టెండర్ల అవకతవకల్లో సీఎం బావమరిదికి భాగస్వామ్యం
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతున్న అంశంలో జోక్యం చేసుకొని నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్‌లాల్ కట్టర్, టోచన్ సాహూలకు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1,500 కోట్లు విలువ చేసే పనులు ముఖ్యమంత్రి సొంత బావమరిది కంపెనీకి అర్హతలు లేకున్నా కట్టబెట్టారన్న ఆరోపణల్లో నిజాలు బయట పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఈ అంశంలో సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి బావమరిది ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నారన్నారు. అమృత్ పథకంలో గత తొమ్మిది నెలలుగా జరిగిన ప్రతి టెండర్లను సమీక్షించి, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేసిన ఓ కంపెనీకి దాదాపు 40 శాతానికి పైగా అంచనాలు పెంచి మరీ పనులను అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అమృత్ టెండర్ల సమాచారాన్ని బహిర్గతం చేయాలని, టెండర్లు దక్కించుకున్న కంపెనీల వివరాలను ప్రజల ముందు పెట్టాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సుజన్‌రెడ్డికి చెందిన కంపెనీ ఇతర కంపెనీలతో కలిసి రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఎలాంటి అర్హతలు లేకున్నా దక్కించుకుంటున్న విషయాన్ని తన లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్టు పనులను సృజన్‌రెడ్డి కంపెనీతోపాటు గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక ఆరోపణలు చేసిన సదరు కంపెనీతో పాటు మరో కంపెనీకి అప్పజెప్పినట్టు కేటీఆర్ తన లేఖలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కేఎన్‌ఆర్ కంపెనీలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డికి వాటాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తగిన చర్యలు తీసుకోకుంటే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న అవినీతి కార్యక్రమాల్లో కేంద్రానికి కూడా భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్ముతారని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment