నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ సభకు హాజరైన ప్రజలు.. ప్రసంగిస్తున్న కేటీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/చండూరు: తెలంగాణ సొమ్మునే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేస్తోందని, ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కేంద్ర నిధులను మళ్లిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సిగ్గు, విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమె త్తారు. పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే.. రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఇంకా రూ.2 లక్షల కోట్లు కేంద్రమే తీసుకుందన్నారు.
‘ఇది వాస్తవం కాదని నిరూపిస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే నువ్వు రాజీనామా చేస్తావా?..’ అని కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని, ఇప్పుడు మంత్రి పదవిని వదులుకుంటావని అనుకోనంటూ ఎద్దేవా చేశారు. దీనిపై తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కేటీఆర్.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో వివిధ పనులకు శంకుస్థాపన, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
మేం అప్పులు చేయట్లేదు.. పెట్టుబడులు పెడుతున్నాం..
‘బీజేపీ నాయకులు మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు తప్ప, రాష్ట్రానికి వారు చేసిందేమీ లేదు. పైగా సిగ్గు, నీతి లేకుండా రాష్ట్రం అప్పుల పాలైందంటూ మాట్లాడుతున్నారు. మేము చేస్తోంది అప్పులు కాదు. భవిష్యత్ పెట్టుబడులు పెడుతున్నాం. రూ.30 వేల కోట్లతో 5 వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు, రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథను చేపట్టి ఇంటింటికీ నీరు అందిస్తున్నాం. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టి సంపదను పునరుత్పత్తి చేస్తున్నాం. కేసీఆర్ 12 లక్షల మంది పెళ్లిళ్లు చేశారు. 11 లక్షల కేసీఆర్ కిట్లు, 66 లక్షల మందికి రూ.65 వేల కోట్ల రైతుబంధు, 90 వేల మందికి రైతు బీమా అందించిన ఘనత కూడా కేసీఆర్‌దే.
మోదీ ఏ వర్గానికీ న్యాయం చేయలేదు..
ప్రధాని మోదీ ఈ ఎనిమిదిన్నరేళ్ల కాలంలో చేసిన ఏ ఒక్క పనీ ప్రజలకు అక్కరకు రాలేదు. కేంద్రం ఏటా ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? ప్రభుత్వం రంగ సంస్థలు అన్నింటినీ మూసివేస్తు న్నారు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉంటే ఇప్పుడది రూ.2.78 లక్షలకు పెరిగింది. దేశంలో మాత్రం రూ.1.49 లక్షలే ఉంది. దీన్నిబట్టే ఎవరు సమ ర్ధులో, ఎవరు అసమర్ధులో తెలుస్తుంది. దేశంలో 14 మంది ప్రధానమంత్రుల కాలంలో రూ.56 లక్షల కోట్ల అప్పులు ఉంటే ఈ ఎనిమిదిన్నరేళ్ల మోదీ పాలనలోనే రూ.100 లక్షల కోట్ల అప్పు చేశారు. దేశంలోని ప్రతి పౌరునిపై రూ.1.25 లక్షల అప్పు మోపారు.
పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్న మోదీ ప్రభుత్వం ఏ వర్గానికీ న్యాయం చేయలేదు. కేవలం మోదీ దోస్తులే సంపన్నులుగా మారారు..’ అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమకూ దక్కాలంటే బీఆర్‌ఎస్‌కు బాధ్యత అప్పగించాలని ఇతర రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి నమూనాగా చూపించారని, దీంతో కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు అలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నాయని చెప్పారు.
ప్రజల ఆశీర్వాదం ఉండాలి
చండూరు, గట్టుప్పల మండలాల్లో అభివృద్ధి పనులకు కూడా కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదం ఉంటే.. మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, గ్యాదరి కిషోర్, రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment