సాక్షి,హైదరాబాద్: నాది మేనేజ్‌మెంట్ కోటా అయితే సీఎం రేవంత్‌రెడ్డిది పేమెంట్ కోటా అని మాజీ మంత్రి,సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ఢిల్లీలో మేనేజ్ చేసి పీసీసీతో పాటు సీఎం పదవి రేవంత్ తెచ్చుకున్నారని తాము చెప్పడం లేదని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డే చెప్పారన్నారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
కాగా, డ్రగ్స్ సప్లై చేసే వాళ్లు ఎంత పెద్దవాళ్లైనా ఊచలు లెక్కించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. టీఎస్ న్యాబ్‌కు డీజీ స్థాయి అధికారిని నియమించామని చెప్పారు. టీఎస్ న్యాబ్‌కు గతంలో ప్రభుత్వమే ఏర్పాటుచేసినప్పటికీ వారికి అవసరమైన రూ.30 కోట్లు నిధులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పంజాబ్ పరిస్థితి తెలంగాణ రాకూడదన్నారు.
ఇదే విషయమై కేటీఆర్ మాట్లాడుతూ డ్రగ్స్‌పై ప్రత్యేక టీఎస్ న్యాబ్‌ను ఏర్పాటు చేసి సీవీ ఆనంద్ లాంటి అధికారిని నియమించింది తామేనని చెప్పారు. పంజాబ్‌ను డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడానికి కాంగ్రెస్ కారణం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎం అయినందుకు తెలంగాణ ప్రజలు సిగ్గు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇసుక దోపిడీపై శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానన్న విషయం మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఇంకా గాంధీ భవన్‌లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఇసుకపై కేవలం రూ. 40కోట్ల ఆదాయం వచ్చింది. 2014 నుంచి 2023 వరకురూ. 5వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇసుక మాఫియా బీఆర్‌ఎస్‌ది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ జరిగింది. నేరెళ్ళలో ఇసుక మాఫియా అనే విమర్శలు చేయడం ఇప్పుడు కొత్త కాదు. పదే పదే చెప్తూనే వస్తున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా నేరెళ్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నాకే మెజార్టీ వచ్చింది’అని కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment