కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్నది ఎవరో ప్రజలకు తెలియాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి కాపాడుతున్న పెద్దన్న ఎవరో చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నాటకం ఆడుతూ, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అంట కాగుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా బీజేపీ నేతలు ఈ అంశంపై మాట్లాడటం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంపై ఈడీ జరిపిన దాడుల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ దాడిలో రూ.వందల కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వస్తున్నాయని, 2 వారాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ సంఘటన తాలూ కు ఒక్క విషయం బయటకి రాలేదని కేటీఆర్ తెలిపారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన రూ.40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉపయోగించిందని స్వయంగా తన ప్రకటనలో ఈడీ వెల్లడించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు జరగకపోవడం, దారి మళ్లిన నిధుల తాలూకు అంశంపైనా ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం పట్ల కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment