బీఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో మధుసూదనాచారి, పోచారం, కేకే, వేముల ప్రశాంత్‌రెడ్డి, కవిత, జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేస్తే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విధానాలను ఎండగడతామన్నారు.
తెలంగాణభవన్‌లో సోమవారం జరిగిన నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దళితబంధు, గృహలక్ష్మి, బీసీబంధు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల రద్దు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే ఎంపికైన దళితబంధు, గృహలక్ష్మి, గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలతో నష్టపోతున్న దళితులు, బీసీలకు తాము అండగా నిలుస్తామని చెప్పారు.
శ్వేతపత్రాల పేరిట డ్రామా
ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం అప్పులు, శ్వేత పత్రాల పేరిట డ్రామాలు ఆడుతోందని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో వేశామంటూ కాంగ్రెస్ మభ్యపెడుతోందన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లలో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పనితీరు, పరిపాలన లోపాలను ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పనితీరులో మార్పులుచేర్పులు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సరళి మేరకు బీఆర్‌ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు.
కార్యకర్తలను కలవకుండా అడ్డుపడ్డారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అధిష్టానంతో కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పార్టీ పనితీరు, ఓటమికి కారణాలపై నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ గెలుపు కాదు.. బీఆర్‌ఎస్ ఓటమి : వేముల ప్రశాంత్‌రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మరిచిపోయి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెడదామని కార్యకర్తలు తమకు భరోసా ఇచ్చారని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ది గెలుపు కాదని, బీఆర్‌ఎస్ ఓటమి మాత్రమేనన్నారు. నిజామాబాద్ లోక్‌సభ సన్నాహక సమావేశ అనంతరం తెలంగాణభవన్‌లో ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజాదర్బార్ ప్రహసనంగా మారిందని, సీఎం రేవంత్ నెల రోజుల్లో ఒక్కసారి మాత్రమే పాల్గొన్నారన్నారు.
ప్రజాదర్బార్ ద్వారా నెల రోజుల్లో పరిష్కరించిన సమస్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట ప్రజలను బలిపశువులను చేస్తూ దరఖాస్తుల స్వీకరణ పేరిట రోడ్లపైకి తెచ్చారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు చొప్పున ఇవ్వాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ మీద అక్కసుతో జిల్లాల సంఖ్య తగ్గించాలని రేవంత్ అనుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment