మ్యాప్’’.. ఈ రెండింట్లో ఏది ప్రజలకు సంబంధించిన వార్త? ఏది భజంత్రీ వాయించే వార్త? ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించవలసిన సమయం ఆసన్నమైంది. ప్రజలను తప్పుదారి పట్టించడానికి, మోసం చేయడానికి ఈనాడు , ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ,ప్రజలు అసలు సమస్యపై దృష్టిపెట్టకుండా ఉండడంకోసం పచ్చి మోసపూరితంగా కథనాలు ఇస్తున్నాయి.
.. నిజంగానే ఏపీ అభివృద్ధికి రోడ్ మ్యాప్ ఉంటే రాయడం తప్పని ఎవరూ చెప్పరు. కానీ ఏపీలోని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన ఒక వర్గం మీడియా ఓ రాజకీయపార్టీకన్నా హీనంగా మారి పచ్చి అబద్ధాలను రాస్తోంది.
ఏపీలో వచ్చే ఐదేళ్లపాటు కరెంట్ చార్జీలు పెంచబోమని, పైగా అవసరమైతే 30శాతం చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు రూ.6వేలకోట్లకుపైగా చార్జీలను సర్దుబాటు పేరుతోనో, మరో పేరుతోనో పెంచుతున్నారంటే అది వాగ్ధానభంగం అవుతుందా? కాదా? దీనిపై ప్రజల్లో నిరసన వస్తుంటే దాన్ని కప్పిపుచ్చడానికి ఓ రాజకీయ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు కుట్రలకు పన్నవచ్చు. అందులోను అది ఆయన సహజ లక్షణంకూడా. ఉదాహరణకు కరెంటు చార్జీల పెరుగుదలను డైవర్ట్ చేయడం కోసం సరిగ్గా ఇదే టైమ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ కింద ఒక బండ ఇచ్చి పండగ చేసుకోమని చెబుతున్నారు.ఇందులో చాలా మతలబులు ఉన్నాయి.అరకోటిమందికి ఎగనామం పెట్టడం, ముందుగానే ప్రజలు డబ్బు కట్టాలని చెప్పడం తదితర అంశాలుఉన్నాయి.విషయం ఏమిటంటే గ్యాస్ బండ ద్వారా నెలకు వచ్చే రాయితీ సుమారు రెండువందల రూపాయలు. అయితే..
కరెంటు చార్జీల బాదుడు వల్ల ప్రజలపై పడే భారం సుమారు 400 రూపాయలుగా ఉంటుంది. ఇక నిత్యావసర సరుకుల ధరలు,వంట నూనెల ధరల పెరుగుదలపై జనం గగ్గోలు పెడుతున్నారు. ఇవన్ని లెక్క వేస్తే జనంపై కనీసం ఏడు, ఎనిమిది వందల రూపాయల అదనపు భారం పడుతోంది.ఇతర హామీల సంగతి సరేసరి. టీడీపీ కన్నా దారుణంగా ఎల్లో మీడియా పన్నాగాలు పన్నుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈఆర్సీ సిఫార్సులమేరకు కొద్దిపాటి సర్దుబాటు చార్జీలు పెంచినా ఇంకేముంది అంటూ గగ్గోలు పెట్టిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇప్పుడు వేలకోట్ల భారం వేస్తున్నా కనిపించడం లేదు. చార్జీలు పెంచడం కూడా అభివృద్ధికి రోడ్ మ్యాప్ అని ప్రజలు అనుకోవాలని అన్నట్టుగా అభూతకల్పనలు సృష్టించి కథనాలు వండుతున్నారు.
అలాగే జగన్ సోదరి షర్మిలను అడ్డం పెట్టుకొని ఆమెతో పిచ్చిప్రకటనలు చేయించి, అదేదో ప్రజా సమస్య అన్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ, షర్మిల అంశానికి ముగింపు పలికి ప్రజాసమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ,కూటమి నయవంచనలను బహిర్గతం చేయాలని నిర్ణయించింది. నెలకొక అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. అందులో భాగంగానే జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి కూడా టీడీపీ పూనుకుందని ఆ పార్టీ పేర్కొంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కలిసిందన్న ఆరోపణ, ముంబాయి నటి జత్వానీ వ్యవహారం, ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల కుట్ర, మదనపల్లె ఫైల్స్..ఇలా రకరకరాల అంశాలను ప్రచారం చేస్తూ చంద్రబాబు కాలం గడుపుతున్నారు. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు తలుచుకోకుండా చూడాలనేది వారి ప్రయత్నం. షర్మిల ఇష్యూకు సంబంధించి అసలు స్పందించకుండా ఉంటే వైఎస్సార్‌సీపీకి ఇబ్బందిగా ఉండేది. అందువల్ల ఆమె చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వక తప్పదు.
ఇక దాన్ని ముగించి జనంలోకి కీలకమైన అంశాలను తీసుకుపోయే లక్ష్యంతో జగన్ కూడా కరెంట్ చార్జీల పెంపు దీపావళి కానుకా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే చార్జీలు పెంచబోమని, 30 శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారని అందుకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తూ తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని ప్రజలు క్షమించరని రాజకీయ పార్టీగా తాము చూస్తూ వూరుకోబోమని జగన్ హెచ్చరించారు. పైగా ఈ ప్రభుత్వంలో పెంచుతున్న చార్జీలకు కూడా వైఎస్సార్‌సీపీ కారణమని ప్రచారం చేయడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ఈ కరెంటు చార్జీల పెంపు విషయంగానీ, జగన్ వ్యాఖ్యలుగానీ ఎల్లోమీడియాకు అసలు వార్తలే కాదు. అభివృద్ధికి రోడ్డు మ్యాప్ అంటూ మోసపూరిత కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఇది కూడా డైవర్షన్ లో భాగమని అర్థం చేసుకోవచ్చు.
లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన, పారిశ్రామికీకరణ అతి పెద్ద సవాళ్లు అని వీటిని అధిగమించడం ఆషామాషీ కాదని ఈ మీడియాకు ఇప్పుడు తెలిసింది.నిరుద్యోగులకు నెలకు మూడువేల రూపాయల భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీని విస్మరించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అది చేసింది, ఇది చేసింది అంటూ బ్యాండ్ వాయించింది. మరి ఇదే మీడియా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమల గురించిగానీ, పెట్టుబడులగురించిగానీ ఎన్నడూ ఒక్క మంచిమాట రాయలేదు. జగన్ తీసుకొచ్చిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల గురించి ఎప్పుడూ వ్యతిరేక వార్తలే రాసింది. జగన్ టైమ్‌లో మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రంగంలో వస్తుంటే దాన్ని ఎలా చెడగొట్లాలా అని తెగ ఆరాటపడింది.ఆ కంపెనీలకు భూములు ఇవ్వడమే తప్పన్నట్టుగా రాసింది.
ఇప్పుడేమో చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తోంది అని, వరాల వర్షం కురిపిస్తోంది అని బాకా ఊదుతోంది. తాజాగా వచ్చిన కథనం ప్రకారం రామాయంపేట, మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లను కూడా ప్రైవేట్ పరం చేయాలని తలపెట్టి వీటన్నిటికీ బిడ్లు పిలిచారు. గతంలో గంగవరం పోర్టులో కొద్దిపాటి ప్రభుత్వవాటాను విక్రయిస్తేనే నానాయాగీ చేసిన ఎల్లో మీడియా తెలుగుదేశం, జనసేన కూటమి ఇప్పుడు మొత్తం రూ. వేలకోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రైవేట్ కు అప్పగించడానికి సిద్దపడుతోంది.
టీడీపీ,జనసేన మేనిఫెస్టోలో అన్నా క్యాంటీన్లను ప్రభుత్వమే నడుపుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఛారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి కంపెనీలనుంచి, జనంనుంచి విరాళాలు సేకరిస్తారట. మరి ఇది వాగ్ధానభంగమో లేక ఇంకేమనాలో ఆలోచించుకోవచ్చు. దీనికి ఆదాయపన్ను మినహాయిస్తారంటూ ఈనాడు బిల్డప్ ఇచ్చింది. అన్నా క్యాంటీన్లలో నాసిరకం ఆహారం పెడుతున్నారని సామాన్యులు వాపోతున్న విషయాన్ని మాత్రం చెప్పరు. వరద పడగొట్టింది, పరిహారం నిలబెట్టింది అంటూ ఈనాడు మీడియా రైతులకు వరద సాయం చేయడంతో, వారంతా విత్తనాలు వేశారని ,దాంతో మళ్లీ పచ్చదనం వచ్చేసిందంటూ మొదటి పేజీలో ప్రచారం చేసింది. చంద్రబాబు అధికారంలో ఉంటే జనం సంగతేమోగానీ, ఈనాడుకు అంతా పచ్చగా కనిపిస్తుందని,అదేదో ఇప్పుడే జరుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చింది. ఇవన్నీ ఉదాహరణలే అవుతాయి.
మరో పత్రిక ఆంధ్రజ్యోతి అయితే జగన్ ఆస్తులు పెరిగాయంటూ ఒక కథనాన్ని జనంమీదకు వదిలింది. ఇదేదో ఇప్పుడు కొత్తగా రాసిన వార్త కాదు. ఇప్పటికి పలు సార్లు రాసిన వార్త. మళ్లీ మళ్లీ రాస్తున్నారంటే చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి అని అర్థం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు 1989లో తన ఆదాయం ఎంతని ప్రకటించారు.. మరి ఆయనదిగానీ, ఆయన కుటుంబ ఆస్తిగానీ ప్రస్తుతం ఎన్ని రెట్లు పెరిగిందో ఎందుకు రాయడం లేదు? ఇవన్నీ చూస్తే ఒకటి మాత్రం స్పష్టం. కరెంట్ చార్జీలు విపరీతంగా పెరుగుదల , హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపెట్టడానికి కూటమి ప్రభుత్వ నేతలకన్నా, ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పడుతున్న తంటాలే ఎక్కువగా ఉన్నాయని అర్ధం అవడం లేదూ!.
::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment