బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తమ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రేవంత్ పాలనలో ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇచ్చిన ఆరు గ్యారంటీలను అటకెక్కించి.. ఏడో గ్యారంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేటీఆర్ ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్‌ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందున ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కక్షతో అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.
ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోలేక నిర్బంధం, అణచివేతతో బీఆర్‌ఎస్ గొంతునొక్కేందుకు రేవంత్ ప్రయతి్నస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం నోటీసు ఇవ్వకుండా గురువారం తెల్లవారు జామున పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలనే విష సంస్కృతికి చరమగీతం పాడాలన్నారు.
ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? : హరీశ్‌రావు
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన పేరిట డబ్బా కొడుతూ, సీఎం రేవంత్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడేది లేదని, తెలంగాణ సమాజమే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెపుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మేడే రాజీవ్ సాగర్, డాక్టర్ వాసుదేవరెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment