వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్‌తో మూసీ నది అంతర్ధానం: కేటీఆర్
పదేళ్లు ఒత్తిడి తెచ్చినా మేము నిర్మాణానికి అంగీకరించలేదు
ద్వీపాల్లో ఉండాల్సిన రాడార్ స్టేషన్ తెలంగాణలోనా?
ఏం ఆశించి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు?
పర్యావరణవేత్తలతో కలిసి ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్: నౌకాదళానికి చెందిన రాడార్ స్టేషన్ ఏర్పాటు పేరిట ఓ వైపు మూసీ నదికి మరణం శాసనం రాస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోవైపు సుందరీకరణ పేరిట హడావుడి చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నది అంతర్ధానమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా రాడార్ స్టేషన్ నిర్మాణానికి అంగీకరించలేదన్నారు. పర్యావరణానికి హాని కలిగించే రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి పోరాటం చేస్తామని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేటీఆర్ ప్రకటించారు.
ప్రమాదంలో మూసీ నది
‘వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నౌకాదళానికి సంబంధించిన వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నది ప్రమాదంలో పడుతుంది. ఓ వైపు మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతామంటూనే.. మరోవైపు రాడార్ స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం రేవంత్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఏం ఆశించి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారో సీఎం చెప్పాలి. ఈ నెల 15న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయడంపై బీఆర్‌ఎస్ నిరసన తెలుపుతుంది. దామగుండంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుతో 2,900 ఎకరాల అటవీ భూమి, 12 లక్షల చెట్లను నష్టపోతాం. జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్ స్టేషన్‌ను తెలంగాణలో ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలి’ అని కేటీఆర్ అన్నారు.
మూసీ నది ఎకో–సెన్సిటివ్ జోన్ కాదా?
‘గంగానది జన్మస్థానం గంగోత్రి వద్ద 150 కిలోమీటర్ల పరిధిని కేంద్రం ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించింది. దామగుండంలో ఏర్పాటు చేస్తున్న రాడార్ కేంద్రం వికారాబాద్ అడవుల్లోనే మూసీ జన్మస్థానం ఉంది. అలాంటప్పుడు మూసీ నది జన్మస్థానాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించాలి. గంగా నదికి ఒక న్యాయం.. మూసీకి మరో న్యాయమా? రాడార్ స్టేషన్ ఏర్పాటుతో పర్యావరణ సమతుల్యతకు ప్రమాదం పొంచి ఉంది. మూసీ పేరిట రూ.వేల కోట్ల దోపిడీ చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దేశ రక్షణ విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుంది. కానీ జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ స్టేషన్‌ను దామగుండంలో ఏర్పాటు చేయడాన్ని అంగీకరించం. పర్యావరణ వేత్తలతో కలిసి పోరాటం చేస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment