నిరుపేదలకు నీడనిచ్చే పథకంపైనా అధికార తెలుగుదేశం పార్టీ వర్గరాజకీయ క్రీ డ ప్రభావం పడుతోంది.
నిరుపేదలకు నీడనిచ్చే పథకంపైనా అధికార తెలుగుదేశం పార్టీ వర్గరాజకీయ క్రీ డ ప్రభావం పడుతోంది. ఆ పార్టీ నాయకుల స్వార్థపు నీడ పరుచుకుంటోంది. కేంద్రం అమలు చేస్తున్న ‘అమృత్’ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి జరుగుతున్న జుగుప్సాకరమైన పరిణామాలే అందుకు నిదర్శనం. ఓ సంక్షేమ పథకాన్ని లాభసాటి వ్యాపారంగా మలచుకుంటున్న నీతిమాలినతనమిది. ఆ పార్టీలోని అంతర్యుద్ధంతో అర్హులు దగా పడుతున్న వైనమిది.
పిఠాపురం :
ప్రతి పట్టణాన్నీ సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ‘అమృత్’ పేరిట ప్రవేశపెట్టిన పథకం పిఠాపురంలో అధికార టీడీపీలో ఎమ్మెల్యే వర్గనేతలకు ‘వ్యాపారం’గా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా నిరుపేదలకు కేటాయించాల్సిన ఇళ్లకు ఆ వర్గం నేతలు రూ. లక్ష చొప్పున రేట్టు కట్టి అమ్ముకుంటున్నారని ఇతరులే కాక ఆ పార్టీలోని ఎంపీ వర్గీయులే దుయ్యబడుతున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలకు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గ కౌన్సిలర్లకే లబ్ధిదారుల ఎంపిక అవకాశం కల్పించి - మిగతా 2లోఠ
ఎంపీ వర్గానికి మొండిచేయి చూపుతున్నారని, ఎంపీ వర్గానికి చెందిన కౌన్సిలర్లున్న చోట వారిని పక్కన పెట్టి, ఎమ్మెల్యే అనుకూల టీడీపీ నేతలకు పెత్తనం ఇస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. అంతేకాక తమ వర్గంలో చేరితేనే ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అవకాశం ఇస్తామని ఎర వేస్తున్నారని వాపోతున్నారు. ‘అమృత్’ను తొలుత జిల్లాలో కాకినాడ, రాజమండ్రి కార్పోరేషన్లలోనే అమలు చేయాలని ప్రతిపాదించినా తర్వాత పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో కూడా అవకాశం కల్పించారు. తొలివిడతగా రెండు లే అవుట్లలో రూ.50.69 కోట్లతో 874 జీ ప్లస్ 1 గృహాలు నిర్మించడానికి చర్యలు చేపట్టారు. వీటిలో ఎస్సీలకు 294, ఎస్టీలకు 31, బీసీలకు 247, మైనార్టీలకు 14, ఇతరులకు 288 కేటాయించారు. లబ్ధిదారుడి వాటాగా రూ.50 వేలు చెల్లించాల్సి ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో ఇంటినీ రూ.5.10 లక్షల వ్యయంతో నిర్మిస్తారుు. తెలుపు రేషన్‌కార్డు కలిగిన వారు అర్హులు.
బయూనా రూ.20 వేలు..
పట్టణం సమీపంలో గోర్స లే అవుట్‌లో 11.21 ఎకరాల్లో 596, రైల్వేగేటు సమీపంలోని లేఅవుట్‌లో 5.25 ఎకరాల్లో 278 గృహాల నిర్మాణానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. లబ్ధిదారుల ఎంపిక పక్రియ ఇక్కడ పూర్తయ్యాక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, కేంద్ర స్టీరింగ్ కమిటీల పరిశీలన ల తరువాత మాత్రమే గృహాలు మంజూరవుతాయి. ఇవేమీ పట్టించుకోని ఎమ్మెల్యే వర్గీయులు లబ్ధిదారుల ఎంపికలో రాజకీయం, వ్యాపారం ప్రారంభించారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.లక్షకు బేరం కుదుర్చుకుని, అడ్వాన్సుగా రూ.20 వేలు తీసుకుంటూ, మిగిలిన సొమ్ము ఇల్లు మంజూరయిన వెంటనే ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. అయితే ఎంపికల అవకాశానికి ఎంపీ వర్గానికి చెందిన కౌన్సిలర్లను, నాయకులను పక్కన పెట్టడంతో ఈ విషయం బహిర్గతమై పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇరువర్గాల మధ్యా రగులుతున్న చిచ్చు ఈ ఇళ్ల వ్యాపారంతో మరింత ప్రజ్వరిల్లిందంటున్నారు.
కొందరికే అవకాశం ఇస్తున్నారు..
కొన్ని వార్డుల్లో కౌన్సిలర్లకే ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు అవకాశం ఇచ్చారు. మాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. వర్గాల పోరులో మా హక్కులు కాలరాస్తున్నారు. మావార్డులో ప్రజాప్రతినిధినైన నాకు తెలియకుండా మరోనేతతో ఎంపిక చేయిస్తుండడంతో వార్డు ప్రజలు మమ్మల్ని చీదరించుకుంటున్నారు.
- దుర్గాడ విజయలక్ష్మి, 14వ వార్డు కౌన్సిలర్ (టీడీపీ), పిఠాపురం
పారదర్శకంగానే లబ్ధిదారుల ఎంపిక
అమృత్ పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. తెల్లరేషన్ కార్డు కలిగిన పేదలకు, ఇంతకు ముందు ఎప్పుడు రాష్ట్ర గృహనిర్మాణ పథకంలో లబ్ధి పొందని వారికి, ప్రభుత్వం నుంచి ఇళ్లపట్టాలు తీసుకోని వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరూ ఇతరులు చెప్పే మాటలు నమ్మవలసిన అవసరం లేదు. - కె. సత్యనారాయణ, గృహనిర్మాణ శాఖ డీఈ, పిఠాపురం