తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ కాక పెంచుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు హోరాహోరీ పోరు సలుపుతూ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. నాయకులను ఆకర్షించడంలో కూడా పోటీ పడుతున్నాయి. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ను బిజెపి ఆకర్షిస్తే శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ , మరో నేత దాసోజు శ్రావణ్,మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ లను బిజెపి నుంచి టిఆర్ఎస్ ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ నేతలు గతంలో ప్రత్యర్ధి పార్టీలపై చేసిన విమర్శలు, ప్రతి విమర్శలకు తూచ్ పెట్టారని అనుకోవచ్చు.
నాలుగు రోజుల క్రితం కూడా స్వామి గౌడ్ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విరుచుకుపడ్డారట. కాని అంతలోనే కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకం ఉన్నవారందరిని తమ పోల్డ్ లోకి తీసుకోవాలని నిర్ణయించుకుని వారికి ఆహ్వానం పంపడం,వారు చేరిపోవడం ఆసక్తికర పరిణామం.స్వామిగౌడ్ గతంలో ఉద్యోగ సంఘ నేత. ఆయనకు కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక ఇచ్చారు. తదుపరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చైర్మన్ చేశారు. కాని ఈ పదవికాలం చివరిలో వీరిద్దరి మద్య ఎక్కడ తేడా వచ్చిందో కాని మాటలు లేకుండా పోయాయి.గౌడ్ ఒకప్పుడు మంత్రి పదవి ఆశించినట్లు చెబుతారు. దాని సంగతేమోకాని, టిఆర్ఎస్ కే రామ్ రామ్ అని చెప్పవలసి వచ్చింది. కాగా తాజాగా ఎలాంటి ఒప్పందం కుదిరిందో కాని తిరిగి స్వగృహానికి చేరుకున్నారు.
ఇక శ్రావణ్ అయితే తొలుత ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలలో క్రియాశీలం అయ్యారు. తదుపరి ఆయన టిఆర్ఎస్ లో చేరి కేసిఆర్ కు సన్నిహితంగా మెలిగారు. కాని రాష్ట్ర సాధన తర్వాత తగు ప్రాధాన్యం లభించలేదని అలిగి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందారు. పిసిసి అధ్యక్షుగా ఉత్తంకుమార్ రెడ్డిని తప్పించి ,రేవంత్ రెడ్డిని నియమించడం, తదుపరి ఖైరతాబాద్ నేత విజయారెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకోవడంతో ఆగ్రహం చెంది శ్రావణ్ బిజెపిలోకి వెళ్లారు. మంచి వాదనా పటిమ కలిగిన శ్రావణ్ తిరిగి టిఆర్ఎస్ లో చేరారు. ఆయనకు భవిష్యత్తులో ఎలాంటి పదవి వస్తుందో తెలియదు. టిఆర్ఎస్ ను వీడకుండా ఉన్నట్లయితే ఈపాటికే ఏదో ఒక పదవి వచ్చి ఉండేదేమో!.
రాపోలు ఆనందభాస్కర్ ఒకప్పుడు జర్నలిస్టు. తదుపరి కాంగ్రెస్ పక్షాన గాంధీ భవన్ లో యాక్టివ్ గా ఉండేవారు. ఆ తరుణంలో బిసి వర్గంవారికి రాజ్యసభ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ అదిష్టానానికి రావడం, ఆ చాన్స్ రాపోలుకు దక్కడం జరిగింది. పదవీకాలం ముగిసిన కొన్నాళ్లకు ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. ఇప్పుడు టిఆర్ఎస్ గూటికి వెళ్లారు.
వీరే కాదు. ఆయా గ్రామాలలో సర్పంచ్ లు, మండల పరిషత్ సభ్యులు, జడ్పిటిసి సభ్యులు ఇలా ఒక్కో కేటగిరికి ఒక్కో రేటు పెట్టి టిఆర్ఎస్ ,బిజెపిలు కొనుగోలు చేస్తున్నాయన్నది కాంగ్రెస్ ఆరోపణ.చికెన్, మద్యం బాటిళ్లు తెగ సప్లై చేస్తున్నారట. బస్ లలో ఇతర ప్రాంతాలకు టూర్ తీసుకువెళుతున్నారట. ఇలా ఎన్నెన్నో విన్యాసాలు చేస్తున్నారు. చివరికి బిజెపి అధ్యక్షుడు నడ్డాకు సమాధి కట్టిన వైనం శోచనీయంగా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ పదవికి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఇది అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నిక. ఆయన గెలిస్తే బిజెపి గెలిచినట్లుగా దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. బిజెపి ఓడిపోతే అది రాజగోపాలరెడ్డి ఖాతాలోకి వెళుతుంది. టిఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రభాకరరెడ్డికి ఆ సమస్య లేదు. టిఆర్ఎస్ గెలిచినా, ఓడినా అది ముఖ్యమంత్రి కెసిఆర్ , వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఖాతాలోకే వెళుతుంది. అందువల్ల ఇది కెసిఆర్, కెటిఆర్ లకు ఇది సవాల్ వంటిది. కెటిఆర్ స్వయంగా మునుగోడుపై దృష్టి పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన బిజెపి పెద్దలను, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ పెద్దలు, గద్దలు, దొంగలు అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజగోపాలరెడ్డికి 18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని అంటూ వివాదాస్పదం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ముడిపెడుతున్నారు.
దుబ్బాక, హుజరాబాద్ లలో ఓటమి నేపధ్యంలో టిఆర్ఎస్ ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తపడుతోంది. అందుకే 86 మంది ఎమ్మెల్యేలను మునుగోడులో రంగంలో దించింది. బిజెపి కూడా పోటాపోటీగా తమ పార్టీ నేతలను ప్రచారంలో పెట్టింది.టిఆర్ఎస్ గుజరాత్ దొంగలు అంటూ విమర్శలు చేస్తుంటే, కెటిఆర్ నియోజవర్గం సిరిసిల్లను, కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు టిఆర్ఎస్ అన్యాయం చేస్తోందని బిజెపి నేతలువిమర్శలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ లో ఇప్పటికి మల్లగుల్లాలు సాగుతున్నాయి. తనను ఒంటరి చేయడానికి కాంగ్రెస్ లో కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ కంటతడి పెట్టారన్న వార్త ఆ పార్టీకి నష్టం చేసింది. బిజెపి,టిఆర్ఎస్ లు కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపణలు చేసినా పెద్ద ఫలితం ఉండడం లేదు.
పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్నా , ఆర్ధికంగా చూస్తే బిజెపి, టిఆర్ఎస్ లతో పోటీ పడే పరిస్థితి ఉండదు. ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ ఎమ్.పి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడైన బిజెపి అభ్యర్ధి రాజగోపాలరెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు లీక్ అయిన ఆడియో కలకలం సృష్టిస్తోంది. ఇవన్ని కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలలో ఒకటి అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసే యత్నం చేసిందన్న ప్రహసనం, అదంతా టిఆర్ఎస్ చిల్లర రాజకీయం అన్న బిజెపి ఆరోపణతో తెలంగాణ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది.
Comments
Please login to add a commentAdd a comment