అమృత్‌ టెండర్లలో అక్రమాలపై కేటీఆర్‌ డిమాండ్‌ | BRS Leader KTR Comments On Congress Leaders | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌ జడ్జితో విచారణ: కేటీఆర్‌

Sep 23 2024 4:39 AM | Updated on Sep 23 2024 4:39 AM

BRS Leader KTR Comments On Congress Leaders

తేదీ, సమయం చెబితే సీవీసీ దగ్గరకైనా వెళదాం 

అవినీతి జరగలేదని వారు తేలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా సింగరేణి కార్మికులకు ఇచ్చింది బోగస్‌ అని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: అమృత్‌ టెండర్లలో అక్రమా­లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు విజ్ఞప్తి చేసేందుకు హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి లేదా కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ దగ్గరికైనా వెళ్దామని అన్నారు. అమృత్‌ టెండర్లలో తప్పు జరిగిందని తేలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా­నని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవా­ల్‌ విసిరిన నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మా­ట్లాడారు. 

పొంగులేటి సవాల్‌ను స్వీకరిస్తు­న్నానని స్పష్టం చేశారు. ‘ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్‌ ఇచ్చారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం. వెంటనే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించమని కోరదాం. సిట్టింగ్‌ జడ్జి గనుక ఇందులో తప్పు జరగలేదని అంటే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా. 

హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రిగారికి ఇబ్బంది ఉందంటే డేట్, టైం ఫిక్స్‌ చేస్తే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ) దగ్గరికి పోదాం. ఒకవేళ మీరు రాకపోయినా వ­చ్చే వారంలో సీవీసీకి ఆధారాలు సమర్పిస్తా. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రికి ఒకటే చెప్తు­న్నా.. ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలి..’ అని కేటీఆర్‌ అన్నారు.  

సోదరుడు, బావమరిది ఆ స్థాయికి ఎలా ఎదిగారో సీఎం చెప్పాలి 
‘సీఎంను పొంగులేటి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి పొంగులేటి రాజీనా­మా చేయాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్‌ రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు చట్టాలు మాత్రమే కాదు చుట్టరికాలు కూడా తెలిసినట్టు లేదు. భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలి. 

సొంత బావమరిది కంపెనీకి లాభం చేకూరిస్తే బంధువని అనడమేంటి?. ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నేను ప్రస్తావించిన నేపథ్యంలో పొంగులేటి ఆగమేఘాల మీద ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కానీ రూ.1,137 కోట్ల అవినీతి జరిగినా, ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలి.  

ఢిల్లీకి కప్పం కట్టేందుకే అవినీతి 
కేవలం రూ.2 కోట్ల లాభం ఉన్న బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే సీఎం సోదరుడు జగదీశ్‌రెడ్డి రూ.వెయ్యి కోట్లుం, బావమరిది సూదిని సృజన్‌రెడ్డి రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయికి ఎలా ఎదిగారనే విషయాన్ని రేవంత్‌రెడ్డి చెప్పాలి. పొంగులేటి సంస్థకు దక్కిన కొడంగల్‌ ఎట్టిపోతల కాంట్రాక్టుల గురించి త్వరలో మాట్లాడతా. 

ప్రజల తరఫున మంత్రులు, ముఖ్యమంత్రి అవినీతిని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఢిల్లీకి కప్పం కట్టేందుకు ప్రభుత్వం ఈ భారీ అవినీతికి తెగబడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించిన అంశంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ మొదలు ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు..’అని కేటీఆర్‌ విమర్శించారు. 

సింగరేణి కార్మికుల పొట్ట కొడుతున్నారు 
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.. ‘దసరా బోనస్‌ కాదు బోగస్‌’అని కేటీఆర్‌ విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు పంచుతున్నట్లు గొప్పలు చెప్పుకుని కేవలం 16.9% మాత్రమే ఇచ్చారు. 

కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం దోచుకుంటోంది., పండుగ వేళ ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోంది. ప్రతి కార్మికుడికి రూ.1.8 లక్షల నష్టం జరుగుతుంది. సింగరేణి నికర లాభం రూ.4,701 కోట్లు. ఇందులో కార్మికులకు 33 శాతం వాటా కింద రూ.1,551 కోట్లు పంచాలి. ఒక్కో కార్మికుడికి రూ.3.7 లక్షల చొప్పున అందాలి. 

కానీ కేవలం రూ.796 కోట్లను మాత్రమే కార్మికులకు పంచుతున్నారు..’అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. సింగరేణి లాభాల్లో వాటాపై కార్మికులు స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఒక్కో కార్మికుడికి అత్యధికంగా 32 శాతం వాటా ఇచ్చామని చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement