సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో ఉద్దేశ్యపూర్వకంగా తమపై బురద జల్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయినా మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, హరీశ్‌రావు తాను ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రభుత్వ శ్వేతపత్రాలకు కౌంటర్‌గా ఆదివారం ఉదయం తెలంగాణ భవన్‌లో స్వేద పత్రం విడుదల చేసే సందర్భంగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.50 లక్షల కోట్ల సంపద సృష్టించినట్లు చెప్పారు.
‘అసెంబ్లీలో పూర్తిస్థాయిలో మాకు మాట్లాడే అవకాశమివ్వకపోయినా మేం ఇచ్చిన సమాధానాలకు ప్రభుత్వం పారిపోయింది. బీఆర్‌ఎస్ పాలనలో మూడు లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే దానిని 6 లక్షల 71 వేల కోట్లుగా ప్రభుత్వం చూపించింది. ప్రభుత్వ శ్వేతపత్రాలన్నీ తప్పుల తడకలు. తొమ్మిదేళ్లలో రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపాం. విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్లాం’ అని కేటీఆర్ తెలిపారు.
60 ఏళ్ల గోస 10 ఏళ్లలో మాయం చేసి చూపించాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ నాయకులు మరొకసారి శ్వేతపత్రాల పేరుతో మోసం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో సంక్షేమం, కరెంటు,వ్యవసాయం, చెరువులు, పల్లె,పట్టణ ప్రగతి లాంటి అంశాలను ప్రాధాన్య క్రమంలో తీసుకుని పనిచేశాం.రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణం ప్రారంభించాం. దీని ఫలితంగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం డబుల్ అయిందని’అని కేటీఆర్ వివరించారు.
విద్యుత్, సాగునీరు,తాగునీరు రంగాల్లో బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో పెట్టిన పెట్టుబడులు, చెమటోడ్చి సృష్టించిన ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వడ్డించిన విస్తరి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం. కాలువలు కడితే 200 టీఎంసీల నీళ్లు పొలాల్లో పారేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాళేశ్వరంలోని చిన్న మేడిగడ్డ బ్యారేజ్‌లో ఏదో తప్పు జరిగిందని నిందిస్తున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధం’అని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment