Amrit
-
అమృత్ టెండర్లలో అక్రమాలపై కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: అమృత్ టెండర్లలో అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజ్ఞప్తి చేసేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ దగ్గరికైనా వెళ్దామని అన్నారు. అమృత్ టెండర్లలో తప్పు జరిగిందని తేలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పొంగులేటి సవాల్‌ను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. ‘ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని కోరదాం. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పు జరగలేదని అంటే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా. హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రిగారికి ఇబ్బంది ఉందంటే డేట్, టైం ఫిక్స్ చేస్తే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) దగ్గరికి పోదాం. ఒకవేళ మీరు రాకపోయినా వచ్చే వారంలో సీవీసీకి ఆధారాలు సమర్పిస్తా. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రికి ఒకటే చెప్తున్నా.. ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలి..’ అని కేటీఆర్ అన్నారు. సోదరుడు, బావమరిది ఆ స్థాయికి ఎలా ఎదిగారో సీఎం చెప్పాలి ‘సీఎంను పొంగులేటి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి పొంగులేటి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు చట్టాలు మాత్రమే కాదు చుట్టరికాలు కూడా తెలిసినట్టు లేదు. భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలి. సొంత బావమరిది కంపెనీకి లాభం చేకూరిస్తే బంధువని అనడమేంటి?. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్‌తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నేను ప్రస్తావించిన నేపథ్యంలో పొంగులేటి ఆగమేఘాల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కానీ రూ.1,137 కోట్ల అవినీతి జరిగినా, ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలి. ఢిల్లీకి కప్పం కట్టేందుకే అవినీతి కేవలం రూ.2 కోట్ల లాభం ఉన్న బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే సీఎం సోదరుడు జగదీశ్‌రెడ్డి రూ.వెయ్యి కోట్లుం, బావమరిది సూదిని సృజన్‌రెడ్డి రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయికి ఎలా ఎదిగారనే విషయాన్ని రేవంత్‌రెడ్డి చెప్పాలి. పొంగులేటి సంస్థకు దక్కిన కొడంగల్ ఎట్టిపోతల కాంట్రాక్టుల గురించి త్వరలో మాట్లాడతా. ప్రజల తరఫున మంత్రులు, ముఖ్యమంత్రి అవినీతిని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఢిల్లీకి కప్పం కట్టేందుకు ప్రభుత్వం ఈ భారీ అవినీతికి తెగబడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించిన అంశంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మొదలు ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు..’అని కేటీఆర్ విమర్శించారు. సింగరేణి కార్మికుల పొట్ట కొడుతున్నారు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.. ‘దసరా బోనస్ కాదు బోగస్’అని కేటీఆర్ విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు పంచుతున్నట్లు గొప్పలు చెప్పుకుని కేవలం 16.9% మాత్రమే ఇచ్చారు. కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోంది., పండుగ వేళ ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోంది. ప్రతి కార్మికుడికి రూ.1.8 లక్షల నష్టం జరుగుతుంది. సింగరేణి నికర లాభం రూ.4,701 కోట్లు. ఇందులో కార్మికులకు 33 శాతం వాటా కింద రూ.1,551 కోట్లు పంచాలి. ఒక్కో కార్మికుడికి రూ.3.7 లక్షల చొప్పున అందాలి. కానీ కేవలం రూ.796 కోట్లను మాత్రమే కార్మికులకు పంచుతున్నారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. సింగరేణి లాభాల్లో వాటాపై కార్మికులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఒక్కో కార్మికుడికి అత్యధికంగా 32 శాతం వాటా ఇచ్చామని చెప్పారు. -
అమృత్ టెండర్లలో అవినీతి నిగ్గు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతున్న అంశంలో జోక్యం చేసుకొని నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్‌లాల్ కట్టర్, టోచన్ సాహూలకు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1,500 కోట్లు విలువ చేసే పనులు ముఖ్యమంత్రి సొంత బావమరిది కంపెనీకి అర్హతలు లేకున్నా కట్టబెట్టారన్న ఆరోపణల్లో నిజాలు బయట పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఈ అంశంలో సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు.ముఖ్యమంత్రి బావమరిది ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నారన్నారు. అమృత్ పథకంలో గత తొమ్మిది నెలలుగా జరిగిన ప్రతి టెండర్లను సమీక్షించి, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేసిన ఓ కంపెనీకి దాదాపు 40 శాతానికి పైగా అంచనాలు పెంచి మరీ పనులను అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అమృత్ టెండర్ల సమాచారాన్ని బహిర్గతం చేయాలని, టెండర్లు దక్కించుకున్న కంపెనీల వివరాలను ప్రజల ముందు పెట్టాలన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సుజన్‌రెడ్డికి చెందిన కంపెనీ ఇతర కంపెనీలతో కలిసి రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఎలాంటి అర్హతలు లేకున్నా దక్కించుకుంటున్న విషయాన్ని తన లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్టు పనులను సృజన్‌రెడ్డి కంపెనీతోపాటు గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక ఆరోపణలు చేసిన సదరు కంపెనీతో పాటు మరో కంపెనీకి అప్పజెప్పినట్టు కేటీఆర్ తన లేఖలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కేఎన్ఆర్ కంపెనీలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డికి వాటాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తగిన చర్యలు తీసుకోకుంటే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న అవినీతి కార్యక్రమాల్లో కేంద్రానికి కూడా భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్ముతారని కేటీఆర్ హెచ్చరించారు. -
గుడ్‌న్యూస్: అత్యధిక వడ్డీ స్కీమ్ గడువు పొడిగింపు
Amrit Kalash Deposit Scheme Deadline Extended: కష్టపడి పోగుచేసుకున్న సొమ్మును భద్రపరచుకునేందుకు ఉత్తమమైన మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అయితే వడ్డీ రేట్లు పొదుపుచేసే కాలానికి (టెన్యూర్) అనుగుణంగా ఉంటాయి. అలాగే సాధారణ ప్రజలు, మహిళలు, సీనియర్ సిటిజెన్లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వడ్డీ రేటుతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అత్యధిక వడ్డీని ఇచ్చే ‘అమృత్ కలశ్’ (Amrit Kalash) స్కీమును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొన్ని నెలల క్రితం ప్రకటించింది. ప్రత్యేక పథకం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ప్రత్యేక అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీని మరోసారి పొడిగించింది. సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లకు అందించే అన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లోనూ అత్యధిక వడ్డీని అందించే పథకం ఇదే. ఎస్బీఐ అమృత్ కలశ్ అనేది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ స్కీమ్. ఈ పథకం 2023 ఏప్రిల్ 12 నుంచి అమలవుతోంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీని ఎస్బీఐ అందిస్తుంది. గత ఫిబ్రవరి 15న అధికారింగా లాంచ్ అయిన ఈ స్పెషల్ స్కీమ్ గడువును ఎస్బీఐ పలుసార్లు పెంచుతూ వచ్చింది. ఆగస్ట్ 15వ తేదీతోనే గడువు ముగిసినప్పటికీ తాజాగా మరోసారి డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి: శ్రావణమాస వేళ శుభవార్త: తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి -
తెలంగాణలో 39 అమృత్ భారత్ స్టేషన్లు.. రైల్వే స్టేషన్లకు కొత్తరూపు
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా తెలంగాణలోని మొత్తం 39 రైల్వే స్టేషన్లను గుర్తించి వీటిని సంపూర్ణంగా ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదటి విడతగా 21 స్టేషన్లకు సంబంధించిన పనులను ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ‘అమృత్ భారత్ స్టేషన్ల’పథకంలో భాగంగా.. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి ప్రయాణి కులకు వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వై–ఫై సదుపాయాన్ని కల్పిస్తారు. అదేవిధంగా స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు ‘వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్’దుకాణాలు, ప్రయాణీకులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు ఏర్పాటు చేస్తారు. స్టేషన్ ముందు, వెనక భాగాల్లో మొక్కల పెంపకంతో పాటు చిన్న గార్డెన్లు కూడా నెలకొల్పుతారు. ఇక స్టేషన్ల అవసరాలకు అనుగుణంగా బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనున్నారు. వీటికి తోడుగా నగరానికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడం, దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్ బాటలు, రూఫ్ ప్లాజాలు (అవసరాన్ని బట్టి), దీర్ఘకాలంలో అవసరమయ్యే నిర్మాణాలను ఈ పథకంలో భాగంగా చేపట్టనున్నారు. కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే 40 ఏళ్ల అవసరాలు తీర్చేవిధంగా అభివృద్ధి చేసేందుకు రూ.715 కోట్లు, చర్లపల్లి టరి్మనల్ అభివృద్ధికి రూ.221 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మొత్తం గుర్తించిన స్టేషన్లు 39: ఆదిలాబాద్, బాసర్, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్ (నాంపల్లి), జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మలక్‌పేట్, మల్కాజ్గిరి, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్‌నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగుళాంబ, తాండూర్, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్‌పురా, జహీరాబాద్. ∙మొదటి విడతలో ఆగస్టు 6న పనులు ప్రారంభం కానున్న 21 స్టేషన్లపై రూ.894 కోట్లు ఖర్చుచేయనున్నారు. -
ఆరోగ్యానికి వారధి
‘అనుభవాలే పాఠాలు అవుతాయి’ అనే మాటను అనేకసార్లు విని ఉన్నాం మనం.మరి అనుభవాలే అంకురాలు (స్టార్టప్) అవుతాయా?‘వై నాట్!’ అంటున్నారు మయాంక్ కాలే (27), అమృత్‌సింగ్ (27)మూడు పదుల వయసు దాటకుండానే హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’తో ఘన విజయం సాధించి సత్తా చాటారు.స్టార్టప్‌కు సామాజిక కోణం జత చేసి విజయవంతం అయ్యారు... యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్(యూఎస్)లో చదువుకునే రోజుల్లో చదువును మధ్యలోనే ఆపేయాలని మయాంక్, అమృత్‌లు నిర్ణయించుకున్నప్పుడు వారి వారి తల్లిదండ్రులకు ఎంతమాత్రం నచ్చలేదు.‘ఇంతకీ ఏంచేయాలనుకుంటున్నారు?’ అని అడిగారు.తమ భవిష్యత్ చిత్రపట్టాన్ని రంగుల్లో చూపారు మయాంక్, అమృత్‌లు.వారి వారి తల్లిదండ్రులకు నచ్చిందో లేదో తెలియదుగానీ ‘ముందు చదువు పూర్తి చేయండి. ఆతరువాత ఆలోచిద్దాం’ అన్నారు. ఇప్పుడు చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి మనం..మయాంక్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తండ్రికి గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. దీంతో ఒక్కగానొక్క కొడుకైన మయాంక్ ఆఘమేఘాల మీద ఇండియాకు వచ్చాడు. తండ్రి సమస్య సర్జరీ వరకు వెళ్లింది.ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కు ప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడుగానీ చాలామంది హాస్పిటల్స్‌కు వెళ్లడం లేదు. ఇది తన దృష్టిలో నిలిచిపోయింది. యూనివర్సిటీకి తిరిగి వెళ్లిన తరువాత అమృత్‌తో కలిసి పేషెంట్ల హెల్త్‌కేర్‌కు సంబంధించి డిజిటల్ హెల్త్‌కేర్ రికార్డ్లను క్రియేట్ చేసే సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశాడు. దీన్ని మహారాష్ట్రలోని గడ్చిరోలి గ్రామీణ్రపాంతాలలో విజయవంతంగా ప్రయోగించారు.ఈ విజయం వారిలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.చదువులు పూర్తయిన తరువాత ఇండియాకు వచ్చారు మయాంక్, అమృత్. గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో రకరకాల అప్లికేషన్లను డెవలప్ చేయడంప్రా రంభించారు.మన జనాభాలో అతి కొద్దిమందికి మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా చాలామందిలో ‘మెడికల్ ఎడ్యుకేషన్’ ఉండడం లేదు. దీనివల్ల వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లి లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వర్క్‌ప్లేస్ ఇన్సూరెన్సులు పెరుగుతున్నాయి. అయితే వ్యక్తిగత (రిటైల్) ఇన్సూరెన్స్‌లు తగ్గాయి. దీనికి కారణం ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి పాలసీలు తీసుకోవాలి... మొదలైన విషయాలపై అవగాహన లేకపోవడం... ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పుణె కేంద్రంగా హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’కు శ్రీకారం చుట్టారు మయాంక్, అమృత్‌సింగ్.‘లూప్’ ద్వారా వైద్య విషయాలపై అవగాహనతో పాటు, ప్రైమరీ కేర్ (్రపాథమిక ఆరోగ్య సంరక్షణ)కు సంబంధించి డాక్టర్‌తో యాక్సెస్, ఫ్రీ కన్సల్టెషన్లు, ఆన్లైన్ యోగా సెషన్స్... మొదలైన ప్రయోజనాలు ఉన్నాయి. కంపెనీలకు, ఇన్సూరెన్స్ప్రొవైడర్లకు మధ్య ‘లూప్’ సంధానకర్తగా వ్యవహరిస్తోంది.దిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె...మొదలైన పట్టణాలలో ఎన్నో కంపెనీలతో కలిసి పనిచేస్తోంది లూప్.‘మయాంక్, అమృత్లకు భారతీయ ఆరోగ్య వ్యవస్థపై మంచి అవగాహన ఉంది. అందుబాటులో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో లూప్ భవిష్యత్‌లో ఎంతోమందికి సహాయంగా నిలవనుంది’ అంటున్నాడు గురుగ్రామ్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ‘ఎలివేషన్ క్యాపిటల్’ భాగస్వామి ఖందూజ. ప్రస్తుతం ఉద్యోగుల హెల్త్–చెకప్‌కు ఉద్దేశించిన ఫిజికల్ ‘లూప్–క్లీనిక్’లపై ట్రయల్స్ చేస్తున్నారు.‘లూప్’ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది.మయాంక్ (కో–ఫౌండర్ అండ్ సీఈఓ, లూప్), అమృత్ (కో–ఫౌండర్, లూప్)ల లక్ష్యం ఫలించింది అని చెప్పడానికి ఇది చాలు కదా! ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కుప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. -
అమృత్, స్మార్ట్ సిటీస్ కు 7296 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్), స్మార్ట్ సిటీ మిషన్లకు రూ. 7296 కోట్లను కేటాయించారు. ఇందులో అమృత్ పథకానికి రూ. 4091 కోట్లు, స్మార్ట్‌సిటీస్ మిషన్‌కు రూ. 3205కోట్లు కేటాయించారు. 100 నగరాలను ఎంపిక చేసి అందులో తొలి విడతగా టాప్-20 నగరాలను అభివృద్ధి (తాగునీరు, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, సాంకేతికత, కనీస మౌలిక వసతులు వంటివి) చేసేందుకు గత నెలలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో నగరానికి ఐదేళ్లపాటు రూ.500కోట్ల నిధులిస్తారు. -
అమ్మకానికి ‘అమృత్’
నిరుపేదలకు నీడనిచ్చే పథకంపైనా అధికార తెలుగుదేశం పార్టీ వర్గరాజకీయ క్రీ డ ప్రభావం పడుతోంది. ఆ పార్టీ నాయకుల స్వార్థపు నీడ పరుచుకుంటోంది. కేంద్రం అమలు చేస్తున్న ‘అమృత్’ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి జరుగుతున్న జుగుప్సాకరమైన పరిణామాలే అందుకు నిదర్శనం. ఓ సంక్షేమ పథకాన్ని లాభసాటి వ్యాపారంగా మలచుకుంటున్న నీతిమాలినతనమిది. ఆ పార్టీలోని అంతర్యుద్ధంతో అర్హులు దగా పడుతున్న వైనమిది. పిఠాపురం : ప్రతి పట్టణాన్నీ సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ‘అమృత్’ పేరిట ప్రవేశపెట్టిన పథకం పిఠాపురంలో అధికార టీడీపీలో ఎమ్మెల్యే వర్గనేతలకు ‘వ్యాపారం’గా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా నిరుపేదలకు కేటాయించాల్సిన ఇళ్లకు ఆ వర్గం నేతలు రూ. లక్ష చొప్పున రేట్టు కట్టి అమ్ముకుంటున్నారని ఇతరులే కాక ఆ పార్టీలోని ఎంపీ వర్గీయులే దుయ్యబడుతున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలకు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గ కౌన్సిలర్లకే లబ్ధిదారుల ఎంపిక అవకాశం కల్పించి - మిగతా 2లోఠ ఎంపీ వర్గానికి మొండిచేయి చూపుతున్నారని, ఎంపీ వర్గానికి చెందిన కౌన్సిలర్లున్న చోట వారిని పక్కన పెట్టి, ఎమ్మెల్యే అనుకూల టీడీపీ నేతలకు పెత్తనం ఇస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. అంతేకాక తమ వర్గంలో చేరితేనే ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అవకాశం ఇస్తామని ఎర వేస్తున్నారని వాపోతున్నారు. ‘అమృత్’ను తొలుత జిల్లాలో కాకినాడ, రాజమండ్రి కార్పోరేషన్లలోనే అమలు చేయాలని ప్రతిపాదించినా తర్వాత పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో కూడా అవకాశం కల్పించారు. తొలివిడతగా రెండు లే అవుట్లలో రూ.50.69 కోట్లతో 874 జీ ప్లస్ 1 గృహాలు నిర్మించడానికి చర్యలు చేపట్టారు. వీటిలో ఎస్సీలకు 294, ఎస్టీలకు 31, బీసీలకు 247, మైనార్టీలకు 14, ఇతరులకు 288 కేటాయించారు. లబ్ధిదారుడి వాటాగా రూ.50 వేలు చెల్లించాల్సి ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో ఇంటినీ రూ.5.10 లక్షల వ్యయంతో నిర్మిస్తారుు. తెలుపు రేషన్‌కార్డు కలిగిన వారు అర్హులు. బయూనా రూ.20 వేలు.. పట్టణం సమీపంలో గోర్స లే అవుట్లో 11.21 ఎకరాల్లో 596, రైల్వేగేటు సమీపంలోని లేఅవుట్లో 5.25 ఎకరాల్లో 278 గృహాల నిర్మాణానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. లబ్ధిదారుల ఎంపిక పక్రియ ఇక్కడ పూర్తయ్యాక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, కేంద్ర స్టీరింగ్ కమిటీల పరిశీలన ల తరువాత మాత్రమే గృహాలు మంజూరవుతాయి. ఇవేమీ పట్టించుకోని ఎమ్మెల్యే వర్గీయులు లబ్ధిదారుల ఎంపికలో రాజకీయం, వ్యాపారం ప్రారంభించారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.లక్షకు బేరం కుదుర్చుకుని, అడ్వాన్సుగా రూ.20 వేలు తీసుకుంటూ, మిగిలిన సొమ్ము ఇల్లు మంజూరయిన వెంటనే ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. అయితే ఎంపికల అవకాశానికి ఎంపీ వర్గానికి చెందిన కౌన్సిలర్లను, నాయకులను పక్కన పెట్టడంతో ఈ విషయం బహిర్గతమై పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇరువర్గాల మధ్యా రగులుతున్న చిచ్చు ఈ ఇళ్ల వ్యాపారంతో మరింత ప్రజ్వరిల్లిందంటున్నారు. కొందరికే అవకాశం ఇస్తున్నారు.. కొన్ని వార్డుల్లో కౌన్సిలర్లకే ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు అవకాశం ఇచ్చారు. మాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. వర్గాల పోరులో మా హక్కులు కాలరాస్తున్నారు. మావార్డులో ప్రజాప్రతినిధినైన నాకు తెలియకుండా మరోనేతతో ఎంపిక చేయిస్తుండడంతో వార్డు ప్రజలు మమ్మల్ని చీదరించుకుంటున్నారు. - దుర్గాడ విజయలక్ష్మి, 14వ వార్డు కౌన్సిలర్ (టీడీపీ), పిఠాపురం పారదర్శకంగానే లబ్ధిదారుల ఎంపిక అమృత్ పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. తెల్లరేషన్ కార్డు కలిగిన పేదలకు, ఇంతకు ముందు ఎప్పుడు రాష్ట్ర గృహనిర్మాణ పథకంలో లబ్ధి పొందని వారికి, ప్రభుత్వం నుంచి ఇళ్లపట్టాలు తీసుకోని వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరూ ఇతరులు చెప్పే మాటలు నమ్మవలసిన అవసరం లేదు. - కె. సత్యనారాయణ, గృహనిర్మాణ శాఖ డీఈ, పిఠాపురం -
3 ప్రాజెక్టులు.. 4 లక్షల కోట్లు
స్మార్ట్ సిటీలు, అమృత్, అందరికీ ఇళ్ల ప్రాజెక్టులకు నేడు శ్రీకారం ♦ మూడు మెగా ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించనున్న మోదీ ♦ హౌసింగ్ మిషన్ లోగోను ఆవిష్కరించనున్న ప్రధాని ♦ ఇది కొత్త పట్టణ శకానికి నాంది: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ♦ మూడు పథకాలపై రెండు రోజుల వర్క్‌షాపు న్యూఢిల్లీ: నగర భారతాన్ని సమూలంగా మార్చే దిశగా స్మార్ట్ సిటీలు సహా మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. వంద స్మార్ట్ నగరాలు, అటల్ మిషన్ ఫర్ రిజెనువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్(అమృత్), పట్టణ ప్రాంతాల్లో 2022 నాటికి అందరికీ ఇళ్లు పథకాలకు సంబంధించి మార్గదర్శకాలను ప్రధాని విడుదల చేయనున్నారు. అలాగే హౌసింగ్ మిషన్‌కు సంబంధించిన లోగోను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 4 లక్షల కోట్లను ఖర్చుచేయనుంది. ఈ పథకాల మార్గదర్శకాలను రూపొందించడానికి కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థలతో ఏడాదికిపైగా చర్చలు జరిపింది. వీటిపై ప్రధాని మోదీ పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ.. అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలు తెలిపాయి. వంద స్మార్ట్ సిటీల ప్రాజెక్టు కోసం రూ. 48 వేల కోట్లు, అమృత్ కోసం రూ.50 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ గ్రాంటుగా ఐదేళ్ల పాటు అందజేయనున్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు వచ్చే ఏడేళ్లలో సుమారు రూ.3 లక్షల కోట్ల ఖర్చుతో మురికివాడల్లో నివసించేవారు, ఆర్థికంగా బలహీనవర్గాలవారు, అల్పాదాయ వర్గాల వారికి సుమారు 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.2.3 లక్షల చొప్పున సబ్సిడీగా అందించనున్నారు. ఈ మూడు పథకాలు కొత్త పట్టణ శకానికి నాంది అని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కీలక భూమిక పోషించనున్నాయన్నారు. స్మార్ట్ సిటీల పథకంలో భాగంగా ఎంపిక చేసిన వంద నగరాల్లో 24 గంటలు నీరు, విద్యుత్, ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థల ఏర్పాటు, మెరుగైన విద్యా వ్యవస్థ, వినోద సౌకర్యాలు, ఈ గవర్నెన్స్, పర్యావరణహిత వాతావరణ మొదలైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును పీపీపీ మోడల్లో చేపడతామన్నారు. అమృత్ పథకం ద్వారా లక్ష జనాభా దాటిన 500 నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికీ నీటి సౌకర్యం, మెరుగైన వ్యర్థాల నిర్వహణ, మెరుగైన రవాణా సదుపాయం మొదలైన అంశాలపై దృష్టి పెడతామన్నారు. ఈ మూడు పథకాల మార్గదర్శకాల విడుదల అనంతరం రెండు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌లో సుమారు వెయ్యి మంది వివిధ రాష్ట్రాల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ దేశాల ప్రతినిధులు పాలుపంచుకుంటారని చెప్పారు.